న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత లాల్‌కృష్ణ అడ్వాణీ 94వ వసంతంలోకి అడుగుపెట్టారు. ప్రధాని నరేంద్ర మోదీతో సహా పులువురు పార్టీ నేతలు సోమవారం ఉదయం ఆయన నివాసానికి వెళ్లి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన చేత కేక్ కట్ చేయించి అభినందనలు తెలిపారు. ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు హాజరయ్యారు. దీనికి ముందు ప్రధాని తన ట్విట్టర్ అకౌంట్‌లో అడ్వాణీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. గౌరవనీయులైన అడ్వాణీ చిరకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నానని, ప్రజల సాధికారత, సంస్కృతీ సంప్రదాయాల అభ్యున్నతికి అడ్వాణీ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు.
కరాచీలో 1927 నవంబర్ 8న జన్మించిన అడ్వాణీ 1998 నుంచి 2004 వరకూ బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వంలో హోం శాఖ మంత్రిగా పనిచేశారు. 2002 నుంచి 2004 వరకూ వాజ్‌పేయి ప్రభుత్వంలో ఉప ప్రధానిగా కూడా సేవలందించారు. బీజేపీ సహ వ్యవస్థాపకులలో ఒకరైన ఆయన ఆర్‌ఎస్ఎస్ కార్యకర్తగా తన కెరీర్ ప్రారంభించారు. 2015లో పద్మవిభూషణ్ పురస్కారంతో భారత ప్రభుత్వం ఆయనను గౌరవించింది.