‘వంద కోట్ల’ విజయంలో.. టీకా ఉత్పత్తిదారుల కృషి కీలకం

ABN , First Publish Date - 2021-10-24T08:10:07+05:30 IST

‘‘తొమ్మిది నెలల కాలంలోనే భారత్‌లో 100 కోట్ల డోసుల కొవిడ్‌-19 టీకాలు అందించగలిగాం. ఈ ఘనత వెనుక టీకా ఉత్పత్తిదారుల కృషి కీలకం.

‘వంద కోట్ల’ విజయంలో.. టీకా ఉత్పత్తిదారుల కృషి కీలకం

సమన్వయంతో సవాళ్లను ఎదుర్కోవాలి: మోదీ

న్యూఢిల్లీ/పనాజి అక్టోబరు 23: ‘‘తొమ్మిది నెలల కాలంలోనే భారత్‌లో 100 కోట్ల డోసుల కొవిడ్‌-19 టీకాలు అందించగలిగాం. ఈ ఘనత వెనుక టీకా ఉత్పత్తిదారుల కృషి కీలకం. మహమ్మారి విజృంభణ తర్వాత వేగంగా టీకాలను అందించగలిగారు. ప్రపంచ ప్రమాణాలతో టీకాలను ఉత్పత్తి చేశాం’’ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ నెల 21న 100 కోట్ల డోసుల వ్యాక్సినేషన్‌ మార్కును చేరుకున్న సందర్భంగా శనివారం ఆయన దేశంలోని ఏడు టీకా తయారీ సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు. వ్యాక్సిన్లపై పరిశోధన, ఇతర అంశాలపై చర్చించారు. ఈ భేటీలో భారత్‌ బయోటెక్‌ తరఫున డాక్టర్‌ కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లా, డాక్టర్‌ రెడ్డీస్‌ తరఫున సతీశ్‌రెడ్డి, దీపక్‌ సప్రా, బయోలాజికల్‌-ఈ నుంచి మహిమ దాట్ల, నరేందర్‌ మాంటెల, సీరం నుంచి సైరస్‌ పూనావాలా, అదర్‌ పూనావాలా, జైడస్‌ నుంచి పంకజ్‌ పటేల్‌, శేర్విల్‌ పటేల్‌, జెన్నొవా బయోఫార్మా నుంచి సంజయ్‌ సింగ్‌, సతిశ్‌ రామన్‌లాల్‌ మెహతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. భారత వ్యాక్సిన్‌ ఉత్పత్తి సంస్థలు సమన్వయంతో పనిచేయాలని, భవిష్యత్‌ సవాళ్లను అధిగమించాలని ఆకాంక్షించారు. ఆయా సంస్థల సీఈవోలు, ప్రతినిధులు 100 కోట్ల మార్కును అధిగమించడంలో ప్ర ధాని మోదీ కృషిని కొనియాడారని ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంవో) ఒక ప్రకటనలో తెలిపింది.   


స్వయంసమృద్ధ గోవా..!

ప్రధాని మోదీ గోవా అసెంబ్లీ ఎన్నికల శంఖం పూరించారు. వచ్చే ఫిబ్రవరిలో గోవా శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. స్వయంపూర్ణ గోవాను తయారు చేయాలంటే ‘డబుల్‌ ఇంజిన్‌’ ప్రభుత్వం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధాని స్పష్టం చేశారు. శనివారం వర్చువల్‌గా నిర్వహించిన ‘ఆత్మనిర్భర్‌ భారత్‌ స్వయంపూర్ణ గోవా’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.  

Updated Date - 2021-10-24T08:10:07+05:30 IST