నారాయణపురం.. అంతేనా?

ABN , First Publish Date - 2022-05-24T04:37:59+05:30 IST

నిలిచిన ఆనకట్ట ఆధునికీకరణ పనులు ఈ ఖరీఫ్‌కు కూడా పూర్తికానట్టే బిల్లుల చెల్లింపులో జాప్యమే కారణమా? (ఎచ్చెర్ల) ‘నారాయణపురం’ అధునికీకరణ పనులనూ ప్రభుత్వం అటకెక్కించింది. గత ఏడాది మే నెల మధ ్యలో ఆపేసిన పనులు తిరిగి ప్రారంభం కాలేదు. బిల్లుల చెల్లింపు సరిగా లేకనే పనుల్లో తీవ్ర జాప్యం అవుతోందన్న విమర్శలు ఉన్నాయి. కొద్దిరోజుల్లో ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం అవుతుంది. రుతుపవనాలు ముందే ప్రవేశిస్తాయన్న సమాచారంతో రైతులు సాగుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికీ ఆనకట్ట పనులు చేపట్టకపోవడంపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

నారాయణపురం.. అంతేనా?
అర్థాంతరంగా ఆగిన నారాయణపురం కాలువ పనులు

నిలిచిన ఆనకట్ట ఆధునికీకరణ పనులు
ఈ ఖరీఫ్‌కు కూడా పూర్తికానట్టే
బిల్లుల చెల్లింపులో జాప్యమే కారణమా?
(ఎచ్చెర్ల)

‘నారాయణపురం’ అధునికీకరణ పనులనూ ప్రభుత్వం అటకెక్కించింది. గత ఏడాది మే నెల మధ ్యలో ఆపేసిన పనులు తిరిగి ప్రారంభం కాలేదు. బిల్లుల చెల్లింపు సరిగా లేకనే పనుల్లో తీవ్ర జాప్యం అవుతోందన్న విమర్శలు ఉన్నాయి. కొద్దిరోజుల్లో ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం అవుతుంది. రుతుపవనాలు ముందే ప్రవేశిస్తాయన్న సమాచారంతో రైతులు సాగుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికీ ఆనకట్ట పనులు చేపట్టకపోవడంపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 2019 సంవత్సరంలో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో నారాయణపురం ఆధునికీకరణకు బీజం పడింది. కేంద్రం, జపాన్‌ ప్రభుత్వంతో ఈ పనులకు ఒప్పందం కుదిరింది. రూ.112 కోట్ల జైకా నిధుల విడుదలకు అంగీకారం కుదిరింది. ఆ తర్వాత టెండర్లు కూడా ఖరారయ్యాయి. పనుల పూర్తికి ఇప్పటికే రెండోసారి కుదర్చుకున్న ఒప్పందం కూడా ఈ ఏడాది ఆగస్టు నాటికి పూర్తవుతుంది. మూడోసారి అగ్రిమెంటు ఎస్‌ఈ, సీఈతో కాకుండా ప్రభుతంతోనే జరగాల్సిఉంది. అగ్రిమెంటు గడువు పూర్తవుతున్నా, ఖరీఫ్‌ సీజన్‌ మరికొద్ది రోజుల్లో ప్రారంభవుతున్నా తిరిగి పనులు చేపట్టకపోవడంతో ఆయకట్టు రైతులు తీవ్ర అసంతృప్తి వక్తంచేస్తున్నారు. వాస్తవానికి ఖరీఫ్‌లో జూలై రెండు, మూడు వారాల్లో కాలువ ద్వారా నీరు అందించాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో కాలువ ద్వారా నీరు ఎలా విడుదల చేస్తారో మరి.

25 శాతం పనులు పూర్తి
నారాయణపురం ఆనకట్ట కింద కుడి, ఎడమ కాలువలు ఉన్నాయి. కుడి కాలువ కింద సంతకవిటి, పొందూరు, ఎచ్చెర్ల మండలాల పరిధిలో 50.6 ఎకరాల పొడవునా కాలువ ఉంది. ఇప్పటివరకు కుడి కాలువ కింద 25 శాతంలోపు పనులు మాత్రమే జరిగాయి. గతేడాది ఖరీఫ్‌ ముందు చేపట్టిన పనుల్లో సంతకవిటి మండలం వాల్తేరు నుంచి పొందూరు మండలం గోకర్ణపల్లి వరకు 3.2 కిలోమీటర్ల మేర, ఎచ్చెర్ల మండలంలోని శివారు గ్రామమైన భగీరఽథపురం వరకు సిమెంటు లైనింగ్‌ వేయాలని ప్రతిపాదించినా, ఇప్పటి రేట్ల ప్రకారం నవభారత్‌ జంక్షన్‌ వరకు మాత్రమే ఈ పనులు చేపట్టవచ్చని ఇరిగేషన్‌ అధికారులు చెబుతున్నారు. కుడి కాలువలో రూ.9.5 కోట్ల పనులు జరిగితే రూ.1.3 కోట్లు మాత్రమే బిల్లు మంజూరైనట్టు తెలిసింది. దీంతో పనులు ముందుకు సాగడం లేదనే ప్రచారం ఉంది.

షట్టర్లు అంతంతమాత్రమే
నారాయణపురం కుడి కాలువ పొడవునా చిన్నా, పెద్దా షట్టర్లు 60 వరకు ఉన్నాయి. వీటిలో చాలావరకు పూర్తిగా పాడయ్యాయి. ఆనకట్ట ఏర్పాటు చేసిన సమయంలోనే వీటిని బిగించారు. ఆ తర్వాత షట్టర్లను మార్చిన దాఖలాల్లేవు. దీంతో సాగునీరు వృథా అవుతోంది.

కూలడానికి సిద్ధంగా బ్రిడ్జిలు
కుడి కాలువ పొడవునా చాలా వరకు బ్రిడ్జిలు కూలడానికి సిద్ధంగా ఉన్నాయి. వాసుదేవపట్నం, చిన్నయ్యపేట, మంతెన, గోకర్ణపల్లి, బూరాడపేట, దుప్పలవలస సమీపంలో బ్రిడ్జిలు చాలా వరకు పాడయ్యాయి. ఎచ్చెర్ల మండలం దుప్పలవలస అంబేడ్కర్‌ బాలుర గురుకుల పాఠశాలకు సమీపంలో కాలువపై ఉన్న బ్రిడ్జిని చూస్తే భయమేస్తోంది. ఇదే బ్రిడ్జి మీదుగానే ఇక్కడి అర్బన్‌ హౌసింగ్‌ కాలనీవాసులు రాకపోకలు సాగిస్తుంటారు. ఎచ్చెర్ల మండలం మాల కుశాలపుర ం, పెయ్యలవానిపేట, పొందూరు మండలం కింతలి పరిధిలోని దోమగుండం చెరువు వద్ద పూర్తిగా పాడైన రెగ్యులేటర్స్‌ను మార్చాల్సి ఉంది. దోమగుండం చెరువు వద్ద పాడైన మదుమును పునర్నిర్మించకపోతే నీరు వృథా అయ్యే పరిస్థితి ఉంది.

సాగునీటికి తప్పని కష్టాలు
కుడి కాలువ కింద శివారున ఎచ్చెర్ల మండలంలోని కొత్తపేట, ముద్దాడ, ధర్మవరం, రామజోగిపేట, భగీరథపురం తదితర గ్రామాల పరిధిలోని ఆయకట్టుకు ఏటా అతికష్టమ్మీద సాగునీరు సరఫరా చేస్తున్నారు. సీజన్‌ వచ్చే సమయంలోనే మొక్కుబడిగానే పనులు జరుగుతున్నాయి. దీంతో ఆయకట్టదారులకు పెద్దగా ప్రయోజనం ఉండడంలేదు. దీంతో ప్రతి ఏటా రైతులు సాగునీటి కష్టాలను ఎదుర్కొంటున్నారు.

ఏటా ఇదే ఇబ్బంది
సాగునీటి కోసం ఏటా ఇబ్బంది పడుతున్నాం. అతి కష్టమ్మీద శివారు గ్రామాలకు సాగునీరు చేరుతుంది. దీనివల్ల చాలా కష్టాలు ఎదుర్కొంటున్నాం. మూడేళ్లుగా ఆధునికీకరణ పనులు నత్తనడకగానే సాగుతున్నాయి. టీడీపీ ప్రభుత్వం హయాంలో మంజూరైన ఆధునికీకరణ పనులను సకాలంలో పూర్తిచేయాలి.
- బెండు మల్లేశ్వరరావు, మాజీ సర్పంచ్‌ ముద్దాడ, ఎచ్చెర్ల మండలం

పనుల ప్రారంభానికి చర్యలు
నారాయణపురం ఆధునికీకరణ పనుల ప్రారంభానికి చర్యలు తీసుకుంటాం. ఉన్నతాధికారులు కూడా ఇదే ప్రయత్నంలోనే ఉన్నారు. గడువులోగా పనులు పూర్తిచేసేందుకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తాం.
- రవికుమార్‌, ఏఈఈ, జలవనరుల శాఖ

Updated Date - 2022-05-24T04:37:59+05:30 IST