మోదీది మొసలి కన్నీరు!

ABN , First Publish Date - 2022-02-11T06:23:46+05:30 IST

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో కాంగ్రెస్‌కు అన్ని విధాలా బిజెపి మద్దతు ఇచ్చింది.

మోదీది మొసలి కన్నీరు!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో కాంగ్రెస్‌కు అన్ని విధాలా బిజెపి మద్దతు ఇచ్చింది. ఆ పార్టీ మద్దతు లేకుంటే కాంగ్రెస్ సాహసించి రాష్ట్ర విభజనకు పూనుకొని ఉండేది కాదు. ఇది చారిత్రక సత్యం. ఈ మహా పాపంలో కాంగ్రెస్‌కు ఎంత భాగముందో బిజెపికి కూడా అంతే భాగముంది. తదనంతరం అధికారం చేపట్టిన నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం చేశారు. నేడు ఆయన అదంతా మరచి మొసలి కన్నీరు కార్చడం వల్ల ఏపి ప్రజలనే కాదు, దేశ ప్రజలను కూడా నమ్మించ లేరు. చింతామణి నాటకం తుది అంకంలో చింతామణి ‘హే కృష్ణా’ అని భక్తిగీతాలు పాడినట్లు ప్రస్తుతం నరేంద్ర మోదీ కన్నీరు కార్చినంత మాత్రాన చేసిన పాపాలు పీడించక మానవు. పార్లమెంటులో మోదీ ప్రసంగం విన్న ఏపి ప్రజలు కుతకుతలాడి పోతున్నారు. 


పార్లమెంటులో ఆనాడు మైకులు ఆఫ్ చేసి తలుపులు మూసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను కాంగ్రెస్ విభజించిన మాట వాస్తవమే! ఆనాడు బిజెపి మద్దతు లేనిదే విభజన చట్టం ఆమోదం పొందేదా? ఈ ఘోరకలి చూడలేమని బిజెపి నేతలు ఎందుకు వాకౌట్ చేయలేదు? అంతేకాదు పార్లమెంటులో విభజన చట్టం ఆమోదం తర్వాత ఆనాటి బిజెపి పక్ష నాయకురాలు స్వర్గీయ సుష్మాస్వరాజ్ తెలంగాణ సభ్యులను ఉద్దేశించి ‘ఈ చిన్నమ్మను మరచిపోవద్దు’ అని చెప్పిన మాటలు గమనంలోకి తీసుకుంటే తలుపులు మూసి చట్టం ఆమోదించడంలో కాంగ్రెస్‌తో పాటు బిజెపికి సమాన పాపం లేదా? ఈ రోజు ఉత్తరప్రదేశ్ ఎన్నికల గండం గడిచేందుకు మోదీ ఎన్ని కన్నీళ్లు కార్చినా అది మొసలి కార్చే కన్నీరు తప్ప వేరు కాదు. నిత్యం గుళ్లు గోపురాలు తిరుగుతూ దేశంలో దైవభక్తిని మోదీ వరద కట్టిస్తున్నారు. కాని ఆనాడు తిరుపతి పుణ్యక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాను తను ప్రధాని కాగానే ఇస్తానని చేసిన వాగ్దానం ఏమైంది?


ఆనాడు రాజ్యసభలో ప్రస్తుత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో పాటు స్వర్గీయ అరుణ్ జైట్లీ ఆంధ్రాకు ప్రత్యేక హోదా అయిదు ఏళ్లు కాకుండా పదేళ్లు ఇవ్వాలని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కోరిన మాట వాస్తవం కాదా? అసలు ఏపికి ప్రత్యేక హోదా ప్రతిపాదన చేసింది బిజెపి నేతలే కదా? అప్పటికే పార్లమెంటులో చట్టం ఆమోదం పొందినందున మన్మోహన్ సింగ్ కేంద్ర మంత్రివర్గం ఆమోదం పొంది ప్లానింగ్ కమిషన్‌కు పంపిన విషయం వాస్తవం కాదా? మోదీ ప్రధాని పదవి చేపట్టిన తర్వాత దాదాపు పదినెలల కాలం ఈ ప్రతిపాదన తన వద్దే అట్టిపెట్టుకుని తుదకు డిసెంబర్‌లో ప్లానింగ్ కమిషన్‌ను రద్దు చేసి ప్రత్యేక హోదాకు మంగళం పాడి ఈ రోజు రాజకీయ అవసరార్థం కాంగ్రెస్‌పై విషం చిమ్మితే కాంగ్రెస్ కన్నా మిన్నగా చేసిన మోసం పాపం మాసి పోతుందా?


1969 నుంచి ప్రత్యేక హోదా వివిధ రాష్ట్రాలలో అమలు జరిపారు. ఏ రాష్ట్రానికైనా చట్టం ద్వారా ప్రత్యేక హోదా అమలు జరిపారా? లేదే! ప్లానింగ్ కమిషన్ ప్రతిపాదనలు రూపొందించి జాతీయ అభివృద్ధి మండలి ఆమోదంతో అమలు జరిగితే, ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి చట్టంలో లేదని ఎగ్గొట్టలేదా? విభజన చట్టంలో లేదని కొన్నాళ్లు, ఏపికి ప్రత్యేక హోదా ఇస్తే తమ రాష్ట్రాల నుంచి పరిశ్రమలు తరలిపోతాయని తమిళనాడు, కర్నాటక తదితర రాష్ట్రాలు అడ్డుచెబుతున్నాయని మరి కొన్నాళ్లు కాలం గడిపి, తుదకు 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా గల రాష్ట్రాలకు, సాధారణ రాష్ట్రాలకు మధ్య తేడా లేకుండా చేసిందని చెప్పి ప్రత్యేక హోదా ఎగ్గొట్టి నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఏపికి ద్రోహం చేసి ఈ రోజు మొసలి కన్నీరు కార్చితే నమ్మేందుకు ఏపి ప్రజలు సిద్ధంగా లేరని గ్రహించాలి. ప్రత్యేక హోదా మహా పాపం అంతటితో ఆగ లేదు. హోదా అమలుకు నిధులు లేవంటూనే, మరో పక్క 2017 జూన్ నెలలో కేంద్ర మంత్రివర్గం ఆమోదంతో ప్రత్యేక హోదా అనుభవిస్తున్న రాష్ట్రాలకు పదేళ్లు పారిశ్రామిక రాయితీల కోసం దాదాపు రూ.27వేల కోట్లు మంజూరు చేసిన విషయం వాస్తవం కాదా? కాంగ్రెస్ అన్యాయం చేసిందని చెప్పే మోదీ అదే పద్ధతిలో ఏపిని ఎందుకు ఆదుకోలేకపోయారు? 


రాష్ట్ర విభజన చట్టం మేరకు వెనుకబడిన ప్రాంతాలకు లభించవలసిన ప్రత్యేక ప్యాకేజీని మధ్యలో మంగళం పాడారు. రాష్ట్ర ప్రభుత్వం అయిదేళ్ల కాలానికి రూ.24వేల కోట్లతో పథకం సమర్పిస్తే జిల్లాకు 50 కోట్లు చొప్పున ముష్టిగా ఇచ్చి మూడేళ్లకే ఎగ్గొట్టిన విషయం ఏపి ప్రజలు ఇంకా మరచిపోలేదు. తుదకు ఏపి ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టును శంకరగిరి మాన్యాలు పట్టించారు. ఈ రోజు ఏపిపై అపార అభిమానం వ్యక్తం చేస్తే నమ్మేందుకు ఎవరూ సిద్ధంగా లేరు. తనకు 25 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తానని ఏపి ప్రజలను నమ్మించి అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్, బిజెపి కన్నా పది రెట్లు ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేస్తున్నారు.


వి. శంకరయ్య

విశ్రాంత పాత్రికేయులు 

Updated Date - 2022-02-11T06:23:46+05:30 IST