మోదీ, బాబు మాటామంతీ!

ABN , First Publish Date - 2022-08-07T07:47:55+05:30 IST

మోదీ, బాబు మాటామంతీ!

మోదీ, బాబు మాటామంతీ!

సుదీర్ఘకాలం తర్వాత కలుసుకున్న నేతలు

మీతో చాలా మాట్లాడాలి: ప్రధాని

నేనూ మిమ్మల్ని కలవాలనుకుంటున్నా: బాబు

త్వరలో సమాచారం పంపిస్తానన్న ప్రధాని

షా సహా పలువురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు చర్చలు

రాష్ట్రపతి ముర్ముకు శుభాకాంక్షలు


న్యూఢిల్లీ, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సుదీర్ఘకాలం తర్వాత పరస్పరం చర్చించుకున్నారు. రాష్ట్రపతి భవన్‌లోని కల్చర్‌ సెంటర్‌ ఇందుకు వేదికగా మారింది. శనివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన ‘ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌’ సమావేశంలో కేంద్ర ఆహ్వానం మేరకు చంద్రబాబు కూడా పాల్గొన్నారు.


ఈ సమావేశం ముగిసిన అనంతరం... చంద్రబాబును మోదీ పక్కకు తీసుకెళ్లి కొద్దిసే పు చర్చలు జరిపారు. ఆయన ఆరోగ్యం, కుటుంబ సభ్యుల యోగక్షేమాలు, ఇతర విషయాలు అడిగి తెలుసుకున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ‘‘ చంద్రబాబు గా రూ... ఎలా ఉన్నారు! మనం చాలా రోజులు అయ్యింది కలుసుకొని. మీరు ఢిల్లీకి తరచూ ఎందుకు రావడం లేదు?’’ అని ప్రధాని అడిగారు. ‘మీతో చాలా విషయాలు మాట్లాడాల్సి ఉం ది’ అని తెలిపారు. తాను కూడా చాలా రోజులుగా ఆయనను కలుసుకోవాలనుకుంటున్నట్లు చంద్రబాబు మోదీకి బదులిచ్చా రు. ‘సరే! మీకు సమాచారం పంపిస్తాను’ అని మోదీ అన్నట్లు తెలిసింది. ఈ సమావేశంలో చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులు, అనేక మంది జాతీయ స్థాయి నాయకులను కలుసుకున్నారు. వారితో పాత అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సిం గ్‌, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌, ఎన్సీపీ నేత శరద్‌ పవార్‌, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ తదితరులను చంద్రబాబు కలిశారు. ఇదే భేటీలో పాల్గొన్న సినీనటుడు రజనీకాంత్‌, పీటీ ఉషతో పాటు పలువురు ప్రముఖులు చంద్రబాబును పలకరించారు.


రాష్ట్రపతితో చంద్రబాబు భేటీ

ఇటీవలే రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన ద్రౌపది ముర్ముతో శనివారం చంద్రబాబు నాయుడు మర్యాదపూర్వకం గా భేటీ అయ్యారు. దాదాపు 20 నిమిషాలకుపైగా సమావేశమయ్యారు. నూతనంగా రాష్ట్రపతిగా బాధ్యతలు తీసుకున్న ఆమెకు చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబుతోపాటు ఎంపీలు గల్లా జయదేవ్‌,  కనకమేడల రవీంద్ర కుమా ర్‌, రామ్మోహన్‌ నాయుడు, కేశినేని నాని, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌, ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్‌ రావు, టీడీపీ సీనియర్‌ నేత శ్రీనివాస్‌ రెడ్డి కూడా ఉన్నారు. 



Updated Date - 2022-08-07T07:47:55+05:30 IST