కాలానికి ముందున్న మోదీ

ABN , First Publish Date - 2020-09-01T06:34:53+05:30 IST

ప్రస్తుత పోటీ సమాజంలో తమకున్న సమయం అమూల్యమని, దాన్ని క్షణక్షణం ఉపయోగించుకుని తమ విద్యార్హతలను, నైపుణ్యాన్ని, ప్రతిభాపాటవాలను...

కాలానికి ముందున్న మోదీ

నీట్, జెఇఇ పరీక్షలు నిర్వహిస్తున్న టెస్టింగ్ ఏజెన్సీకి కాని, కేంద్ర విద్యా మంత్రిత్వశాఖకు కాని, సుప్రీంకోర్టుకు కానీ, ఆఖరుకు తమ భవిష్యత్ ను మెరుగుపరుచుకోవాలనుకునుకుంటున్న విద్యార్థులకు కానీ, అన్ని విషయాలు పరిశీలనలోకి తీసుకుని తీర్పునిచ్చిన ఉన్నత న్యాయస్థానానికి గాని లేని బాధ ప్రతిపక్షాలకు దేనికో అర్థం కావడం లేదు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజలు, విద్యార్థులు, యువత మోదీ నాయకత్వాన్ని, ఆయన నిర్ణయాలను ఆహ్వానిస్తూ ముందుకు వెళుతుంటే, తమ మనుగడ నిరూపించుకునేందుకు కాలం చెల్లిన కాంగ్రెస్, ఇతర విపక్షాలు చేస్తున్న గందరగోళం అరణ్య రోదనగా మిగిలిపోవడంలో ఆశ్చర్యం లేదు.


ప్రస్తుత పోటీ సమాజంలో తమకున్న సమయం అమూల్యమని, దాన్ని క్షణక్షణం ఉపయోగించుకుని తమ విద్యార్హతలను, నైపుణ్యాన్ని, ప్రతిభాపాటవాలను మెరుగుపరుచుకుని తమ సత్తా చాటకపోతే ఈ ప్రపంచంలో వెనుకడుగు వేయక తప్పదని యువతకు తెలుసు. ఈ పరిస్థితుల్లో వారు తమ భవిష్యత్‌కు బంగారు బాట వేసే విధానాలను రూపొందిస్తున్న నాయకులకోసం అన్వేషించడం, వారికి పట్టం కట్టడం కూడా జరుగుతోంది. అందుకే 2014 ఎన్నికల్లో నరేంద్రమోదీకి పెద్ద ఎత్తున బ్రహ్మరథం పట్టారు. తమ స్వప్నాలను సార్థకం చేసి తమ భవిష్యత్‌ను తీర్చిదిద్దగల సమర్థత మోదీకే ఉన్నదని వారు గ్రహించారు. ఇవాళ 2020లోకి అడుగుపెట్టినా మోదీ పట్ల వారి అభిమానం చెక్కుచెదరలేదు. ఇందుకు పలు కారణాలున్నాయి.

 

అవినీతి భూయిష్ట ప్రభుత్వ విధానాల నుంచి పోటీ ద్వారా సమర్థతకు పట్టం కట్టే పాలనను ప్రవేశపెట్టిన మోదీ విధానాలను వారు గమనించారు. కాంగ్రెస్ హయాంలో ప్రాజెక్టులు వేగవంతంగా పూర్తి కాకుండా, విధానాలు అమలు కాకుండా ఒక ప్రతిష్టంభన ఏర్పడేది. మోదీ పాత ఫైళ్లను దుమ్ము దులిపి, పెండింగ్ ప్రాజెక్టులను వేగవంతం చేసి పనులను సకాలంలో పూర్తి చేసేందుకు ప్రాధాన్యత నిచ్చారు. రాజకీయ వ్యవస్థలోనే కాదు, పాలనా రంగంలోనే కాదు, పరిశోధనా రంగంలో కూడా యువతకు ప్రాధాన్యతనిచ్చి కాలం చెల్లిన ఆలోచనా విధానానికి స్వస్తి చెప్పి కొత్త ఆలోచనలకు మోదీ ద్వారాలు తెరిచారు. కుంభకోణాల భారత్ స్థానంలో నైపుణ్య భారత్ ప్రవేశించింది. రాజకీయ ప్రయోజనాలకోసం నిర్ణయాలను తొక్కిపెట్టి, పనులను వాయిదా వేసే తత్వం మోదీకి లేదని యువత గ్రహించారు. పెద్ద నోట్ల రద్దు అయినా, 17 పన్నులను రద్దు చేసి ఒకే ఒక జీఎస్టీని ప్రవేశపెట్టడంలో అయినా, ఆర్థిక రంగంలో వేగవంతంగా సంస్కరణలను చేపట్టడంలోనైనా, కరోనా మహమ్మారి సృష్టించిన అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఆత్మనిర్భర్‌ను ఒక నినాదంగా మార్చి భారత్‌ను తన కాళ్లపై తాను నిలబడేందుకు తగిన సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడంలోనైనా మోదీ వేసే ప్రతి అడుగూ యువతకు నచ్చితీరుతుంది. అంతేకాదు, భారత్ అస్తిత్వానికి నిదర్శనాలైన కశ్మీర్, రామజన్మభూమి వంటి అంశాలపై స్థిరమైన నిర్ణయాలు తీసుకునే మోదీని వారు ఇష్టపడకుండా ఉండరు. అందుకే ఇటీవల కాంగ్రెస్ అధిష్ఠానంపై తిరుగుబాటు చేసిన ఆ పార్టీ అసమ్మతి వాదులు సైతం మోదీ పట్ల రోజురోజుకూ యువతకు పెరుగుతున్న ఆదరణను తమ నాయకత్వం గమనించడం లేదని వాపోయారు. ఇవ్వాళ్టికి కొన్ని ప్రతిపక్ష పార్టీలలో కొందరు వాస్తవాన్ని గమనిస్తున్నారు కాని మెజారిటీ ప్రతిపక్షాలు ఇంకా తమ దుష్ట ప్రయోజనాలకోసం విద్యార్థులను, యువతను ఉపయోగించుకొనేందుకు తరుచూ పావులు కదుపుతూనే ఉన్నాయి. హైదరాబాద్ యూనివర్సిటీ, జామియా మిలియా, అలీఘడ్, ఢిల్లీ యూనివర్సిటీ, జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీతో పాటు దేశంలో అనేక యూనివర్సిటీల్లో ఆందోళనలు సృష్టించే ప్రయత్నం చేశాయి. ఇప్పుడు తాజాగా జెఇఇ, నీట్ పరీక్షల నిర్వహణను కూడా రాజకీయం చేసేందుకు ప్రతిపక్షాలు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి.


నిజానికి మెడికల్ కళాశాలలు, ఐఐటీలలో ప్రవేశం కోసే నిర్వహించే నీట్, జెఇఇ పరీక్షలు ప్రతి ఏడాదీ ఏప్రిల్లో జరుగుతాయి. కరోనా మహమ్మారి మూలంగా ఈ పరీక్షలను ఇప్పటికే రెండు సార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. ఇక వాయిదా వేస్తే కొత్త అకడమిక్ సంవత్సరం జనవరి వరకూ ప్రారంభించే అవకాశం ఉండదు. దీని వల్ల మొత్తం పాఠ్య ప్రణాళికను ఆరునెలలకు కుదించాల్సిన అవసరం ఏర్పడుతుంది. దీని వల్ల మెడికల్, ఇంజనీరింగ్ వంటి ప్రామాణికమైన కోర్సుల నాణ్యత తగ్గిపోతుంది. కరోనా వైరస్ ఉన్నదన్న పేరుతో ఒక విద్యాసంవత్సరాన్ని పూర్తిగా వృథా చేయడమా లేక, తగిన సురక్షిత చర్యలు, కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య నిర్వహించడమా అన్న మీమాంస ప్రభుత్వానికి ఏర్పడింది. ఈ దశలో నిపుణులతోనూ, విద్యాసంస్థల అధిపతులతోనూ చర్చించి కేంద్రం సెప్టెంబర్‌లో జెఇఇ, ఐఐటి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. నిజానికి విద్యార్థుల ప్రాణాలు ప్రమాదంలో పడతాయంటూ 11 మంది విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం సైతం ఆగస్టు 17న కొట్టి వేసింది. జీవితం ఒక చోట ఆగరాదు. అన్ని సురక్షిత చర్యలతో ముందుకు వెళ్లాల్సిందే. అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒక పూర్తి సంవత్సరం వృథా చేసేందుకు విద్యార్థులు సిద్ధంగా ఉన్నారా? కరోనా మరో ఏడాది వరకు ఉంటే అప్పటి వరకూ వేచి ఉంటారా? ఇలా ఎన్ని సంవత్సరాలు వృథా చేసి మీ భవిష్యత్‌ను నాశనం చేసుకుంటారు? దీని వల్ల దేశానికి, విద్యార్థులకు జరిగే నష్టం మీకు తెలుసా అని సుప్రీం కోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది.


నిజానికి ఈ పరీక్షలు నిర్వహిస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాటిని సురక్షితంగా జరిపేందుకు అన్ని ఏర్పాట్లూ చేసింది. దేశ వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలూ ఈ పరీక్షలు నిర్వహించేందుకు సన్నద్ధతను ప్రకటించాయి. 99 శాతం విద్యార్థులు తమకు ఏ సెంటర్‌లో పరీక్ష కావాలో ఇప్పటికే ప్రకటించారు. ప్రతిపక్షాలు చేస్తున్న గందరగోళంతో నిమిత్తం లేకుండా విద్యార్థులు తమ భవిష్యత్‌ను తీర్చిదిద్దుకునేందుకు తయారీలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే మెజారిటీ రాష్ట్రాలు విద్యార్థులకు ఉచితంగా రవాణా సౌకర్యాలు ఏర్పాట్లు చేసేందుకు, ఇతర భద్రతా సౌకర్యాలు కల్పించేందుకు సంసిద్ధతను ప్రకటించాయి. సెప్టెంబర్ 1 నుంచి ఆరవ తేదీ వరకు జరిగే జెఇఇ పరీక్షల నిర్వహణకు అవసరమైన సామాజిక దూరం, శానిటైజర్లు, థర్మల్ స్క్రీనింగ్‌కు చెందిన చర్యలు విస్తృతంగా తీసుకుంటున్నారు. పరీక్షా కేంద్రాల వెలుపల కూడా విద్యార్థులు దూరందూరంగా నిలబడేందుకు తగిన మార్కింగ్‌లు పూర్తయ్యాయి. గతంలో కన్నా ఎక్కువ పరీక్షా కేంద్రాలను ఏర్పాట్లు చేసి రద్దీ లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. విద్యార్థుల భద్రత, భవిష్యత్ తమకు అన్నిటికన్నా ముఖ్యమైన ప్రాధాన్యత అని కేంద్ర విద్యామంత్రి రమేశ్ పోఖ్రియాల్ స్పష్టంగా ప్రకటించారు.


పరీక్షలు నిర్వహిస్తున్న టెస్టింగ్ ఏజెన్సీకి కాని, కేంద్ర విద్యా మంత్రిత్వశాఖకు కాని, సుప్రీంకోర్టుకు కానీ, ఆఖరుకు తమ భవిష్యత్‌ను మెరుగుపరుచుకోవాలనుకునుకుంటున్న విద్యార్థులకు కానీ, అన్ని విషయాలు పరిశీలనలోకి తీసుకుని తీర్పు నిచ్చిన ఉన్నత న్యాయస్థానానికి గాని లేని బాధ ప్రతిపక్షాలకు దేనికో అర్థం కావడం లేదు. కేవలం ఆరు ప్రతిపక్ష రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రమే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్లు వేసి చివరి నిమిషంలోనైనా పరీక్షలను అడ్డుకోవాలని విఫల యత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, అధ్యక్ష బాధ్యతలు చేపట్టి విఫలమైన రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంకా వాధ్రా ట్వీట్ల మీద ట్వీట్లు గుప్పిస్తూ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్లు చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లో తన అరాచక పాలన వల్ల ప్రజల్లో ఏర్పడిన వ్యతిరేకతను ఎదుర్కొనేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విద్యార్థుల్లో లేని పోని ఆందోళనలను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, ఉత్తరప్రదేశ్‌లో నిరసన తెలిపిన సమాజ్ వాది పార్టీ యువ విభాగం కార్యకర్తలు కానీ ప్రజలనుంచి పెద్దగా ప్రతిస్పందన రాబట్టలేకపోయారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజలు, విద్యార్థులు, యువత మోదీ నాయకత్వాన్ని, ఆయన నిర్ణయాలను ఆహ్వానిస్తూ ముందుకు వెళుతుంటే, తమ మనుగడ నిరూపించుకునేందుకు కాలం చెల్లిన కాంగ్రెస్, ఇతర విపక్షాలు చేస్తున్న గందరగోళం అరణ్య రోదనగా మిగిలిపోవడంలో ఆశ్చర్యం లేదు.


వై. సత్యకుమార్

(బిజెపి జాతీయ కార్యదర్శి)

Updated Date - 2020-09-01T06:34:53+05:30 IST