మన కాలం మొఘల్ సమ్రాట్!

ABN , First Publish Date - 2021-02-27T06:30:20+05:30 IST

జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ వలే భారతరత్న పురస్కారాన్ని నరేంద్ర మోదీ ఆశించకపోవచ్చు. మొఘల్ చక్రవర్తుల వలే అద్భుత వాస్తునిర్మాణాలతో దేశ రాజధానికి కొత్త రూపునివ్వడం ద్వారా చరిత్రలో...

మన కాలం మొఘల్ సమ్రాట్!

జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ వలే భారతరత్న పురస్కారాన్ని నరేంద్ర మోదీ ఆశించకపోవచ్చు. మొఘల్ చక్రవర్తుల వలే అద్భుత వాస్తునిర్మాణాలతో దేశ రాజధానికి కొత్త రూపునివ్వడం ద్వారా చరిత్రలో నిలిచిపోవాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు. ‘సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్’ మోదీ స్వప్నాలకు ఒక తార్కాణం.


ఒకప్పుడు నరేంద్ర అనే రాజు ఉండేవాడు. ఒక సంస్థానానికి ఆయన అధిపతి. హిందూమత పుణ్యక్షేత్రం ఒకటి ఆయన రాజ్యంలోనే ఉంది. రాజవంశాచారం ప్రకారం ఆయనే ఆ సుప్రసిద్ధ ఆలయానికి పోషకుడు. నరేంద్రుడు దైవస్వరూపుడని ప్రజలు భావించేవారు. అయితే తన పూర్వీకులు, భావి వారసుల కంటే తాను ఒక విశిష్టరీతిలో చరిత్రలో నిలిచిపోవాలని నరేంద్రుడు ఆకాంక్షించాడు. తన కోసం, తన ప్రజల కోసం ఒక కొత్త రాజధానిని నిర్మించాడు. దానికి నరేంద్రనగర్ అని పేరుపెట్టాడు. 


ఇదొక వాస్తవ గాథ. నేను ప్రస్తావించిన సంఘటనలు కేవలం వంద సంవత్సరాల క్రితం సంభవించాయి. రాజు నరేంద్ర షా తెహ్రీ గఢ్వాల్ సంస్థానాధిపతి. కొత్త రాజధాని నిర్మాణం 1919లో పూర్తయింది. గఢ్వాల్ పర్వత ప్రాంతాలలో పెరిగిన నేను నరేంద్రనగర్‌ను సందర్శించాను. అహ్మదాబాద్‌లోని ఒక క్రికెట్ స్టేడియానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరు పెట్టారని విన్నప్పుడు నాకు నరేంద్రషా గాథ జ్ఞప్తికి వచ్చింది. అహ్మదాబాద్‌ స్టేడియానికి మోదీ పేరిట పునః నామకరణం చేయాలని ఎవరు సూచించిఉంటారు. బహుశా, క్రికెట్‌లో ఆసక్తిఉన్న ఒక గుజరాతీ రాజకీయవేత్త కావచ్చు. 1930లలో అడాల్ఫ్‌ హిట్లర్‌ కూడా స్టట్‌గార్ట్‌లో ఒక ఫుట్‌బాల్‌ స్టేడియానికి తన పేరు పెట్టడాన్ని అనుమతించాడు, ప్రోత్సహించాడు.


రాజకీయవేత్తలందరూ తమ గురించి తాము గొప్పగా ఊహించుకుంటారు. అయితే ఒక ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యంలో వారు తప్పనిసరిగా ప్రజాస్వామ్య పద్ధతులను ఆచరించాలి. నిర్వహిస్తున్న పదవి కంటే తాము గొప్పవారమనే భావనకు వారు తావివవ్వకూడదు. ఒక రాచరిక పాలకుడు తన రాజ్యంతో తనను తాను సమానం చేసుకుంటాడు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రధానమంత్రిగానీ, దేశాధ్యక్షుడుగానీ ఎట్టి పరిస్థితులలోనూ తనను తాను దేశంతో సమానం చేసుకోకూడదు. ప్రపంచపు పురాతన ప్రజాస్వామిక రాజ్యాధిపతులు సైతం ఈ ఆవశ్యక పాఠాన్ని సరిగ్గా నేరుకున్నారని చెప్పలేము. 1960లలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఛార్లెస్ డీ గాల్ తనను తాను ఫ్రాన్స్‌తో సమానం చేసుకున్నారు. అమెరికాను ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నాయకుల వలే కాకుండా, చక్రవర్తుల మాదిరిగా పాలించిన శ్వేతసౌధాధిపతులను ‘ఇంపీరియల్ ప్రెసిడెంట్స్’ అని ఒక చరిత్రకారుడు అభివర్ణించాడు. 


మన గణతంత్ర రాజ్య చరిత్రలో గర్వాతిశయులైన ముగ్గురు ప్రధానమంత్రులు ఉన్నారు. వారు జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, నరేంద్ర మోదీ. నెహ్రూ, ఇందిరలు అధికారంలో ఉన్నప్పుడే అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారతరత్న’ను పొందారు. మోదీ వంతుకూడా రాబోతుందా? అహ్మదాబాద్‌లో సర్దార్ పటేల్ స్టేడియానికి నరేంద్ర మోదీ పేరిట పునఃనామకరణం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ ముఖ్యఅతిథిగా పాల్గొనడం విస్మయకరంగా ఉంది. 2022 లేదా 2023లో నరేంద్రమోదీకి భారతరత్న పురస్కారాన్ని ప్రదానం చేయడానికి ఇది నాందీ సూచకమా? 


అలా జరగదని నేను భావిస్తున్నాను. ఇందుకు రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి- మోదీ ఉద్దేశపూర్వకంగా తన పూర్వపు ప్రధానమంత్రుల కంటే భిన్నంగా వ్యవహరిస్తున్నారు. భారతరత్న విషయంలోనూ ఆయన అదే రీతిలో ఉండవచ్చు. రెండు- చరిత్ర నిర్మాతగా వెలుగొందే విషయంలో మోదీకి గొప్ప ఆకాంక్షలు ఉన్నాయి. ఆయన స్వప్నాలు విలక్షణమైనవి. నెహ్రూ, ఇందిర తమకు భారతరత్నను ప్రకటించడాన్ని అనుమతించారు. ఆనందంగా ఆ పురస్కారాన్ని అందుకున్నారు. అంతకంటే అద్భుతమైన గౌరవాన్ని పొందాలని మోదీ ఆశిస్తున్నారు. దేశ రాజధానికి ఒక కొత్త రూపునివ్వడం ద్వారా చరిత్రలో సుప్రతిష్టుడిగా భాసిల్లేందుకు ఆయన ఆరాటపడుతున్నారు. 2014 మేలో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత లోక్‌సభలో తొలిసారి ప్రసంగిస్తూ పన్నెండు వందల సంవత్సరాల బానిసత్వానికి చరమ గీతం పాడడం తన ధ్యేయమని ఉద్ఘాటించారు. ఆ సందర్భంలో ఒక యువ రచయిత నాతో మాట్లాడుతూ మోదీ ప్రసంగం ఆయన రాజకీయ, వ్యక్తిగత ఆకాంక్షలను వ్యక్తం చేసిందని వ్యాఖ్యానించారు.


హిందువులు శతాబ్దాలుగా విదేశీయుల పాలనలో ఉన్నారని మోదీ భావిస్తున్నారు. ఇప్పుడు వారి ఆత్మగౌరవాన్ని పునరుద్ధరించేందుకే తాను ప్రభవించానని ఆయన విశ్వసిస్తున్నారు. పన్నెండు శతాబ్దాల బానిసత్వాన్ని రూపుమాపుతానని ప్రకటించడంలో ఆయన ఉద్దేశం ఇదేనని నా యువమిత్రుడు వ్యాఖ్యానించాడు. దేశ ప్రజలందరినీ విజయవంతంగా సమైక్యం చేసిన ప్రప్రథమ హిందూ పాలకుడిని తానేనని మోదీ ఆ ప్రకటన ద్వారా సూచించారని నా మిత్రుడు పేర్కొన్నారు. శివాజీ, పృధ్వీరాజ్‌లు మహావీరులు అయినప్పటికీ ఈ సువిశాల దేశంలో వారి రాజ్యాలు చాలా చిన్నవి. ప్రాదేశికంగా గానీ, రాజకీయంగా గానీ బౌద్ధ అశోకుడు, ముస్లిం మొఘల్స్, క్రైస్తవ బ్రిటిషర్ల వలే దేశాన్ని సమైక్యపరచడంలో ఆ ఇరువురూ విఫలమయ్యారు. శివాజీ, పృధ్వీరాజ్‌లు సాధించలేకపోయిన మహత్కార్యాన్ని విజయవంతంగా నిర్వర్తించడం ద్వారా హిందువుల గొప్పదనాన్ని ప్రపంచానికి చాటడానికి నరేంద్ర మోదీ సంకల్పించారు. 


తమ ప్రాధాన్యాన్ని చాటేందుకు, తమ ఆధిక్యతను నిరూపించేందుకు, తమ సార్వభౌమత్వాన్ని చెలాయించేందుకు రాజులు, చక్రవర్తులు కొత్త రాజధాని నగరాలను నిర్మించడం పరిపాటి. గఢ్వాల్ పాలకుడు నరేంద్ర షా కొత్త రాజధాని నిర్మాణానికి పూనుకోవడానికి కొన్ని సంవత్సరాల ముందే ఆనాటి మన ‘భారత భాగ్య విధాత’ అయిన ఇంగ్లాండ్ రాజు ఐదవ జార్జి, బ్రిటిష్ ఇండియాకు కొత్త రాజధానిని నిర్మించనున్నట్టు ప్రకటించారు. పాత ఢిల్లీకి సమీపంలోని గ్రామాల నుంచి సమీకరించిన భూములలో కొత్త రాజధాని నిర్మాణానికి బ్రిటిష్ వలసపాలకులు పూనుకున్నారు. 


బ్రిటిష్ వలస పాలకులకు మూడు శతాబ్దాల పూర్వం షాజహాన్ చక్రవర్తి మొఘల్ సామ్రాజ్య రాజధానిని ఆగ్రా నుంచి ఢిల్లీకి మార్చాడు. తాను నిర్మించిన కొత్త రాజధానికి షాజహానాబాద్ అని పేరు పెట్టారు. షాజహాన్ చక్రవర్తి వలే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఆడంబరంగా, విశిష్టంగా కన్పించేందుకు ప్రాధాన్యమిస్తారు. మధ్యయుగాల చక్రవర్తికి అందుబాటులో లేని నవీన సాంకేతికతలు ఎన్నో మోదీకి అందుబాటులో ఉన్నాయి. రేడియో, టెలివిజన్, వార్తాపత్రికలు, వెబ్‌సైట్స్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ మొదలైన వాటితో ప్రజలను నాటకీయంగా ప్రభావితం చేయడంలో నరేంద్ర మోదీ సిద్ధహస్తులు. ఆ విధంగా ఆయన అసంఖ్యాక భారతీయులకు చేరువయ్యారు.


ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ ప్రవర్తించే తీరు దర్పంతో కూడుకుని ఉంటుంది. రాజకీయ సహచరులు, ప్రత్యర్థులతో వ్యవహరించే తీరులోనూ, బహిరంగసభల్లో ఆయన కన్పించే తీరులోనూ ఆ దర్పం స్పష్టంగా గోచరమవుతుంది. పార్లమెంటులో చర్చల్లో పాల్గొనడంలో విముఖత ప్రదర్శించడంలో కూడా ఆయన గర్వాతిశయమే వ్యక్తమవుతుంది. ఆయన ‘మన్ కి బాత్’ ప్రసంగాన్ని మొఘల్ చక్రవర్తి ఫర్మానాతో పోల్చవచ్చు. మొఘల్ చక్రవర్తుల వలే నరేంద్రమోదీ కూడా అద్భుత వాస్తునిర్మాణాలతో దేశ రాజధానికి కొత్త రూపునివ్వడం ద్వారా చరిత్రలో నిలిచిపోవాలని ఆకాంక్షిస్తున్నారు. మొఘల్ చక్రవర్తుల, బ్రిటిష్ వలసపాలకుల పాలనను మోదీ తరచు విమర్శిస్తుంటారు. అయితే వారిని అనుకరించడం ద్వారానే చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయేందుకు ఆయన ప్రయ త్నిస్తున్నారు. మూడు శతాబ్దాల అనంతరం హిందూత్వ రాష్ట్ర భావిపౌరులు తాను కొత్త రూపునిచ్చిన న్యూఢిల్లీని చూసి గర్విస్తారని ఆయన భావిస్తున్నారు. అయితే ఆయన ఆశ నెరవేరే అవకాశం లేదు.


రాచరిక దురహంకారంతో ఆయన నిర్మించనున్న నూతన రాజభవనాలు లాల్ ఖిల్లా, జమా మస్జీద్, నార్త్ బ్లాక్, సౌత్‌ బ్లాక్‌లకు సాటివచ్చేది ఒక్కటీ ఉండకపోవచ్చు. న్యూఢిల్లీకి కొత్తరూపునిచ్చే ప్రాజెక్ట్‌కు ‘సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్’ అని పేరు పెట్టారు. కొత్త పార్లమెంటు, కేంద్రప్రభుత్వ సచివాలయ భవనాల సముదాయం నిర్మాణం పూర్తయిన తరువాత దేశ రాజధానితో వలస పాలనానుబంధం స్థానంలో ఆత్మనిర్భర్ చోటు చేసుకోవడం ఖాయం. ఇప్పటికే ఒక శతాబ్దం కింద నిర్మించిన ఒక ‘నరేంద్రనగర్ ’ ఉంది. బహుశా ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో కొత్తగా రూపుదిద్దుకోనున్న న్యూఢిల్లీని ఏమని పిలుస్తారు? బహుశా ‘నరేంద్ర మహానగర్’ అంటారా? లేక ‘మోదీయబాద్’ అని నామకరణం చేస్తారా?




రామచంద్ర గుహ

(వ్యాసకర్త చరిత్రకారుడు)

Updated Date - 2021-02-27T06:30:20+05:30 IST