ప్రతి ఒక్కరినీ మోదీ వెనక్కి తెస్తారు: హర్దీప్ పురి

ABN , First Publish Date - 2022-03-07T21:06:31+05:30 IST

ఉక్రెయిన్‌లో నిలిచిపోయిన ప్రతి ఒక్క భారతీయ విద్యార్థిని వెనక్కి రప్పించేందుకు..

ప్రతి ఒక్కరినీ మోదీ వెనక్కి తెస్తారు: హర్దీప్ పురి

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లో నిలిచిపోయిన ప్రతి ఒక్క భారతీయ విద్యార్థిని వెనక్కి రప్పించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కట్టుబడి ఉన్నారని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. హంగేరీ నుంచి 6,177 మంది భారతీయ విద్యార్థుల తరలింపు ప్రక్రియ పూర్తి కావడంతో సోమవారంనాడు ఆయన తిరిగి ఢిల్లీకి చేరుకున్నారు. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారత విద్యార్థుల తరలింపు ప్రక్రియను సమన్వయం చేసేందుకు ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతాలకు కేంద్రం పంపిన నలుగురు కేంద్ర మంత్రుల్లో హర్దీప్ పురి ఒకరు.


''హంగేరి నుంచి 6,177 మంది విద్యార్థుల తరలింపు ప్రక్రియ ఆదివారంతో పూర్తయింది. చివరి రోజు ఐదు విమానాలు విద్యార్థులతో నిండిపోయాయి. విద్యార్థుల తరలింపు ప్రక్రియకు సహకరించిన హంగేరి ప్రభుత్వానికి, ముఖ్యంగా విదేశాంగ, వాణిజ్య మంత్రిత్వ శాఖ, దేశీయాంగ శాఖ, ఇతర ఏజెన్సీలకు ప్రత్యేక కృతజ్ఞతలు'' అని హర్దీప్ పురి ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. హంగేరి రాజధాని బూడాపెస్ట్ నుంచి బయలుదేరిన చిట్టచివరి విమానంలో విద్యార్థులతో కలిసి హర్దీప్ పురి ఢిల్లీకి వచ్చారు. విద్యార్థులందరిన్నీ స్వదేశానికి తీసుకురావడం చాలా సంతోషంగా ఉందని, త్వరలోనే విద్యార్థులంతా తమ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను కలుసుకుంటారని హర్దీప్ పురి మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. సుమీ నగరంలో సుమారు 700 మంది విద్యార్థులు చిక్కుకున్న విషయంపై మాట్లాడుతూ, కొద్ది మంది మాత్రమే మిగిలారని, వారితోనూ, కంట్రోల్ రూమ్‌తోనూ సంప్రదింపులు సాగిస్తున్నామని, ప్రధాని నరేంద్ర మోదీ సైతం వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరినీ వెనక్కి తెచ్చేందుకు కట్టుబడి ఉన్నారని చెప్పారు. కాగా, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి ప్రధాని మోదీ సైతం సోమవారంనాడు ఫోను చేసి భారతీయ విద్యార్థుల తరలింపు ప్రక్రియలో సహకరించాలని కోరారు.

Updated Date - 2022-03-07T21:06:31+05:30 IST