ఎగ్మూరు స్టేషన్‌కు కొత్త సొబగులు

ABN , First Publish Date - 2022-05-23T14:55:51+05:30 IST

చెన్నై, మే 22 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఎగ్మూరు రైల్వేస్టేషన్‌ వద్ద ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు రైల్వేశాఖ ఆ స్టేషన్‌లో కొత్తగా విస్తరణ చేపట్టేందుకు రూ.760 కోట్లమేర కేటాయించింది.

ఎగ్మూరు స్టేషన్‌కు కొత్త  సొబగులు

రూ.760 కోట్లతో ఆధునీకీకరణ 

చెన్నై, మే 22 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఎగ్మూరు రైల్వేస్టేషన్‌ వద్ద ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు రైల్వేశాఖ ఆ స్టేషన్‌లో కొత్తగా విస్తరణ చేపట్టేందుకు రూ.760 కోట్లమేర కేటాయించింది. ప్రస్తుతం ఆ స్టేషన్‌ ప్రాచీన భవనసముదాయం చెక్కుచెదరనీయకుండా కొత్త భవనసముదాయాలను నిర్మించనున్నారు. ఎగ్మూరు రైల్వేస్టేషన్‌ను రూ.17లక్షలతో 1908లో నిర్మించారు. తొలుత ఈ రైల్వేస్టేషన్‌లో మూడు ప్లాట్‌ఫామ్‌లు మాత్రమే ఉండేవి. ప్రస్తుతం 11 ఫ్లాట్‌ఫామ్‌ల్లో రైళ్ల రాకపోకలు జరుగుతున్నాయి. జూన్‌ 11న ఈ  రైల్వేస్టేషన్‌ 114వ వార్షికోత్సవాన్ని జరుపుకోనుంది. ఇంతటి విశేషాలు కలిగిన ఈ ప్రాచీన రైల్వేస్టేషన్‌ త్వరలో  నూతన సొబగులు సంతరించుకోనుంది. ప్రస్తుతం రూ.760 కోట్లతో విస్తరణ పనులు ప్రారంభమవుతున్నాయి. మూడు రోజుల క్రితం కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్‌ వైష్ణవ్‌ ఎగ్మూరు రైల్వేస్టేషన్‌ పరిశీలించి కొత్త ప్రాజెక్టు  కోసం చర్చించారు. ఆ స్టేషన్‌ వద్ద కొత్తగా నిర్మించనున్న నాలుగు  భవన నిర్మాణాలకు సంబంధించిన ప్లాన్లను కూడా ఆయన పరిశీలించి ఆ ప్రాంతాలను కూడా సందర్శించారు. వీలైనంత త్వరగా విస్తరణ పనులను చేపట్టమంటూ దక్షిణ రైల్వే ఉన్నతాధికారుల ఆయన ఆదేశించారు.

రెండు భారీ ప్రవేశద్వారాలు

కొత్త ప్రాజెక్టులో భాగంగా ఎగ్మూరు రైల్వేస్టేషన్‌ ప్రాచీన భవన సముదా యం సమీపంలో ప్రయాణికులు స్టేషన్‌లోపలకు వెళ్లేందుకు, బయటకు వచ్చేందుకు కొత్తగా రెండు ప్రవేశద్వారాలతో భవనాలను నిర్మించనున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలతో ఈ రెండు భవనసముదాయాలు నిర్మించనున్నట్లు దక్షిణ రైల్వే శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ఓ ప్రవేశద్వార భవనాలు గాంధీ-ఇర్విన్‌ రహదారి వద్ద  ఒకటి, మరొక భవనం పూందమల్లి హైరోడ్డు ప్రాంతంలో నిర్మించనున్న ట్లు వివరించారు. ఈ రెండు భవనాలు మూడంతస్థులుంటాయి. దిగువ అంతస్థులో టికెట్‌ కౌంటర్‌, వెయిటింగ్‌ రూమ్‌లు, మొదటి అంతస్థులో కార్యాలయం, వెయిటింగ్‌ రూమ్‌లు, రెండో అంతస్థులో వెయింటింగ్‌ రూమ్‌లు. దుకాణాలు, మూడో అంతస్థులో షాపింగ్‌మాల్స్‌, విశ్రాంతి గదులుంటాయని తెలిపారు. 

మల్టీలెవల్‌ పార్కింగ్‌తో 2 భవనాలు....

ఇదే విధంగా ప్రస్తుతం ఎగ్మూరు రైల్వేస్టేషన్‌లో ఏళ్ల తరబడి ఉన్న వాహనాల పార్కింగ్‌ స్థలం సమస్యను శాశ్వతంగా పరిష్కరించేలా రెండు భవనసముదాయాలను కూడా నిర్మించనున్నారు. మల్టీలెవల్‌ పార్కింగ్‌ సదుపాయాలతో ఈ రెండు భవనాలు ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలను అందించనున్నాయి. ఈ రెండు భవనాలు దిగువ అంతస్థుతోపాటు ఐదంతస్థులు కలిగి ఉంటాయి. గాంధీ-ఇర్విన్‌ రహదారి వద్ద నిర్మించనున్న భవసముదాయంలో దిగువ అంతస్థు, మొదటి అంతస్థులో షాపింగ్‌ మాల్స్‌ ఉంటాయి. రెండో అంతస్థు, మూడో అంతస్థులో 300 కార్లు, 120 ద్విచక్రవాహనాలకు పార్కింగ్‌ ఏర్పాటు చేస్తారు.  ఇక పూందమల్లి రహదారి వద్ద నిర్మించనున్న భవనసముదాయంలో దిగువ, మొదటి అంతస్థులను వాణిజ్య సముదాయాలు, దుకాణాల కోసం కేటాయించనున్నారు. మూడో అంతస్థు, నాలుగో అంతస్థులో 500 కార్లు, 200 ద్విచక్రవాహనాలు నిలిపేందుకు పార్కింగ్‌ సదుపాయాన్ని  కల్పించనున్నారు. ఐదో అంతస్థును కార్యాలయం కోసం కేటాయిస్తారు. ఈ భవనసముదాయాల్లో పోస్టాఫీసులు, పలు రకాల దుకాణాలు కూడా ఉంటాయని దక్షిణ రైల్వే అధికారులు తెలిపారు

Updated Date - 2022-05-23T14:55:51+05:30 IST