ఆధునికత, ఉపద్రవాలు

ABN , First Publish Date - 2020-07-15T05:49:43+05:30 IST

మానవ చరిత్రలో ఆధునికత అనేది–గత సమాజాలలో మనిషి అస్తిత్వాన్ని అంతటా ఆవరించివున్న భయాందోళనలను పారద్రోలి, మనుషులు తమ జీవితాల్ని తమ నియంత్రణలో...

ఆధునికత, ఉపద్రవాలు

మనుషులు తమ నైతిక ఆవరణనుంచి మిగతా జీవజాలాన్ని బహిష్కరించారు. వాటిపట్ల మనకు ఎటువంటి బాధ్యత లేదని భావించారు. ఇది ఒక రకమయిన బాధ్యతా రాహిత్య ప్రవర్తన. ఎటువంటి బాధ్యతా రాహిత్య ప్రవర్తనకయినా ఏదో ఒక రూపంలో పర్యవసానాలు అనివార్యం. ప్రస్తుత పర్యవసాన రూపం కొవిడ్-–19. ఈ విపత్తును ఒక గుణపాఠంగా తీసుకోకపోతే మరింత దారుణాలను, ఉపద్రవాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.


మానవ చరిత్రలో ఆధునికత అనేది–గత సమాజాలలో మనిషి అస్తిత్వాన్ని అంతటా ఆవరించివున్న భయాందోళనలను పారద్రోలి, మనుషులు తమ జీవితాల్ని తమ నియంత్రణలో పెట్టుకొని ప్రకృతిని, సామాజిక ప్రపంచాన్ని కూడా నియంత్రించే కాలంగా–భావించారు. ఆధునికత మొదలైన 500 సంవత్సరాల తరువాత కూడా మనిషి భయాందోళనలు రూపాలు మార్చుకొంటూ కొనసాగుతూనే వున్నాయి. ఏ లక్ష్యాలను నిర్దేశించుకొని ఆధునికత బయలుదేరిందో ఆ లక్ష్యాలు నెరవేర్చకపోగా సగటు మనిషి జీవితాన్ని మరింతగా కల్లోల పర్చింది. ప్రముఖ పోలిష్ సామాజిక శాస్త్రవేత్త జిగ్మంట్‌ బౌమన్‌ (1926–2017) ‘ద్రవ భీతి’ (liquid fear) అనే తన రచనలో ఇవ్వాళ్టి ద్రవ ఆధునిక సమాజంలో ప్రతిచోటా కన్పిస్తూవున్న భయాందోళనల గురించి చర్చిస్తాడు. ఆధునిక పూర్వ సమాజాల్లో భయం అనేది చీకటితో ముడిపడివుండేది. మనుషులు తమ ఇంటి వెలుపల వున్న చీకటిని చూసికూడా భయపడేవాళ్ళు. ఎందుకంటే చీకటిలో ఏదయినా జరగవచ్చు. నిజానికి చీకటి దానికదే భయకారకం కాదు. అందులో వుండే అనిశ్చితే భయానికి కారణం. ఈ అనిశ్చితిని ఆధునికత, అది వాగ్దానం చేసినట్టు తొలగించకపోగా మరింతగా పెంచింది. 


భయం అనేది ఒక అనుభూతి. ఈ అనుభూతి మనుషులకు జంతువులకు వుండే సామాన్య లక్షణం. దీనితోపాటు మనుషులకు మరొక భయం వుంటుంది. దీన్ని ద్వితీయ భయం లేక వ్యుత్పత్తి భయం (derivative fear) అంటారు. ఇది సాధారణంగా వ్యక్తులు ఒక ఉపద్రవాన్ని, సంక్షోభాన్ని చాలా దగ్గరగా ఎదుర్కొన్నప్పుడు, చూసినప్పుడు కలిగేది. ఈ భయం స్వయం చోదక శక్తి కలిగివుంటుంది. దీన్ని అంతరంగీకరించుకున్న వ్యక్తులు ప్రమాదాల్ని ప్రత్యక్షంగా ఎదుర్కొంటున్నప్పుడు, ఎటువంటి ప్రమాదం లేనప్పుడు కూడా భయంలోనే వుంటారు. నిరంతరం తమకేదో ప్రమాదం పొంచివుందనే అభద్రతకు లోనవుతూ వుంటారు. ఈ తరహా భయం సమకాలీన సమాజాల్లో మరింత తీవ్రంగా కన్పిస్తోంది. ఏ క్షణంలో నయినా, ఎక్కడయినా ఏదో ఒక ఉపద్రవం రావచ్చుననే ఆందోళన మనిషికి ఇవ్వాళ అనివార్యమయింది. ఈ ఉపద్రవం ఎటునుంచయినా రావచ్చు. మన పనిస్థలంనుంచో, పరిసరాలనుంచో రావచ్చు. ప్రకృతిపరంగా అది భూకంపంగానో, వరదలుగానో, తుఫానుగానో, వడగాడ్పుగానో, టెర్రరిస్ట్‌ దాడులుగానో, లైంగిక దాడిగానో, కలుషిత ఆహారంగానో, నీరుగానో, విషవాయువుగానో, అలాగే పవర్‌ గ్రిడ్స్‌ పగలటం, పెట్రోలు బావులు మండటం, స్టాక్‌మార్కెట్‌ పతనం కావటంగానో రావచ్చు. వీటి గురించి వచ్చే వార్తా కథనాలు, ఇంకా హంతక వైరస్‌లు, హంతక సముద్ర కెరటాలు, హంతక ఔషధాలు, హంతక మాంసం, హంతక ఐస్‌బర్గ్‌ల గురించి మనం వినే కథనాలు మరింత భయాన్ని పెంచుతాయి. ఇన్ని భయాల మధ్య సమకాలీన సమాజంలో వ్యక్తి జీవితం ఒక ఉపద్రవానికి మరొక ఉపద్రవానికి మధ్య కాలంలో కొనసాగే ఘటన (episode)గా మారిపోయింది.


ఆధునిక పూర్వ సమాజంలో ఈ భయాల నుంచి మనుషులకు ఊతంగావున్న విశ్వాసాలు లేక అధిభౌతిక నమ్మకాలు ఏదో ఒక స్థాయిలో కొంత ఉపశమనాన్నిచ్చేవి. నీషే చెప్పినట్టు దేవుడు మరణించాడు, సమాజం హేతుబద్ధమయింది. దేవుణ్ణి ప్రక్కకు నెట్టి హేతువే ప్రధానమయింది. అప్పటిదాకా దేవుడి ఆధీనంలో వున్నదని నమ్మబడిన ప్రకృతి మనిషి ఆధీనంలోకి వచ్చింది. మనిషి అస్తిత్వాన్ని భయకంపితం చేస్తున్న ప్రకృతికి కళ్ళాలు వేయాలని మనిషి భావించాడు. ఈ కళ్ళాలు వేసే పని సామాజిక శాస్త్రవేత్తలు చెప్పినట్టు సరిగ్గా 1755లో పోర్చుగల్‌ రాజధాని లిస్బన్‌లో వచ్చిన భూకంపం నేపథ్యంలో మొదలయింది. ఆ సంఘటన అప్పటికే మొదలయి కొనసాగుతున్న ప్రకృతి నియంత్రణకు సంబంధించిన వికాసయుగ ఆలోచనకు నిర్దిష్టతను చేకూరించి, మనిషి అస్తిత్వానికి ప్రమాదకారిగా పరిణమించిన ప్రకృతిని కట్టడి చేయాలని, దాని మీద ఆధిపత్యం చేయాలనే ఆలోచన ఒక పథకంగా రూపొందింది. దీన్నే ఆధునికత పథకం (project of modernity) అన్నారు. చరిత్రలో మొదటిసారిగా మనిషికి ప్రకృతి మధ్య విభజన రేఖ గీయబడింది. ప్రకృతి మనిషికి పరాయి (other) దయింది. వశపర్చుకోవాల్సింది, ఆధిపత్యం క్రిందకు తెచ్చుకోవాల్సిందయింది. ప్రముఖ ఆధునిక తాత్త్వికుడు Descarts ‘మనం ప్రకృతికి యజమానులం, అధిపతులం కావాలని’ స్పష్టంగా ప్రకటించాడు. ప్రకృతి మీద మనిషి ఆధిపత్యాన్ని నెలకొల్పటమే లక్ష్యమని ఆధునికత వికాసయుగ తాత్త్వికుల ద్వారా నొక్కి చెప్పింది. ప్రకృతిని నియంత్రించటం, కట్టడి చేయటం అనివార్యంగా భావించటం జరిగింది. ప్రకృతి object గా మనిషి subject గా భావించటం జరిగింది. శాస్త్ర సాంకేతిక అభివృద్ధి అనేది ఈ లక్ష్యం వైపుగానే సాగింది. మనిషి తన కోర్కెను సాధించుకునేందుకు ప్రకృతి పరికరమయింది. లక్ష్యాన్ని సాధించుకోవటమే కీలకాంశంగా భావించే instrumental rationality అనేది ముందుకు వచ్చి బలపడింది. ప్రకృతిని తన అవసరానికి ఉపయోగించుకోవాల్సిన పరికరంగా చూసే దృష్టి వేళ్ళూనుకుంది. ప్రకృతి పట్ల మనిషి ఉపయోగితవాద (utilitarian) దృష్టి ఏర్పడింది. వస్తువులు మనిషికి ఏ స్థాయివరకు ఉపయోగపడతాయో ఆస్థాయివరకే వాటికి విలువవుంటుంది. ఇదే దృష్టి ప్రకృతి పట్ల మనిషికి కూడా ఏర్పడింది. నియంతలు మనుషుల పట్ల చూపే వైఖరే వికాసయుగ ఆలోచన ప్రకృతిపట్ల చేసింది.


ప్రకృతి మనుషులకు వెలుపలి అంశంగా, మనిషి తన స్వాధీనంలోకి తెచ్చుకోవాల్సిన అంశంగా ఆధునికత చూసింది. ఫ్రాన్సిస్‌ బేకన్‌నుంచి దెకార్తె దాకా వున్న తాత్త్వికులందరూ ప్రకృతికి మనిషికి మధ్య వైరుధ్యాన్నే చూశారు. మనిషి కేంద్రక దృష్టినే (anthropocentrism) బలపర్చారు. భారతదేశంలో ఆధునికతకు సంబంధించిన దేశీయ లక్షణాలు అక్కడక్కడ కన్పించినప్పటికీ ఆచరణలో, భావజాలపరంగా ఐరోపా ఆధునికత ఇక్కడ కొనసాగింది. ఇప్పటికీ ఐరోపా ఆధునికతనుంచి సంతరించుకున్న తాత్త్వికత దేశీయ ఆధునికతను నడుపుతుంది. ఈ దృష్టి గత మూడువందల సంవత్సరాలు ప్రయాణించి మొత్తం మనుషులకు ఇతర జీవులకు హానికరంగా తయారయింది. ప్రకృతి మనిషికి, మనిషితోపాటు ఇతర జీవజాలాలకు ప్రాణాన్నిచ్చి దాన్ని నిలుపుకోవటానికి అవసరమైన వనరులు ఇచ్చింది. మిగతా జీవజాలం ప్రకృతి సూత్రం ప్రకారం నడుచుకుంటూ వున్నాయి. మనిషి మౌలికంగా ప్రకృతి నియమాల్ని అతిక్రమించి మిగతా జీవజాలానికి ప్రమాదగారిగా పరిణమించాడు. అదే సందర్భంలో తన మౌలిక అస్తిత్వానికే ముప్పుతెచ్చుకున్నాడు. 


తత్త్వశాస్త్రంలో మానవ కేంద్రకవాదం (anthropo centrism) అనే భావన ఒకటివుంది. ఇది ప్రకృతిలో మనిషి ఒక విశిష్ట జీవని, మిగతా జంతువులు, జీవులు మనిషికోసమే, మనిషి అవసరాలు తీర్చటం కోసమే వున్నాయని, అందువల్ల ఈ విశ్వంలో వాటిది ద్వితీయ స్థానమని ఈ వాదం వర్గీకరిస్తుంది. ఈ వాదాన్ని చరిత్రలో మానవ సమూహాలకు కూడా విస్తరించటం జరిగింది. కొన్ని సామాజిక బృందాలను, ముఖ్యంగా స్త్రీలు, నల్లజాతీయులు, వలసపాలన క్రింద వున్నవాళ్ళను ద్వితీయ శ్రేణికి చెందినవాళ్ళుగా ముద్రించటం జరిగింది. ఈ మానవ కేంద్రక దృష్టిని గత నాలుగయిదు దశాబ్దాలుగా తీవ్రవిమర్శకు గురిచేయటం జరుగుతోంది. నిజానికి అయిదు శతాబ్దాలకు పూర్వమే గెలిలియో లాంటి వాళ్ళు భూకేంద్రక ఆలోచనలను, మనిషి కేంద్ర దృష్టినుంచి మనుష్యుల్ని బయటపడవేసే ప్రయత్నం చేశారు. ఇప్పటికీ మనం ఆ విషయాన్ని పట్టించుకోవటంలేదు. పట్టించుకునివుంటే మనిషి జీవితం వేరుగా వుండి వుండేది. ఈ నిర్లక్ష్యాన్ని గోరటి వెంకన్న తన పాటలో ఇలా వ్యక్తీకరించాడు

‘‘వినకో పోతివి కదరా/ ఎరుక కలిగినా పదము

కొరివికొని తెచ్చుకుని వొణికితేమిఫలము?

యుగములు గడిచినా మారలేదు నీ గుణము

నా కెదురులేదని ఎగిసిపడే నినాదం

భరియింపక పుడమి శపించెను ఇది నిజం’’

మానవులు -మానవేతరులు అని మనిషి చేసిన విభజన అంతిమంగా మానవేతర జీవుల్ని పరాయి (other) గా చూసింది. మనిషి కర్త (subjet) మిగతా జీవులు కర్మ (object)గా చూడబడ్డాయి. సమాజంలో కొన్ని సమూహాల్ని నల్లజాతీయులు, యూదులు, స్త్రీలు అనే వర్గీకరణ చేసి వాళ్ళను ఏ విధంగా ఊచకోతకు, మారణహోమాలకు గురిచేయటం జరిగిందో, అంతకంటే తీవ్రంగా ఈ ఊచకోతలు ప్రకృతిలోని మనిషి సహచర జీవుల్ని ఊచకోత కోయటం జరుగుతూ వుంది. మిగతా జీవజాలం మీద మనిషి ఆధిపత్యం చలాయించటంలో కీలకపాత్ర వహిస్తుంది మనిషికి ఆలోచన సామర్థ్యం వుండటం. తను ఆలోచించగలడు, మిగతా జీవులకు ఆ శక్తి లేదనే భావం కూడా ఈ ఆధిపత్యధోరణికి ఊతమవుతోంది. మనిషి అస్తిత్వాన్ని ఆలోచనతో ముడిపెట్టడు. కాబట్టి దెకార్త్‌ లాంటివాళ్ళు ‘i think, therefore i am’ అనగలిగారు. దీనికి భాషే ఆధారం అని వేరుగా చెప్పనవసరంలేదు.


నిజానికి మనిషికి ఆలోచించే శక్తివుంటే, మిగతా జీవజాలానికి వాసన పసిగట్టగలిగే శక్తివుంది. అదే వాటి అస్తిత్వానికి ఊతం. వాటికున్న ఆ శక్తిని మనం గుర్తించం. ఆ విభిన్నతను అంగీకరించం. వాసన పసిగట్టగలగటం అనే ఈ సంవేదనను తాత్త్విక, కళారంగంలో ఎందుకు ద్వితీయ శ్రేణికి నెట్టివేయటం జరిగిందని ప్రముఖ ఫ్రెంచ్‌ తాత్వికుడు జాన్‌ డెరిడా తన రచన ‘the animal, therefore i am’లో ప్రశ్నిస్తాడు. అంతేకాకుండా జంతువులకు తామున్న సందర్భాలను, తమస్థితి తక్షణమే అవగాహన చేసుకుని స్పందించే లక్షణముంటుంది. ఈ సామర్థ్యం మనుషులకున్న దానికంటే ఎక్కువస్థాయిలో వుంటుంది. 2004 డిసెంబర్ 6న వచ్చిన సునామీలో మూడు లక్షలమంది చచ్చిపోయారు. జీవజాలాలు సునామీ బారిన పడకుండా తప్పించుకున్నాయి. ప్రమాదాన్ని ముందే పసిగట్టిన లేక అవగతం చేసుకున్న జీవజాలం ఎత్తుప్రాంతాలకు చేరుకుని తమని తాము రక్షించుకున్నాయి. ఈ విషయంలో అవి మనుషులకంటే లోతయిన అవగాహనను, మన సాంకేతిక పరికరాలకంటే మెరుగయిన విశ్లేషణను చేయగలిగాయని వొప్పుకోక తప్పదు. ఈ విషయం అలా వుంచితే మనుషులు తమ నైతిక ఆవరణనుంచి మిగతా జీవజాలాన్ని బహిష్కరించారు. వాటిపట్ల మనకు ఎటువంటి బాధ్యత లేదని భావించారు. ఇది ఒక రకమయిన బాధ్యతా రాహిత్య ప్రవర్తన. ఎటువంటి బాధ్యతా రాహిత్య ప్రవర్తనకయినా ఏదో ఒక రూపంలో పర్యవసానాలు అనివార్యం అని ఇప్పటికే చరిత్ర మనకు అనేకసార్లు రుజువుచేసింది. ప్రస్తుత పర్యవసాన రూపం covid -19. ఈ సందర్భంలో ఈ విపత్తును ఒక గుణపాఠంగా తీసుకోకపోతే మరింత దారుణాలను, ఉపద్రవాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు.

ప్రొఫెసర్ బి. తిరుపతిరావు 

ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం

Updated Date - 2020-07-15T05:49:43+05:30 IST