Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

మహమ్మారి కాలంలో ‘విపత్తుల’ వెల్లువ

twitter-iconwatsapp-iconfb-icon
మహమ్మారి కాలంలో విపత్తుల వెల్లువ

రాజ్యవ్యవస్థ ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాలంటే పత్రికాస్వేచ్ఛ సంపూర్ణంగా ఉండాలి; పార్లమెంటులో ఏ అంశంపైన అయినా సమగ్ర చర్చలు జరగాలి; స్వతంత్ర వైఖరితో వ్యవహరించే పౌరసమాజ సంస్థలూ చాలా ముఖ్యం. మరి 2020లో పత్రికాస్వేచ్ఛ మరింతగా కుదించుకుపోయింది. పార్లమెంటరీ చర్చలు నిస్సారమైపోయాయి. పౌరసమాజ సంస్థలు అణచివేతకు గురయ్యాయి. భారతీయ ప్రజాస్వామిక సంస్థలు, భారతీయ బహుళత్వవాద సంప్రదాయాలను బలహీనపరిచి, అధిక సంఖ్యాకులకు అనుకూలమైన నిరంకుశాధికార రాజ్యవ్యవస్థను నిర్మించేందుకు జాతీయ అధికారపక్షం కరోనా సంక్షోభాన్ని ఉపయోగించుకున్నది.


భారతీయుల ఆరోగ్యానికి, భారతీయ ప్రజాస్వామ్య ఆరోగ్యానికి కూడా 2020 ఒక చెడ్డ సంవత్సరం. మోదీ–షా ద్వయం నిరంకుశాధికార పాలన రాజ్యాంగబద్ధ, ప్రజాస్వామ్య ప్రక్రియలను మరింతగా బలహీనపరిచేందుకు; రాజ్యం, సమాజంపై తమ పట్టును మరింతగా బిగించేందుకు కరోనా విలయాన్ని ఉపయోగించుకున్నది. తమ లక్ష్యాలను సాధించుకునేందుకు ఈ ద్వయం పాలన భారత పార్లమెంటు, భారతీయ సమాఖ్య విధానం, భారతీయ పత్రికారంగం, భారతీయ పౌరసమాజ సంస్థలపై బహుముఖీన దాడులను ప్రారంభించింది. వాటిని వరుసగా చూద్దాం. 


గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నరేంద్రమోదీ శాసనసభా కార్యకలాపాల పట్ల ధిక్కార వైఖరినే ప్రదర్శించారు. ఆయన ముఖ్యమంత్రిగా పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరువాత వెలువడిన ఒక నివేదిక, గుజరాత్ ఆవిర్భావం అనంతరం అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రులు అందరిలోకి మోదీయే అతి తక్కువసార్లు శాసనసభ సమావేశాలను నిర్వహించినట్టు తెలిపింది. నెలల తరబడి అసెంబ్లీ సమావేశాలు జరిగేవి కావు. సమావేశమయినప్పుడు కూడ సంకల్పించిన చట్టాలను ఆమోదించడం ఒక్క రోజులో పూర్తయ్యేది. ఎక్కువ సమయం మరణించిన సభ్యులను సంస్మరించుకోవడంలోనే గడిచిపోయేది. ప్రతిపక్ష ఎమ్మెల్యేల అభిప్రాయాలు కాదు కదా, సొంత పార్టీ శాసనసభ్యుల సలహాలను సైతం మోదీ పూర్తిగా ఉపేక్షించేవారు. ప్రధాన విధాన నిర్ణయాలపై కూడ ఆయన సొంత కేబినెట్‌ను సంప్రదించడం చాలా అరుదు. 


ప్రధానమంత్రిగా కూడా మోదీ సంప్రదింపుల పట్ల అదే తిరస్కార వైఖరిని చూపుతున్నారు. పార్లమెంటు ఆయనకు సంచలనాత్మక ఉపన్యాసం చేసే వేదికే గానీ పర్యాలోచనలతో విధాన నిర్ణయాలు తీసుకునే సభామందిరం కాదు. తమ నాయకుని ఆలోచనా విధానానికి అనుగుణంగా లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ సైతం తమ విధుల నిర్వహణలో అదే పాక్షికవైఖరిని ప్రదర్శిస్తున్నారు. వారి డిప్యూటీలు సైతం అదే రీతిలో వ్యవహరిస్తున్నారు. రాజ్యసభలో ‘సాగుచట్టాలు’ ఆమోదం పొందిన తీరే అందుకు నిదర్శనం. సభాపతి స్థానంలో ఉన్న డిప్యూటీ చైర్మన్ హరివంశ్ పార్లమెంటరీ నిబంధనలు, సంప్రదాయాలు అన్నిటినీ ఉల్లంఘించారు. బిల్లుపై ఓటింగ్‌కు ఆయన అనుమతి నివ్వలేదు. సభ్యుల అభిప్రాయాలు ఎటువైపు ఉన్నాయనే తన అవగాహన ఆధారంగా ఆ బిల్లులు ఆమోదం పొందాయని ఆయన ప్రకటించారు. ‘ప్రతిపక్షాలు తమ అభిప్రాయాలను తెలియజేసేందుకు, అధికారపక్షం తన నిర్ణయాలను తాను అనుకున్న విధంగా అమలుపరిచేందుకు వీలుగా పార్లమెంటరీ వ్యవస్థలను రూపొందించారు. ప్రతిపక్షాలు తమ అభిప్రాయాలు చెప్పేందుకు ఆస్కారం లేని పక్షంలో ఒక ప్రజాస్వామిక సంస్థగా పార్లమెంటు ఎంతోకాలం మనలేదు’ అని లోక్‌సభ మాజీ సెక్రటరీ- జనరల్ పిడిటి ఆచారి వ్యాఖ్యానించారు. 


కొత్త వ్యవసాయ బిల్లులకు పార్లమెంటు ఆమోదం ‘చరిత్రాత్మకం’ అని మోదీ భక్తులు కీర్తించారు. అయితే పార్లమెంటరీ చరిత్ర పట్ల లోతైన అవగాహన ఉన్నవారు వ్యవసాయ బిల్లులను ఆమోదించడంలో జరిగిన ప్రజాస్వామిక ఆచరణల ఉల్లంఘన పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. వీరిలో వ్యవసాయ బిల్లులను సమర్థించే వారు సైతం ఉండడం గమనార్హం. ‘పార్లమెంటులో వ్యవసాయ బిల్లులను ఏకపక్షంగా ఆమోదించకుండా ఉన్నట్టయితే, ఢిల్లీ శివార్లలో రైతుల నిరవధిక నిరసనలతో వాటిల్లిన భారీ నష్టాన్ని, దేశ రాజధానిలో పౌర జీవనానికి సంభవించిన తీవ్ర అంతరాయాన్ని నివారించడం సాధ్యమయి ఉండేద’ని సీనియర్ న్యాయవాది అరవింద్ దాతార్ రాశారు. ‘పార్లమెంటరీ పద్ధతులను చిత్తశుద్ధితో, కచ్చితంగా అనుసరించాల్సిన ఆవశ్యకతను రైతుల ఆందోళన స్పష్టం చేసింది. ఈ ఆందోళనకు అర్బన్ నక్సల్స్, ఖలిస్తానీలు, ప్రతిపక్ష పార్టీలవారే కారకులని కేంద్రమంత్రులు తప్పు పట్టారు. అయితే పార్లమెంటు ఉభయ సభలలోనూ అసాధారణ వేగంతో ఆ బిల్లులు ఆమోదం పొందిన తీరుతెన్నులే ప్రస్తుత సంక్షోభాన్ని సృష్టించాయి. కరోనా మహమ్మారితో ఉత్పన్నమైన ఆర్థిక ఉపద్రవాన్ని ఈ సంక్షోభం మరింత తీవ్రతరం చేసిందని’ దాతార్ అన్నారు. కొవిడ్ మహమ్మారిని కారణంగా చూపుతూ పార్లమెంటు శీతాకాల సమావేశాలను మోదీ ప్రభుత్వం రద్దు చేసింది. అయితే కేంద్ర హోంమంత్రి అస్సోం, పశ్చిమ బెంగాల్‌లలో భారీ బహిరంగసభల్లో ఉపన్యసిస్తున్నారు. రాజకీయ ర్యాలీలలో పాల్గొంటున్నారు. 


సహకార సమాఖ్య విధానంలో తనకు పరిపూర్ణ విశ్వాసం ఉందని గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నరేంద్ర మోదీ తరచు ఉద్ఘాటించేవారు. మరి ప్రధానమంత్రిగా ఆయనే రాష్ట్రాల హక్కులు, బాధ్యతలను చాలా కఠినంగా కుదించివేస్తున్నారు. వ్యవసాయబిల్లులనే ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. ‘భారత రాజ్యాంగం ప్రకారం వ్యవసాయం, మార్కెట్లు అనే అంశాలు రాష్ట్ర జాబితాలో ఉన్నాయి. ఈ అంశాలపై శాసన నిర్మాణానికి రాష్ట్రాలను కేంద్రం ప్రోత్సహిస్తుంది. నచ్చచెబుతుంది. బుజ్జగిస్తుంది. అంతేగాని ఆ అంశాలపై కేంద్రం తనకుతానే చట్టాలను చేయలేదు’ అని హరీశ్ దామోదరన్ వ్యాఖ్యానించారు. అయినప్పటికీ ఉమ్మడి జాబితాలోని ఆహారపదార్థాలలో వర్తక వాణిజ్యాలు అనే అంశానికి తప్పుడు భాష్యం చెప్పడం ద్వారా వ్యవసాయ బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదింపచేయడంలో కేంద్రం సఫలమయింది. ఈ వ్యవహారాలలో రాష్ట్రాలను కేంద్రం సంప్రదించనే లేదు. అంతేగాక ప్రామాణిక పార్లమెంటరీ పద్ధతులను ఉల్లంఘించింది. 


కరోనా కల్లోలంలో సమాఖ్య సూత్రంపై దారుణమైన దాడి జరిగింది. వలసపాలనాకాలపు చట్టాలు, జాతీయ విపత్తు నిర్వహణ చట్టం ద్వారా కేంద్రం తన అధికారాలను మరింతగా పటిష్ఠపరచుకున్నది. ఇదిలా ఉండగా ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ప్రభుత్వాలను ధనబలంతో బలహీనపరచడం ముమ్మరమయింది. ఆయా పార్టీల ప్రజాప్రతినిధులను నయాన భయాన బెదిరించి బీజేపీకి సానుకూలం చేసుకోవడం అంతకంతకూ పెరుగుతోంది. ప్రజల ఆరోగ్యం కంటే అధికారమే బీజేపీకి ముఖ్యం. కేవలం నాలుగు గంటల వ్యవధితో లాక్‌డౌన్‌ను విధించే ముందు మధ్యప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వ ప్రమాణస్వీకారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వేచి ఉండడమే అందుకు ఒక తిరుగులేని నిదర్శనం. 


సమాఖ్య విధానంపై దాడిలో బీజేపీ ప్రధానంగా రెండు రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుంది. అవి, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర. ఈ రాష్ట్రాల గవర్నర్లు రాజ్యాంగానికంటే హిందూత్వ భావజాలానికే ఎక్కువ విధేయులు. కేంద్ర దర్యాప్తుసంస్థలు చట్టానికంటే మంత్రులకే ఎక్కువ విధేయంగా ప్రవర్తిస్తున్నాయి. బెంగాల్, మహారాష్ట్రలలో అధికారంలో ఉన్న బీజేపీయేతర ప్రభుత్వాలను వేధించడానికి కేంద్ర దర్యాప్తుసంస్థలను మోదీ–-షా ద్వయం ఉపయోగించుకుంటోంది. ప్రత్యర్థులను బెదిరింపులకు గురిచేయడంలో బీజేపీ చాలా నిస్సిగ్గుగా వ్యవహరిస్తోంది. 


గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నరేంద్రమోదీ రాజకీయేతర పౌరసమాజ సంస్థలను సైతం తీవ్రంగా అనుమానించేవారు. వాటిపట్ల ఎంతో అసహనాన్ని ప్రదర్శించేవారు. ప్రధానమంత్రిగా కూడా ఆయన ఆ తరహా సంస్థల పట్ల అదే అపనమ్మకాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వేతర సంస్థల (ఎన్జీవో)లపై ఇప్పటికే విస్తృతస్థాయిలో ఉన్న ఆంక్షలను 2020 సంవత్సరంలో మరింత తీవ్రం చేశారు. ఇందులో భాగంగానే ‘విదేశీ విరాళాల (క్రమబద్ధీకరణ) చట్టం’కు ఒక కొత్త సవరణ చేశారు. విద్య, ఆరోగ్యభద్రత, ప్రజల జీవనాధారాలు, జెండర్ న్యాయం.. ఆ మాటకొస్తే భారత ప్రజాస్వామ్యం ఈ సవరణ వల్ల తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవలసివస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. 


పాత్రికేయులు అంటే నరేంద్రమోదీకి అభిమానం పూర్తిగా పూజ్యం. ప్రధానమంత్రిగా గత ఆరున్నర సంవత్సరాలలో ఆయన ఒక్కసారి కూడా విలేకరుల సమావేశాన్ని నిర్వహించలేదు. ముగిసిన సంవత్సరంలో మనదేశంలో పత్రికా స్వాతంత్ర్యంపై దాడులు ముమ్మరమయ్యాయి. లాక్‌డౌన్ విధించిన తొలి రెండు నెలల్లోనే 55 మంది పాత్రికేయులు ఎఫ్‌ఐఆర్‌లు, తీవ్రమైన బెదిరింపులు, అరెస్టులను ఎదుర్కోవలసివచ్చింది. పాత్రికేయులపై అత్యధిక దాడులు ఉత్తరప్రదేశ్, జమ్మూ-కశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్‌లలో జరిగాయి. ఇవన్నీ బీజేపీ నియంత్రణలో ఉన్నవే కావడం గమనార్హం. ‘భారతదేశంలో జర్నలిస్టులకు 2020 ఒక మహా చెడ్డ సంవత్సరం. జర్నలిస్టుల హత్యలు, వారిపై దాడులు పెద్ద ఎత్తున కొనసాగాయి. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాను నియంత్రించడానికి ప్రభుత్వం పలు విధాల ప్రయత్నించిందని’ ‘ఫ్రీ స్పీచ్ కలెక్టివ్’ పేర్కొంది. ప్రపంచ పత్రికాస్వేచ్ఛ సూచీలో భారత్ 142వ స్థానంలో ఉన్నది. నేపాల్, అప్ఘానిస్థాన్, శ్రీలంక కంటే మనమే చాలా అథోస్థానంలో ఉన్నాం. అయితే పాకిస్థాన్ మన కంటే మరో మూడు స్థానాలు దిగువున ఉండడం ఒక్కటే మనకు కొంత సాంత్వన. 


రాజ్యవ్యవస్థ, ప్రైవేట్‌రంగం ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాలంటే పత్రికాస్వేచ్ఛ సంపూర్ణంగా ఉండాలి. పార్లమెంటులో ఏ అంశంపైన అయినా అవగాహనతో కూడిన సమగ్ర చర్చలు జరగాలి. స్వతంత్ర వైఖరితో వ్యవహరించే పౌరసమాజ సంస్థలూ చాలా ముఖ్యం. మరి 2020లో పత్రికా స్వేచ్ఛ మరింతగా కుదించుకుపోయింది, పార్లమెంటరీ చర్చలు నిస్సారమైపోయాయి, పౌరసమాజ సంస్థలు అణచివేతకు గురయ్యాయి. సరే, రాజ్యం, అధికారపక్షం హిందువులు కాని వారిని హిందువుల కంటే తక్కువగా చూడడం సమాజంలో సామాజిక సామరస్యానికి ఎలా దోహదం చేస్తుంది? ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, ఆయన పార్టీకి దేశ ప్రజల ఆర్థిక సంక్షేమం, సామాజిక శ్రేయస్సు కంటే రాజకీయ అధికారం, భావజాల ఆధిపత్యం, వ్యక్తిగత కీర్తిప్రతిష్ఠలే ముఖ్యంగా ఉన్నాయి. భారతీయ ప్రజాస్వామ్య సంస్థలు, భారతీయ బహుళత్వవాద సంప్రదాయాలను బలహీనపరిచి, అధిక సంఖ్యాకులకు అనుకూలమైన నిరంకుశాధికార రాజ్యవ్యవస్థను నిర్మించేందుకు కరోనా సంక్షోభాన్ని జాతీయ అధికారపక్షం వారు ఉపయోగించుకున్నారు.మహమ్మారి కాలంలో విపత్తుల వెల్లువ

రామచంద్ర గుహ

(వ్యాసకర్త చరిత్రకారుడు)

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేLatest News in Telugu మరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.