మోడల్‌ గ్రంథాలయం

ABN , First Publish Date - 2022-06-21T05:57:50+05:30 IST

మోడల్‌ గ్రంథాలయం

మోడల్‌ గ్రంథాలయం
మహబూబాబాద్‌ జిల్లా గ్రంథాలయంలో వివిధ ఉద్యోగ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు, యువకులు

అన్ని హంగులతో జిల్లా గ్రంథాలయ భవనం నిర్మాణం

రూ.3 కోట్లతో సర్వాంగ సుందరంగా ముస్తాబు

రూ.25లక్షల విలువైన పుస్తకాలు.. 

ఇప్పటికే కాంపిటేటివ్‌ విద్యార్థులతో కిట..కిట

మంత్రి కేటీఆర్‌ రాక కోసం ఎదురుచూపులు 


మహబూబాబాద్‌, జూన్‌  20(ఆంధ్రజ్యోతి) :  జిల్లా కేంద్రంలో రూ.3 కోట్ల అంచనాలతో నిర్మాణమైన జిల్లా గ్రంథాలయ భవనం అన్ని హంగులతో ప్రారంభానికి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం మహబూబాబాద్‌కు కలిసివచ్చిన అదృష్టంగా జిల్లా గ్రంథాలయంగా అప్‌గ్రేడ్‌ అయినా క్రమంలో ఈ భవనాన్ని పాఠకులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. మునిసిపల్‌, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు రెండుమార్లు మహబూబాబాద్‌ పర్యటన ఖరారైన సందర్భంలో ఈ గ్రంథాలయ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేశారు. వివిధ కారణాలతో తాత్కాలికంగా ప్రారంభోత్సవం వాయిదా పడినప్పటికి ఉద్యోగ ఖాళీల భర్తీల నోటిఫికేషన్‌ విడుదలతో నిరుద్యోగులు గ్రంథాలయానికి పోటెత్తుతున్నారు. నిత్యం కిట..కిటలాడుతుండడంతో పాతభవనం పాఠకులకు అనుకూలంగా లేకపోవడంతో కొత్త భవనంలో తాత్కాలికంగా కాంపిటేటివ్‌ విద్యార్థులకు అనుమతి కల్పించారు. 


అక్షర రూపం దాల్చిన...

అక్షర రూపం దాల్చిన ఒక సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక.. ఆ కదలిక సాధనమే గ్రంథాలయం. జాతీయోద్యమకాలంలో అభ్యుదయవాదులకు ఒక్కడుగు ముందుకు వేయడానికి ఆసరాగా నిలిచి వెలుగు దీపం గ్రంథాలయోధ్యమం. పుస్తక పఠనం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఆ రోజుల్లోనే గ్రంథాలయాల స్థాపన జరిగింది. ఆ నాటి కాలంలోనే మానుకోటలో స్వాతంత్రోద్యమ నేత బాపూజీ పేరిట పాత బజారులో ఓ చిన్న అద్దె గదిలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. నాటి నుంచి నేటి వరకు సదరు గ్రంథాలయంలో పుస్తక పఠనం చేసిన అనేక మంది వివిధ రంగాల్లో ఉన్నతస్థాయికి ఎదిగారు. ఈ గ్రంథాలయం ఎంతో మందికి మేథోసంపత్తిని పెంపొందించడమే కాకుండా సమాజానికి మార్గదర్శకులు, భావిభారత పౌరులుగా తీర్చిదిద్దుతూ అందరికి ఆదర్శనీయంగా నిలుస్తోంది మానుకోట గ్రంథాలయం.


1939లో బాపూజీ పేరిట...

దేశ స్వాతంత్ర ఉద్యమ కాలంలో 1939లో పట్టణానికి చెందిన చౌడవరపు పురుషోత్తం, బీఎన్‌ గుప్తాలు కలిసి మహబూబాబాద్‌ పాత బజారులో ఓ చిన్న అద్దె గదిలో బాపూజీ పేరిట గ్రంథాలయాన్ని ఆరంభించారు. ఆ తర్వాత 1964లో ఆది ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చి మహబూబాబాద్‌ శాఖ గ్రంథాలయంగా మారింది. అనంతరం 30 సంవత్సరాల పాటు అద్దె భవనంలో కొనసాగింది. ప్రస్తుత అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు, నాటి ఏఐఎ్‌సఎఫ్‌ నేత బి.అజయ్‌ నేతృత్వంలో సొంత స్థలం కోసం పోరాటాలు నిర్వహించారు. అప్పుడు గ్రామపంచాయతీకి సంబంధించిన కూరగాయల మార్కెట్‌ సమీపంలోని స్థలాన్ని సాధించుకోగలిగారు. తొలుత ఒక గది మాత్రమే ఉండేది. 2001-02లో సీపీఐ రాజ్యసభ సభ్యుడు దాసరి నాగభూషన్‌రావు రూ.2లక్షలు కేటాయింపుతో రీడింగ్‌ రూంను నిర్మించారు. అప్పటి కలెక్టర్‌ శివశంకర్‌ కేటాయించిన రూ.లక్ష నిధులతో ప్రహారిని ఏర్పాటు చేశారు. స్వరాష్ట్ర ఏర్పాటు అనంతరం మహబూబాబాద్‌ జిల్లాగా ఆవిర్భవించడంతో శాఖ గ్రంథాలయానికి జిల్లా గ్రంథాలయంగా అప్‌గ్రేడ్‌ అయింది. దీనికనుగుణంగా పాలకమండలి ఏర్పాటు చేశారు. 


చైర్మన్‌ గుడిపుడి చొరవతో...

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా నియామకమైన గుడిపుడి నవీన్‌రావు ప్రత్యేక శ్రద్ధ, చొరవ చూపి ప్రభుత్వం ద్వారా  గ్రంథాలయ భవన నిర్మాణానికి రూ.2.80 కోట్లు మంజూరు చేయించారు. అందులో నుంచి రూ.2.40 కోట్లతో జీప్లస్‌2 భవన నిర్మాణాలు పూర్తయ్యాయి. రూ.40 లక్షలతో పాఠకులు చదువుకునేందుకు వీలుగా ఫర్నిచర్‌ను సమకూర్చుకున్నారు. మహబూబాబాద్‌ తొలి ద్విసభ్య శాసనసభ్యుల్లో ఒకరైన తీగల సత్యనారాయణ కుటుంబసభ్యులుగా విదేశాల్లో ఉన్న ఎన్నారైలు రూ.6లక్షలతో ఈ గ్రంథాలయానికి కంప్యూటర్లు సమకూర్చారు. నూతనంగా నిర్మాణమై ఉన్న ఈ భవనంలో గ్రౌండ్‌ ఫ్లోర్‌లో షాపింగ్‌ కాంప్లెక్స్‌, పార్కింగ్‌, వాచ్‌మన్‌ విడిదికి కేటాయించారు. మొదటి అంతస్తులో ఆఫీ్‌స రూం, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌, సెక్రటరీ చాంబర్‌తో పాటు దిన పత్రికల పఠనం, వార, మాసపత్రికల పఠనానికి అనుగుణంగా గదులను కేటాయించారు. రెండో అంతస్తులో పోటీ పరీక్షల కోసం సంసిద్ధులయ్యే యువకులకు కావాల్సిన పుస్తకాలు అందుబాటులో ఉంచడంతో పాటు చదువుకునేందుకు కూడా సీటింగ్‌ అరెంజ్‌ చేశారు. ఇంటర్నేట్‌ సెక్షన్‌ రూం కూడా ఇదే అంతస్తులో కేటాయించారు. 


రూ.25 లక్షల విలువైన పుస్తకాలు.. 

మహబూబాబాద్‌ శాఖా గ్రంథాలయంలో దాతల సహాకారంతో సుమారు రూ.25 లక్షల విలువైన 27వేల పుస్తకాల సాహిత్యాన్ని సమకూర్చుకున్నారు. పర్మనెంట్‌ రీడర్స్‌గా 11,211 మంది సభ్యులు ఉన్నారు. ఒకేసారి ఈ గ్రంథాలయంలో 400 మంది సభ్యులు చదువుకునే అవకాశం లభించింది. ప్రతిరోజు 400 నుంచి 500 మంది పాఠకులు గ్రంథాలయంలో వివిధ దినపత్రికలు, పుస్తకాలను చదువుతున్నారు. ఇలా గ్రంథాలయంలో వివిధ పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలతో పాటు డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్‌ పుస్తకాలు, సాహిత్యానికి సంబంధించిన ఎన్నో పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అనేక మంది నిరుపేద విద్యార్థులు ఈ గ్రంథాలయంలో పుస్తక పఠన చేసి ఉన్నతస్థాయికి ఎదుగుతున్నారు. ఇప్పటికి ప్రతిరోజు విద్యార్థులతో పాటు కవులతో నిత్యం గ్రంథాలయంలో పుస్తక పఠనం కొనసాగుతోంది. కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో ప్రప్రథమంగా అన్ని హంగులతో నిర్మించిన మహబూబాబాద్‌ జిల్లా గ్రంథాలయ భవనం రాష్ట్రంలోనే రోల్‌మోడల్‌గా నిలుస్తుందనడంలో అతిశయోక్తి లేదు.


త్వరలో మంత్రి కేటీఆర్‌తో ప్రారంభోత్సవం : గుడిపుడి నవీన్‌రావు,  జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌, మహబూబాబాద్‌

మహబూబాబాద్‌ పట్టణంలో అన్ని హంగులతో నిర్మించిన జిల్లా గ్రంథాలయ భవనాన్ని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తో ప్రారంభించనున్నాం. జిల్లాల ఏర్పాటు తర్వాత జిల్లా గ్రంథాలయ సంస్థ పాలకమండలి ఏర్పడ్డాక నూతన భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ జిల్లాలోని ఎంపీ, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల సహాకారంతో జిల్లా గ్రంథాలయ భవనాన్ని తెలంగాణలోనే రోల్‌మోడల్‌గా నిర్మించాం. పాఠకులు, వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారి కోసం అనుకూలంగా అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు ఫర్నిచర్‌ కూడా ఏర్పాటు చేశాం. 



Updated Date - 2022-06-21T05:57:50+05:30 IST