కూనూర్ (తమిళనాడు): తమిళనాడు రాష్ట్రంలోని కూనూర్ సమీపంలో కూలిపోతున్న హెలికాప్టర్‌ను వీడియో తీసిన వ్యక్తి మొబైల్ ఫోన్‌ను ఫోరెన్సిక్ పరీక్షకు పంపినట్లు పోలీసులు తెలిపారు.కూనూర్ వద్ద ఆర్మీ హెలికాప్టర్ కూలిపోయిన ఘటనలో 13మంది మరణించిన విషయం విదితమే. కోయంబత్తూర్ నగరానికి చెందిన జో అనే వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్ డిసెంబర్ 8వతేదీన తన స్నేహితుడు నాజర్, అతని కుటుంబ సభ్యులతో కలిసి కొండ ప్రాంతాలైన నీలగిరి జిల్లాలోని కట్టేరి ప్రాంత పర్యటనకు వచ్చారు.హెలికాప్టర్ కూలిపోతుండగా ఫొటోగ్రాఫర్ జో కుతూహలంతో వీడియో తీశారు. జో తన మొబైల్ ఫోన్లో హెలికాప్టర్ క్రాష్ కావడానికి కొద్ది క్షణాల ముందు వీడియో తీసినట్లు స్పష్టంగా ఉంది.
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో నీలగిరి పోలీసులకు చేరింది. దీంతో దర్యాప్తులో భాగంగా నీలగిరి పోలీసులు ఈ వీడియోను ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపించారు. దట్టమైన అడవిలో రైలు పట్టాలపై వెళుతూ వీడియో తీస్తున్న సమయంలో ఆకాశంలో తక్కువ ఎత్తులో వెళుతున్న హెలికాప్టరును చూసి చత్రీకరించారు. అనంతరం దట్టమైన పొగమంచులో హెలికాప్టర్ కనిపించకుండా పోవడం, వారికి పెద్ద శబ్ధం వినిపించడం వీడియోలో ఉంది.సంఘటన స్థలానికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో తాము సమీపంలోని స్నేహితుడి ఇంటికి వెళ్లామని జో చెప్పారు.
ఈ వీడియోను ముందుగా కలెక్టరుకు అప్పగించాలని వెళ్లగా అక్కడ ఎవరూ లేకపోవడంతో తాము కూనూర్ పోలీసులకు వీడియో ఫుటేజ్ అందజేశామని జో చెప్పారు. వన్యప్రాణుల సంచారం కారణంగా నిషేధిత ప్రాంతం అయిన దట్టమైన కూనూర్ అటవీ ప్రాంతానికి ఫోటోగ్రాఫర్, అతనితో పాటు మరికొంత మంది ఎందుకు వెళ్లారనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు.