24న జో బైడెన్‌తో సమావేశం
న్యూఢిల్లీ, సెప్టెంబరు 21: ప్రధాని మోదీ 5 రోజుల పర్యటన నిమిత్తం బుధవారం అమెరికా వెళ్లనున్నారు. ఆ దేశ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ గురువారం వాషింగ్టన్లో మోదీని కలుస్తారని శ్వేతసౌధం ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో మోదీ ఈ నెల 24న వాషింగ్టన్లో సమావేశమవుతారని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శృంగ్లామంగళవారం మీడియాకు తెలిపారు. అమెరికాతో భారత ద్వైపాక్షిక సత్సంబంధాలను మరింత బలోపేతం చేయడం, పెట్టుబడులు, రక్షణ రంగాలు, అఫ్ఘానిస్థాన్లోని పరిస్థితులు, ఉగ్రవాద నిరోధం, ఇండో-పసిఫిక్, వాతావరణ మార్పులు వంటి అంశాలపై మోదీ, బైడెన్ చర్చలు జరపనున్నారు. అలాగే, ఈ నెల 24నే వాషింగ్టన్లో చతుర్భుజ భద్రతా కూటమి(ఆస్ట్రేలియా, భారత్, జపాన్, అమెరికా కూటమి) సదస్సులోనూ మోదీ పాల్గొంటారు. ఈ నెల 25న న్యూయార్క్‌లో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలోనూ ఆయన ప్రసంగిస్తారు. మోదీ తిరిగి భారత్‌కు ఆదివారం వస్తారని హర్షవర్ధన్ శృంగ్లా చెప్పారు.
మెక్రోన్తో ఫోన్లో మాట్లాడిన మోదీ
భారత ప్రధాని మోదీ, ఫ్రెంచి అధ్యక్షుడు ఇమ్మానుయెల్ మెక్రోన్ ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సహకారం గురించి మంగళవారం చర్చించడం ఆసక్తికరంగా మారింది. ఇరువురు నేతలు ఫోన్లో ఇండో-పసిఫిక్‌తో పాటు అఫ్ఘానిస్థాన్ సంక్షోభంపైనా చర్చించారని మెక్రోన్ కార్యాలయం తెలిపింది.