మొబైల్‌ ‘హ్యాండ్‌వాష్‌’!

ABN , First Publish Date - 2020-04-09T05:30:00+05:30 IST

కరోనా వ్యాప్తి చెందకుండా గ్రామాలన్నీ ఎక్కడికక్కడ స్వీయ నియంత్రణను అనుసరిస్తున్నాయి. సామాజిక దూరాన్ని పాటించడంతో పాటు, పరిసరాల శుభ్రత, వ్యక్తిగత శుభ్రతకు కూడా ప్రజలు పెద్ద పీట...

మొబైల్‌ ‘హ్యాండ్‌వాష్‌’!

  • కరోనా విజృంభిస్తున్న ఈ విపత్కర సమయంలో.... కేరళలోని కంజీరప్పల్లిలో ప్రస్తుతం అందరి నోటా చేపలు అమ్ముకునే నజీబ్‌ పేరే వినిపిస్తోంది. ఇంతకీ ఆయన ఏం చేస్తున్నారు? పట్టణవాసులు ఆయనను ఎందుకు గౌరవిస్తున్నారు?


కరోనా వ్యాప్తి చెందకుండా గ్రామాలన్నీ ఎక్కడికక్కడ స్వీయ నియంత్రణను అనుసరిస్తున్నాయి. సామాజిక దూరాన్ని పాటించడంతో పాటు, పరిసరాల శుభ్రత, వ్యక్తిగత శుభ్రతకు కూడా ప్రజలు పెద్ద పీట వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేరళలోని కంజీరప్పల్లి పట్టణానికి చెందిన నజీబ్‌ కరోనా వ్యాప్తి చెందకుండా తనవంతు కృషి చేస్తున్నారు. గతంలో బస్సు డ్రైవర్‌గా పనిచేసిన నజీబ్‌ కొంతకాలం క్రితం తన సోదరుడు మంచాన పడటంతో ఆయన చేస్తున్న చేపల వ్యాపారం చూసేవారు. ఏ పనిచేసినా సమాజసేవకు మాత్రం దూరం కాలేదు. ఊరిలో మంచినీటి సమస్య ఏర్పడినా, వృద్ధులకు వైద్యసాయం కావాలన్నా, అభాగ్యులకు భోజనం పెట్టాలన్నా ముందుండేవారు. తన సంపాదనలోనే కొంతమేరకు సమాజాసేవ కోసం వినియోగించేవారు.

కేరళలో ‘కొవిడ్‌ 19’ బాధితుల సంఖ్య పెరుగుతోందని తెలియగానే నజీబ్‌ వెంటనే రంగంలోకి దిగారు. ‘‘నేను నావంతు సాయం చేయాలనే విషయాన్ని వెంటనే గ్రహించాను. కరోనా విస్తరించకుండా ఉండాలంటే ప్రాథమిక దశలో చేతులను శుభ్రం చేసుకోవాలనే వార్త వినగానే నా బుర్రలో ఒక ఆలోచన మెరిసింది’’ అన్నారాయన. ఆ ఆలోచనకు వెంటనే కార్యరూపం ఇచ్చారు నజీబ్‌. ఆటోలో ఒక వాటర్‌ ట్యాంకును ఏర్పాటు చేసి, దాని వెనక భాగంలో చేతులు శుభ్రంగా కడుక్కునేందుకు వీలుగా నీటి పంపులను అమర్చారు. దానితోపాటే అందరికీ అందుబాటులో ఉండేలా లిక్విడ్‌ హ్యాండ్‌ వాష్‌ సోప్‌ను ఉంచారు. దీనితోపాటే పరిసరాల పరిశుభ్రతపై కూడా దృష్టిసారించారు. ఒకవైపు ప్రజలకు హ్యాండ్‌వా్‌షను అందుబాటులో ఉంచుతూనే, మరోవైపు రోడ్డుపై వెళ్తున్న వాహనాలపై సొంతంగా తయారుచేసిన రసాయనాలను స్ర్పే చేయడం మొదలెట్టారు. ‘‘ఆరోగ్యశాఖ అధికారులను కలిసి వైరస్‌ వ్యాప్తిచెందకుండా ఉండే స్ర్పే గురించి తెలుసుకున్నా. బ్లీచింగ్‌ పౌడర్‌, యాంటీసెప్టిక్‌ లోషన్‌, లెమన్‌గ్రా్‌స ఆయిల్‌ కలిపి ద్రావకాన్ని తయారుచేశా. నా మిత్రులనే వలంటీర్లుగా తయారుచేసి, రోడ్డు మీద వెళ్తున్న వాహనాలపై, దుకాణాలు, బస్టాండ్‌ సముదాయాల వద్ద స్ర్పే చేశాం’’ అని వివరించారు.


అవగాహన కార్యక్రమాలు...

కొవిడ్‌ విస్తరిస్తున్న ఈ సమయంలో అవగాహనను మించిన ఆయుధం లేదంటారు నజీబ్‌. అందుకే ఆయన కరోనా గురించిన సమాచారంతో కరపత్రాలు వేసి పంచుతూ, నిపుణులతో అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. నజీబ్‌ చేస్తున్న సేవా కార్యక్రమాల్లో ఆయన భార్య బీనా, ఇద్దరు పిల్లల మద్దతు ఎంతో ఉంది. నజీబ్‌ ఇదంతా చేయడం వెనుక ఒక కారణం ఉంది. ‘‘ఏడాది క్రితం...  యాక్సిడెంట్‌కు గురయ్యాను. డాక్టర్లు నేను బతకనని చెప్పారు. కానీ ఎనిమిది నెలల చికిత్స అనంతరం నేను కోలుకున్నా. దేవుడు నాకు బతకడానికి మరో ఛాన్స్‌ ఇచ్చినప్పుడు, నేను కూడా సమాజానికి సేవ చేయాలి కదా అనుకున్నా. అప్పటి నుంచి నాకు సాధ్యమైన మేరకు సేవ చేస్తున్నా’’ అన్నారాయన. 


నజీబ్‌ సేవాగుణం చూసి చాలామంది దాతలు ధనసాయం చేసేందుకు ముందుకు వచ్చినప్పటికీ ఆయన తిరస్కరించారు. తను సంపాదించిన దాన్లో నుంచే కొంత సమాజసేవ కోసం వెచ్చిస్తున్నారు. ‘‘ఈ చిన్న పట్టణంలో నా పరిమితులు నాకు తెలుసు. కరోనా వైరస్‌ విస్తరించకుండా నాకు తోచింది నేను చేస్తున్నా. అయితే అది మరింత మందికి సోకకూడదనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అంటున్న నజీబ్‌ సేవ చిన్నదే అయినా అందరి ప్రశంసలు అందుకుంటోంది.


ఈ ఆటోతో  పట్టణమంతా తిరిగి చేతులు శుభ్రంగా కడుక్కోవడం వల్ల కరోనా దరిచేరదని అవగాహన కల్పించా. పరిస్థితిని అర్థం చేసుకున్న ప్రజలంతా చేతులు శుభ్రంగా కడుక్కోవడం మొదలెట్టారు.

Updated Date - 2020-04-09T05:30:00+05:30 IST