మోదీ తెలంగాణకు చేసిందేమీ లేదు

ABN , First Publish Date - 2022-05-27T05:00:12+05:30 IST

ప్రధాని మోదీ తెలంగాణ రాష్ర్టానికి చేసిందేమీ లేదని,

మోదీ తెలంగాణకు చేసిందేమీ లేదు

  • విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి


రంగారెడ్డి అర్బన్‌, మే 26 : ప్రధాని మోదీ తెలంగాణ రాష్ర్టానికి చేసిందేమీ లేదని, గురువారం జిల్లాలో పర్యటించిన ఆయన ఈ ప్రాంతానికి ఇస్తానన్న ఐటీఐఆర్‌, పాలమూరు ప్రాజెక్టు జాతీయ హోదా ప్రకటిస్తారేమోనని ఎదురు చూసిన తెలంగాణ ప్రజలు నిరాశే ఎదురైందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అంతేకాకుండా ప్రధాని హోదాకు తగినట్లుగా మాట్లాడక పోవడం బాధించిందన్నారు. ‘బేటీ బచావో, బేటీ పడావో’ అనేది నినాదానికే పరిమితం చేశారని, దేశవ్యాప్తంగా అనేక విద్యాలయాలు ఏర్పాటుచేసి తెలంగాణకు అన్యాయం చేశారన్నారు. సాంకేతికతో ముం దుకు వెళ్తామని, అంధ విశ్వాసాలను నమ్మబోమని చెప్పిన ప్రధాని.. కరోనా సమయంలో చప్పట్లు కొట్టి, దీపాలు వెలిగించడం ఏ సాంకేతికత కిందకు వస్తుందో ప్రజలకు చెప్పాలన్నారు. విభజన హామీలు మరచి, గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ప్యాక్టరీ, కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీలు రాష్ట్రంలో ఎందుకు ఏర్పాటు చేయలేదో చెప్పాలన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకుండా చిల్లిగవ్వ సహాయం చేయని వారు.. నేడు తెలంగాణ గడ్డమీద అభివృద్ధి కోసం పోరాటం చేస్తున్నామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తెలంగాణలో వరి కొనకుండా రైతులకు కేంద్రం ఏ రకంగా మేలు చేస్తుందో చెప్పాలన్నారు. 8 ఏళ్లలో తెలంగాణకు ఏమి చేసారో, ఎన్ని నిధులు ఇచ్చారో చెబితే బాగుండేదని, రాష్ట్రంపై అన్ని విషయాల్లో వివక్ష చూపుతూ, విషం చిమ్మటానికి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ పార్టీ నేతలు విద్వేషాలు రెచ్చగొట్టడానికి మాత్రమే వందశాతం పనిచేస్తున్నారని ఆమె ఆరోపించారు. 


Updated Date - 2022-05-27T05:00:12+05:30 IST