మోదీ సర్కారు అవినీతి చిట్టా నా చేతిలో!

ABN , First Publish Date - 2022-02-13T07:57:54+05:30 IST

కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కారు అవినీతి చిట్టా తన చేతిలో ఉందని తెలంగాణ సీఎం కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మోదీ సర్కారు అవినీతి చిట్టా నా చేతిలో!

ఏ కేంద్రమంత్రి ఎంత తిన్నాడో తెలుసు..

మమత, స్టాలిన్‌, ఉద్ధవ్‌లతో మాట్లాడుతున్నా

ఢిల్లీకెళ్లి కొట్లాడాల్నా? ఇంట్లో పండాల్నా?

ప్రజల అభిప్రాయం కోరిన సీఎం కేసీఆర్‌

భువనగిరి సభలో సంచలన వ్యాఖ్యలు

బీజేపీ నేతలకు సంస్కారం ఉందా?

రాహుల్‌గాంధీ పుట్టుకను ప్రశ్నిస్తారా?

ఆయనపై వ్యాఖ్యలు కన్నీరు తెప్పించాయి

మాట తూలిన అసోం సీఎంపై వేటేయాలి

నరేంద్ర మోదీ సర్కారుపై కేసీఆర్‌ భగ్గు

విద్వేష వ్యాఖ్యలతో పెట్టుబడులు వస్తాయా?

భారత సిలికాన్‌ వ్యాలీని కశ్మీరు చేస్తారా?

అమెరికాలో 95 శాతం 

క్రైస్తవులైనా విద్వేషం పెంచరు

మతపిచ్చి లేపుడు తప్ప 

బీజేపీకి ఏం చేతకాదు: సీఎం కేసీఆర్‌

ఉద్యోగుల వేతనాలు మరింత 

పెంచేందుకు ప్రయత్నిస్తామని వ్యాఖ్య


హైదరాబాద్‌, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కారు అవినీతి చిట్టా తన చేతిలో ఉందని తెలంగాణ సీఎం కేసీఆర్‌  సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ కేంద్ర మంత్రి ఎంత తిన్నాడో తనకు తెలుసని కేసీఆర్‌ పేర్కొన్నారు. ‘‘మోదీ... బిడ్డా నీ సంగతి, చరిత్ర కేంద్రంలో జరిగే అవినీతి బాగోతాలు పెద్ద చిట్టా నా దగ్గర ఉంది. ఏ మంత్రి శాఖలో ఎంత అవినీతి జరుగుతుందో మొత్తం తెలుసు. కేంద్రంలో గుంట నక్కలు చేసే అవినీతి గురించి పెద్ద ఎత్తున నాకు ఫోన్లు వస్తున్నాయి. అవినీతి విషయంపై నిన్ననే మమత బెనర్జీ నాతో మాట్లాడారు. మొన్న ఉద్ధవ్‌ ఠాక్రే మాట్లాడారు. 15 రోజుల కింద తమిళనాడు సీఎం స్టాలిన్‌ మంతనాలు చేసిండు’’ అని సీఎం ఘాటు వ్యాఖ్యలు చేశారు. భువనగిరిలో శనివారం కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌ను ప్రారంభించిన కేసీఆర్‌ అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. మోదీ సర్కారును తరిమి తరిమి కొట్టాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.


కేంద్రం రైతాంగానికి ఉచిత కరెంటు ఇవ్వకున్నా గంజో, గడ్కో తిని రాష్ట్రం నుంచి ఇస్తుంటే అది కూడా వద్దని ఒత్తిడితెస్తున్నారని కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ఇలా చేస్తుంటే కొట్లాడాలా? ఇంట్ల పండాలా? అని సభికులను ప్రశ్నించారు. ఎనిమిదేళ్ల బీజేపీ పాలన దేశాన్ని నాశనం చేసిందన్నారు. మోదీ పాలనతో ప్రజానీకంలో ఏ వర్గానికీ లబ్ధి జరగలేదని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని ప్రశ్నిస్తేనే ‘‘కేసీఆర్‌ నీ సంగతి చూస్తాం’’ అని బీజేపీ నేతలు బెదిరించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వాళ్లు చూసేదేంటి? తోకమట్టా? కేసీఆర్‌ భయపడతాడా? భయపడితే తెలంగాణ వచ్చేదా? అని అని ప్రశ్నించారు. గత ఎనిమిదేళ్లు తమ బతుకు తామే బతికామన్నారు. దిక్కుమాలిన సోషల్‌ మీడియాలో లంగ పనులు చేసుడు తప్ప బీజేపీ చేసేదేమైనా ఉందా? అని ప్రశ్నించారు. మేధావులు, యువకులు ఆలోచన చేయాలని కోరారు. తన జాతీయ రాజకీయ ప్రవేశానికి ప్రజల అనుమతి కోరుతున్న విధంగా కేసీఆర్‌ ఢిల్లీకి పోవాలా? అంటూ సభికులను ప్రశ్నించారు. మొదటిసారి అడిగినపుడు జనం నుంచి స్పందన రాకపోవడంతో మరోసారి అడిగి అవుననిపించుకున్నారు.


మత పిచ్చి ముదురుతోంది

మోదీ సర్కారుకు మత పిచ్చి ముదురుతోందని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. పిచ్చి ముదిరి వ్యవసాయ చట్టాలకు రూపకల్పన చేశారన్నారు. వాటిపై సంవత్సరం పాటు రైతులంతా ఆందోళన చేస్తే ఖలీస్థానీలని, మత పిచ్చిగాళ్లని ముద్ర వేసే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. యూపీలో కేంద్ర మంత్రి ఒకడు ఏకంగా ఆందోళన చేస్తున్న రైతులపై నుంచి కార్లతో తొక్కించారని ఆరోపించారు. యూపీ ఎన్నికల్లో ఓటమి భయంతో సాగు చట్టాలను వాపస్‌ తీసుకున్నారన్నారు.   బీజేపీ మత పిచ్చోళ్ళ పాలనతో రోజూ లాఠీచార్జీలు, లూటీచార్జీలు జరుగుతుంటే పెట్టుబడులు ఎలా వస్తాయని కేసీఆర్‌ ప్రశ్నించారు. బెంగళూరు పరిణామాలపై ప్రధాని మోదీ సిగ్గు పడాలన్నారు. ఈ దేశం ఎవని అయ్య సొత్తు, మోదీ దేశాన్ని నాశనం చేస్తే చేతులు ముడుచుకొని ఎవరూ ఉండరని హెచ్చరించారు.


‘‘ప్రస్తుతం కర్నాటకలో ఏం జరగుతుందో చూస్తున్నాం. మన ఆడబిడ్డల మీద, పసికూనల మీద రాక్షసుల మాదిరి ప్రవర్తించవచ్చునా? ఇండియన్‌ సిలికాన్‌వ్యాలీగా ఉన్న బెంగళూరులో మత పిచ్చి లేపి కాశ్మీర్‌ వ్యాలీగా మార్చవచ్చునా?’’ అని ఆగ్రహించారు. దేశంలో సుహృద్భావ వాతావరణ దెబ్బతింటే ఎవరైనా వస్తారా? అని ప్రశ్నించారు. కుక్కల్లాగా మొరగడం మాని బీజేపీలో మొగోడు ఎవడో దీనికి జవాబు చెప్పాలని డిమాండ్‌ చేశారు. దేశంలో నిరుద్యోగం పెరగడం నిజం కాదా? పారిశ్రామిక ఉత్పత్తులు పడిపోవడం నిజం కాదా? అని ప్రశ్నించారు. గత రెండేండ్లలో 16 లక్షల పరిశ్రమలు మూతపడిన ముచ్చట వాస్తవం కాదా? అని నిలదీశారు. అమెరికాలో 95ు క్రైస్తవులు ఉంటారని, వారు బీజేపీ వాళ్లలాగా మతపిచ్చి లేపరని వ్యాఖ్యానించారు. ఇలాంటి అంశాలపై ప్రజలు రాజకీయంగా స్పందించకపోతే దేశం శ్మశా నం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో నాలుగు లక్షల మెగావాట్ల కరెంటు ఉత్పత్తి సామర్థ్యం ఉందని, రెండు లక్షల మెగావాట్లు దాటి ఎన్నడూ ఉపయోగించుకోలేదని చెప్పారు. 24 గంటల కరెంటు ఏ రాష్ట్రంలో ఇవ్వరని అని అన్నారు. దేశంలో 65 వేల టీఎంసీల నీరు నదుల్లో లభిస్తుంటే 35 వేల టీఎంసీలకు మించి వాడటంలేదని చెప్పారు. రాష్ట్రాలు పంటలు పండించి కేంద్రాన్ని కొనమంటే తనకు చేతకాదని అంటోందని, మత పిచ్చి లేపుడు కాకుండా బీజేపీకి ఇంకా ఏమైనా చేతనవుతుందా? అని ప్రశ్నించారు. ఆకలి సూచీలో మనకన్నా బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ మెరుగ్గా ఉన్నాయని చెప్పారు.


భువనగిరి జిల్లా అవుతుందనుకోలేదు

భువనగిరి జిల్లా అవుతుందని తాను ఎప్పుడూ కలలో కూడా అనుకోలేదని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఈ కరువు ప్రాంతం కాళేశ్వరం జలాలతో సస్యశ్యామలం కానుందని చెప్పారు. రైతుబంధు వ్యవసాయాన్ని స్థిరీకరించడానికి ఉపయోగపడుతుందన్నారు. 24 గంటలు కరెంటు ఇస్తున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమేనని నొక్కి చెప్పారు. 






సచ్చినా మోటర్లకు మీటర్ల పెట్టం

రాష్ట్రాల మెడపై కత్తి పెట్టి ప్రతి బాయి మీద మీటర్‌ పెట్టించాలని మోదీ చూస్తున్నారని కేసీఆర్‌ ఆరోపించారు. మోదీ దోస్తులైన పెట్టుబడిదార్లు సోలార్‌ ప్లాంట్లు పెడుతున్నారని, వారి నుంచి రాష్ట్రాలతో కరెంటు కొనిపించేందుకు కేంద్రం కుట్రలు చేస్తుందని చెప్పారు. నాగార్జునసాగర్‌ నుంచి హైడల్‌ పవర్‌ను బంద్‌ పెట్టించి, సోలార్‌ పవర్‌ కొనాలని ఒత్తిడి చేస్తున్నారన్నారు. విద్యుత్‌ సంస్కరణలు అమలు చేస్తేనే కేంద్రం నుంచి గ్రాంట్లు ఇస్తామని చెబుతున్నారని ఆరోపించారు.  మోదీ తెలంగాణతో మళ్లీ గోక్కుంటున్నారని కేసీఆర్‌ మండిపడ్డారు. ఈ దొంగలతో పోరాటం చేయాల్సిందేనన్నారు. తాను జనగామలో మాట్లాడితే బీజేపీ నేతలకు లాగులు తడుస్తున్నాయన్నారు. కేసీఆర్‌ది బక్క పానం పిసుకుతామంటున్నారని, మరి ఎందుకు కేసీఆర్‌ను చూసి వణుకుతున్నారని ప్రశ్నించారు. తనకేం లాలూచీ, లంగ సంపాదన, దొంగ సంపాదన లేదని, తన ప్రాణం, లక్ష్యం తెలంగాణ అని ఆయన చెప్పారు. కాగా, సీఎం పర్యటనను అడ్డుకుంటామని కాంగ్రెస్‌, బీజేపీ, సీపీఎం, దళిత సంఘాలు హెచ్చరించడంతో ఆయా పార్టీల నేతలను వివిధ పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. 

Updated Date - 2022-02-13T07:57:54+05:30 IST