64 వేల కోట్లతో ‘ఆయుష్మాన్‌ భారత్‌’

ABN , First Publish Date - 2021-10-26T08:03:16+05:30 IST

గత పాలకులు ప్రజాధనాన్ని తమ, కుటుంబసభ్యుల జేబులు నింపుకోడానికే వినియోగించేవారని ప్రధాని మోదీ విమర్శించారు.

64 వేల కోట్లతో ‘ఆయుష్మాన్‌ భారత్‌’

ప్రారంభించిన ప్రధాని మోదీ

నాడు ప్రజాధనం పాలకుల జేబుల్లోకే

నేడు పెద్ద ప్రాజెక్టుల్లో వినియోగం: మోదీ


వారాణసీ/సిద్ధార్థ్‌నగర్‌, అక్టోబరు 25: గత పాలకులు ప్రజాధనాన్ని తమ, కుటుంబసభ్యుల జేబులు నింపుకోడానికే వినియోగించేవారని ప్రధాని మోదీ విమర్శించారు. ఇప్పుడు ప్రజాధనాన్ని పెద్దపెద్ద అభివృద్ధి ప్రాజెక్టుల్లో వినియోగిస్తున్నామని చెప్పారు. రూ.64 వేల కోట్లతో ఆయుష్మాన్‌ భారత్‌ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్‌ను సోమవారం ఉత్తరప్రదేశ్‌లోని తన నియోజకవర్గం వారాణసీ నుంచి ప్రధాని ప్రారంభించారు. అలాగే వారాణసీలో రూ.5,200 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. దీంతోపాటు యూపీలో 9 మెడికల్‌ కాలేజీలను వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ బీజేపీ పాలనలో యూపీని మెడికల్‌ హబ్‌గా మార్చనున్నామని ప్రకటించారు. ‘వారి అవినీతి చక్రం 24 గంటలూ నడిచేది’ అంటూ సమాజ్‌వాదీ పార్టీ చిహ్నం(సైకిల్‌)ను ఉద్దేశించి మోదీ వ్యాఖ్యానించారు. వారాణసీలో గత ఏడేళ్లలో జరిగినంత అభివృద్ధి, అంతకుముందు 70 ఏళ్లలో కూడా జరగలేదన్నారు. గతంలో అంబులెన్స్‌లు, మందులు, నియామకాలు, బదిలీలు తదితరాలన్నింటిలోనూ అవినీతి కొనసాగేదని చెప్పారు. స్వాతంత్ర్యానంతరం దీర్ఘకాలం అధికారంలో ఉన్నవారు ఆరోగ్యరంగం సమగ్రాభివృద్ధి చెందకుండా తొక్కిపెట్టారని ఆరోపించారు.  ఆయుష్మాన్‌ భారత్‌ మొదటి దశలో గ్రామాలు, నగరాల్లో ఆరోగ్యకేంద్రాల ఏర్పాటు, రెండో దశలో ల్యాబ్‌ సదుపాయాల కల్పన, మూడో దశలో ప్రస్తుతం దేశంలో ఉన్న ల్యాబ్‌లను మెరుగుపరుస్తారని వివరించారు.


ప్రత్యేకించిన 10 రాష్ర్టాల్లో 17,788 గ్రామీణ ఆరోగ్య కేంద్రాలకు ఈ మిషన్‌ ద్వారా చేయూత అందిస్తామని, తర్వాత దేశవ్యాప్తంగా 11,024 అర్బన్‌ ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ మిషన్‌ కిందే ఒక జాతీయ ఆరోగ్య సంస్థ, నాలుగు జాతీయ వైరాలజీ సంస్థలు, ఆగ్నేయాసియాలో ప్రపంచ ఆరోగ్యసంస్థ కోసం ఒక రీజినల్‌ పరిశోధన కేంద్రం, తొమ్మిది బయోసేఫిటీ స్థాయి ల్యాబ్‌లు, వ్యాధుల నియంత్రణకు ఐదు ప్రాంతీయ నేషనల్‌ సెంటర్లు కూడా ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్‌ మాండవీయ, యూపీ గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌, సీఎం యోగి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-26T08:03:16+05:30 IST