త్రిశంకుస్వర్గంలో గిరిజన విశ్వవిద్యాలయం

ABN , First Publish Date - 2022-07-07T19:45:37+05:30 IST

విభజన చట్టంలోని అనేక అంశాలను అమలు చేయకుండా రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న మోదీ ప్రభుత్వ స్థానాన్ని ఒక అంశంలో జగన్‌ ప్రభుత్వం అధిగమించింది. అదే గిరిజన విశ్వవిద్యాలయం. కేంద్రంలోని

త్రిశంకుస్వర్గంలో గిరిజన విశ్వవిద్యాలయం

విభజన చట్టంలోని అనేక అంశాలను అమలు చేయకుండా రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న మోదీ ప్రభుత్వ స్థానాన్ని ఒక అంశంలో జగన్‌ ప్రభుత్వం అధిగమించింది. అదే గిరిజన విశ్వవిద్యాలయం. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం విభజన చట్టంలోని దుగ్గరాజుపట్నం పోర్టు, కడప ఉక్కు ఫ్యాక్టరీ, విశాఖ, విజయవాడ మెట్రో రైల్‌ వంటివి అమలుచేయడానికి నిరాకరిస్తోంది. కొన్ని విద్యాసంస్థల నిర్మాణానికి సరిపడా నిధులివ్వకుండా నత్తనడకన సాగిస్తోంది. రైల్వే జోన్‌ అయితే కేవలం కాగితాలకు, ప్రకటనలకే పరిమితమయింది. ప్రత్యేక హోదా అటకెక్కేసింది. వెనకబడ్డ రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీలను ఒక ప్రహసనంగా మార్చేసింది. వీటన్నింటిలోనూ మోదీ ప్రభుత్వం చేసిన ద్రోహం కాదనలేని వాస్తవం. అయితే, గిరిజన విశ్వవిద్యాలయం విషయంలో మాత్రం జగన్‌ ప్రభుత్వమే ముద్దాయిగా నిలుస్తోంది. 


విభజన చట్టంలో ట్రైబల్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని సెక్షన్‌ 93 షెడ్యూల్‌ 13(3)లో పేర్కొన్నారు. దీనిని విజయనగరం జిల్లాలో ఏర్పాటుచేయడానికి చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించి, కొత్తవలస మండలం రెల్లి అనే గ్రామంలో 525.08 ఎకరాల భూమిని సేకరించి, ప్రహరీగోడ కూడా నిర్మించింది. కేంద్ర ప్రభుత్వ నిపుణుల బృందం కూడా ఈ స్థలాన్ని పరిశీలించి, అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని భావించి, 2018లో దీనికి గ్రీన్‌ సిగ్నల్‌ కూడా ఇచ్చింది. ఇక నిర్మాణం ప్రారంభించమే తరువాయి అన్న సమయంలో 2019 ఎన్నికలలో జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తరువాత ఏ కారణాల వల్లో కానీ, దీనిని కొత్తవలసలో కాదు విజయనగరం జిల్లా సాలూరులో ఏర్పాటు చేస్తామని కొన్నాళ్లు కాలక్షేపం చేశారు. మరలా ఏమయిందో తెలియదు కానీ, అదే సాలూరు నియోజకవర్గంలో మెంటాడ మండలంలోని కరకవలస గ్రామం వద్ద ఏర్పాటు చేస్తామని తెలిపి, కొంత స్థలాన్ని కూడా గుర్తించారు. ఈ స్థలాన్ని కూడా కేంద్ర నిపుణుల బృందం పరిశీలించి, గతేడాది ఓకే చెప్పింది. ఈ లోగా మూడేళ్లు గడిచిపోయాయి ఇంకా భూసేకరణ జరగలేదు. సరిగా ఇప్పుడే జిల్లాల పునర్విభజన విపత్తు వచ్చిపడింది.


ఈ మెంటాడ మండలం సాలూరు అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఉన్నా, సాలూరు నూతన పార్వతీపురం జిల్లాలో ఉండగా, మెంటాడ మాత్రం విజయనగరం జిల్లాలో కలిసింది. ఇప్పుడు సాలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి ఈ యూనివర్సిటీ తన జిల్లాలోనే ఉండాలని పట్టుపడుతున్నట్లు వార్తలు వచ్చాయి. అంటే ఇప్పుడు ఇది విజయనగరం జిల్లా నుంచి పార్వతీపురం జిల్లాకు మారుతుందన్నమాట! దీనితో మరలా స్థలం గుర్తింపు, కేంద్ర నిపుణుల బృందం పరిశీలన, వారి ఆమోదం, భూసేకరణ జరిగిన తరువాత మాత్రమే కేంద్ర నిధులతో నిర్మాణం ప్రారంభం కావాలి. ఈలోగా పుణ్యకాలం కాస్తా గడిచిపోయి, ఎన్నికలు వచ్చాయంటే, మళ్ళీ కథ మొదటికొస్తుంది. 


ఇక్కడ గమనించవలసిన మరో విషయమేమిటంటే, విభజన చట్టం ప్రకారం ఈ విద్యా సంస్థలన్నీ 2022 కల్లా పూర్తి కావాలి. కానీ ఈ గిరిజన విశ్వవిద్యాలయానికి ఇంకా స్థల సేకరణే జరగలేదు. అంటే నిర్మాణం పూర్తకావలసిన సమయానికి అసలు మొదలే పెట్టలేదన్నమాట. ఎప్పటికి మొదలెడతారో కూడా ఇంకా తెలియదు. ఈ స్థితికి కారణం జగన్‌ ప్రభుత్వానికి కాక మరెవరికి ఆపాదించగలం. అసలే విభజన చట్టంలోని అంశాలను ఎలా ఎగ్గొట్టాలా అని చూస్తున్న మోదీ ప్రభుత్వానికి ఊతమిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ప్రస్తుతం తాత్కాలిక భవనాలలో, తాత్కాలిక సిబ్బందితో కొన్ని తరగతులు మాత్రమే జరుగుతున్నాయి. ప్రత్యేక హోదా, విభజన హామీలకై కేంద్రాన్ని గట్టిగా అడగని జగన్‌, ఇలా గిరిజన విశ్వవిద్యాలయం విషయంలో తానే ఆలస్యానికి కారణమవడం ఏమాత్రం క్షమార్హం కాదు. 


ఇంతకీ చంద్రబాబు ప్రభుత్వం అన్ని హంగులూ సమకూర్చిపెట్టిన కొత్తవలస స్థలాన్ని ఈ ప్రభుత్వం ఎందుకు కాదందో అంతుచిక్కని విషయమే. ప్రభుత్వం ఎందుకిలా చేసిందో ఎక్కడా బహిరంగంగా ప్రకటించలేదు. కేంద్ర బృందం కూడా ఆమోదించిన తరువాత, రాష్ట్ర ప్రభుత్వం కాదనడం వెనుక స్వార్ధ రాజకీయ ప్రయోజనాలు తప్ప మరేమున్నాయని అనుకోగలం. ఇప్పటికే ఒక స్థలాన్ని సేకరించి పెట్టిన తరువాత, మరొక స్థలం చూడ్డంలో అర్థమే లేదు. దీనివల్ల భూసేకరణకు డబ్బు వృథా అవడమే కాక, మరికొంతమంది రైతులు నిర్వాసితులు కావడంతో పాటు, నిర్మాణంలో ఆలస్యం కూడా జరుగుతుంది. ఇప్పుడు మరలా జిల్లాల పేరుతో మరో నాటకానికి తెరలేపి, కాలక్షేపం చేసేస్తే ఇక ఈ విద్యాసంస్థను కేంద్ర ప్రభుత్వం అటకెక్కించేసినా ఆశ్చర్యపోనక్కరలేదు. జగన్‌ ప్రభుత్వం దానికే అవకాశం ఇస్తుందా అనే సందేహం సామాన్యులకు కలగకమానదు. ఈ ప్రాంత అభివృద్ధి, గిరిజనులకు ఉన్నత విద్యావకాశాలు వంటి అంశాలు ఏమాత్రం గమనంలో ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మీనమేషాలు లెక్కించకుండా తయారుగా ఉన్న స్థలాన్ని చూపి, విశ్వవిద్యాలయం నిర్మాణానికి కేంద్రం తక్షణ చర్యలు చేపట్టేలా చూడాలి. 

-ఎ. అజ శర్మ

ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక

Updated Date - 2022-07-07T19:45:37+05:30 IST