మోదీ అభివృద్ధి వాహనం రివర్స్ గేర్‌లో ఉంది: రాహుల్

ABN , First Publish Date - 2021-11-06T22:12:35+05:30 IST

ఎల్‌పీజీ (వంటగ్యాస్) ధరలు రోజురోజుకూ పెంచుతూ పోతుండటంపై కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్..

మోదీ అభివృద్ధి వాహనం రివర్స్ గేర్‌లో ఉంది: రాహుల్

న్యూఢిల్లీ: ఎల్‌పీజీ (వంటగ్యాస్) ధరలు రోజురోజుకూ పెంచుతూ పోతుండటంపై కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తప్పుపట్టారు. ప్రధాని మోదీ ''అభివృద్ధి వాహనం రివర్స్ గేర్‌లో పోతోంది'' అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అభివృద్ధి అంటూ వారు చెబుతున్న మాటలకూ, చేస్తున్న చేతలకూ పొంతనే లేదంటూ శనివారంనాడు ఆయన ఓ ట్వీట్ చేశారు.


''అభివృద్ధి కనుచూపు మేరలో కనిపించడం లేదు. లక్షలాది మంది ప్రజలకు మళ్లీ కట్టెల పొయ్యల వాడకం తప్పేలా లేదు. మోదీజీ అభివృద్ధి వాహనం రివర్స్ గేర్‌లో పోతోంది. బ్రేక్‌లు కూడా ఫెయిలయ్యాయి'' అంటూ రాహుల్ ఆ ట్వీట్‌లో విమర్శించారు. ఆ ట్వీట్‌కు ఒక వార్తా కథనాన్ని స్క్రీన్‌షాట్ తీసి షేర్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో 42 శాతం ప్రజలు ఎల్‌పీజీ సిలెండర్ల వాడకం మానేశారని, ఎల్‌పీజీ ధరలు విపరీతంగా పెంచేయడమే దీనికి కారణమని ఆ వార్తా కథనం పేర్కొంది. ఈ పరిస్థితుల్లో ప్రజలు తిరిగి కట్టెపొట్టల వాడకాన్ని ఆశ్రయించక తప్పడం లేదని కూడా తెలిపింది.

Updated Date - 2021-11-06T22:12:35+05:30 IST