మోదీ పిలుపు అనాలోచితం : శశి థరూర్

ABN , First Publish Date - 2020-04-04T21:53:13+05:30 IST

కరోనా వైరస్ మహమ్మారిపై పోరాటంలో భాగంగా సంఘీభావాన్ని ప్రకటించేందుకు దీపాలను వెలిగించాలని ప్రధాన

మోదీ పిలుపు అనాలోచితం : శశి థరూర్

న్యూఢిల్లీ : కరోనా వైరస్ మహమ్మారిపై పోరాటంలో భాగంగా సంఘీభావాన్ని ప్రకటించేందుకు దీపాలను వెలిగించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుపై కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం రాత్రి 9 గంటలకు విద్యుత్తు దీపాలను ఆర్పేసి, ఇళ్ళ బయటకు, బాల్కనీల్లోకి వచ్చి సాధారణ దీపాలు, టార్చిలైట్లు, కొవ్వొత్తులు వెలిగించాలని మోదీ ఇచ్చిన పిలుపు ఆలోచించి తీసుకున్న నిర్ణయం కాదన్నారు. ప్రజలంతా ఇలా చేస్తే విద్యుత్తు గ్రిడ్ కుప్పకూలుతుందని హెచ్చరించారు. 


ఏప్రిల్ 5 ఆదివారం రాత్రి 9 గంటలకు దేశవ్యాప్తంగా ప్రజలు విద్యుత్తు దీపాలను ఆర్పేసి, నూనె దీపాలు, కొవ్వొత్తులు, సెల్‌ఫోన్ లైట్లు, టార్చిలైట్లు వంటివాటిని వెలిగించాలని మోదీ శుక్రవారం పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. కోవిడ్ -19పై పోరాటంలో దేశ సమైక్యతను, స్ఫూర్తిని చాటేందుకు రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాలపాటు ఈ విధంగా చేయాలని ఆయన కోరారు. 


దీనిపై శశి థరూర్ స్పందిస్తూ ఓ ట్వీట్ ఇచ్చారు. ‘‘ఆదివారం రాత్రి 9 గంటలకు అనూహ్యంగా విద్యుత్తు డిమాండ్ పడిపోవడం, వెంటనే 9 గంటల 9 నిమిషాలకు ఒక్కసారిగా గిరాకీ పెరగడం విద్యుత్తు గ్రిడ్ కుప్పకూలడానికి కారణమవ్వొచ్చు. కాబట్టి విద్యుత్తు బోర్డులు రాత్రి 8 గంటల నుంచి లోడ్ షెడ్డింగ్, రాత్రి 9.09 గంటల తర్వాత క్రమంగా తిరిగి సాధారణ స్థితికి చేరడం గురించి ఆలోచిస్తున్నాయి. మరో విషయం ఏమిటంటే, పీఎం దీని గురించి ఆలోచించలేదు’’ అని పేర్కొన్నారు.


ఏప్రిల్ 5న విద్యుత్తు గ్రిడ్ సజావుగా, సురక్షితంగా కార్యకలాపాలు నిర్వహించేందుకు వీలుగా అత్యవసర చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఉత్తర ప్రదేశ్ స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ లేఖ రాసింది. కొద్ది సేపు రాష్ట్రవ్యాప్తంగా దీపాలు ఆర్పేస్తే, దాదాపు 3 వేల మెగావాట్ల లోడ్ తగ్గుతుందని, ఇది రాష్ట్ర పవర్ గ్రిడ్‌లో హై ఓల్టేజ్‌ పెరుగుదలకు కారణం కావచ్చునని తెలిపింది. ఈ లేఖను శశి థరూర్ తన ట్వీట్‌కు జత చేశారు. 


Updated Date - 2020-04-04T21:53:13+05:30 IST