నాసిక్ దుర్ఘటనపై మోదీ, అమిత్ షా, రాజ్‌నాథ్ దిగ్భ్రాంతి

ABN , First Publish Date - 2021-04-21T21:56:30+05:30 IST

మహారాష్ట్రలోని నాసిక్‌లో ఆక్సిజన్ లీక్ దుర్ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

నాసిక్ దుర్ఘటనపై మోదీ, అమిత్ షా, రాజ్‌నాథ్ దిగ్భ్రాంతి

న్యూఢిల్లీ : మహారాష్ట్రలోని నాసిక్‌లో ఆక్సిజన్ లీక్ దుర్ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 22 మంది కోవిడ్-19 రోగులు ప్రాణాలు కోల్పోయారు. వీరికి ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం ఏర్పడటం వల్ల వీరు ప్రాణాలు కోల్పోయారని జిల్లా కలెక్టర్ తెలిపారు. 


మోదీ బుధవారం ఇచ్చిన ట్వీట్‌లో, ఆక్సిజన్ ట్యాంక్ లీకేజ్ వల్ల నాసిక్‌లోని ఓ ఆసుపత్రిలో జరిగిన విషాదం హృదయాన్ని కలచివేసిందని పేర్కొన్నారు. 22 మంది ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా బాధించిందన్నారు. ఈ విషాద సమయంలో బాధిత కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. 


రాజ్‌నాథ్ సింగ్ ఇచ్చిన ట్వీట్‌లో, నాసిక్ నుంచి చాలా దుర్వార్త అందిందన్నారు. ఓ ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరాకు అంతరాయం కలగడంతో విలువైన ప్రాణాలకు నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషాద సంఘటనలో కొందరు ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. ఈ బాధాకర సమయంలో తీవ్ర ఆవేదనకు గురైన బాధిత కుటుంబాలకు సంఘీభావం ప్రకటించారు. 


కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇచ్చిన ట్వీట్‌లో, నాసిక్‌లోని ఆసుపత్రిలో జరిగిన దుర్ఘటన వార్త కలచివేసిందని పేర్కొన్నారు. అత్యంత ఆత్మీయులను కోల్పోవడం వల్ల జరిగిన నష్టాన్ని ఎన్నటికీ పూడ్చడం సాధ్యంకాదని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. చికిత్స పొందుతున్నవారంతా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు. 


మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న డాక్టర్ జకీర్ హుస్సేన్ ఆసుపత్రిలో బుధవారం ఆక్సిజన్ లీక్ అయింది. నాసిక్ జిల్లా కలెక్టర్ సూరజ్ మంధరే తెలిపిన వివరాల ప్రకారం, ఈ సంఘటన నేపథ్యంలో 22 మంది మరణించారు, వీరంతా కోవిడ్-19 వ్యాధిగ్రస్థులే. ఆక్సిజన్ లీక్ అయిన తర్వాత ఆసుపత్రిలో రోగులకు ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో వీరు ప్రాణాలు కోల్పోయారు. 


Updated Date - 2021-04-21T21:56:30+05:30 IST