మొబైల్‌ రైతు బజార్లు ప్రారంభం

ABN , First Publish Date - 2020-03-29T09:34:47+05:30 IST

జిల్లాలోని ప్రతి ప్రాంతంలో కూరగాయలు అందుబాటులో ఉండే విధంగా జేసీ మాధవీ లత సూచన మేరకు మార్కెటింగ్‌ శాఖ చర్యలు తీసుకుంది.

మొబైల్‌ రైతు బజార్లు ప్రారంభం

విజయవాడ అర్బన్‌, మార్చి 28: జిల్లాలోని ప్రతి ప్రాంతంలో కూరగాయలు అందుబాటులో ఉండే విధంగా జేసీ మాధవీ లత సూచన మేరకు మార్కెటింగ్‌ శాఖ చర్యలు తీసుకుంది. ఇప్పటికే జిల్లా, రూరల్‌ ప్రాంతాల్లో మొబైల్‌ రైతుబజార్లు తిరుగుతున్నాయి. శనివారం నుంచి నగరంలో ఈ మొబైల్‌ రైతు బజార్లు ప్రారంభమయ్యాయి. లాక్‌డౌన్‌ ప్రారంభించిన తరువాత ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నగరంలోని 28 ప్రాంతాల్లో రైతు బజార్లు ఏర్పాటు చేశారు. ఈ రైతు బజార్లకు కూడా కొంచెం దూరంగా ఉండే ప్రజల చెంతకు మొబైల్‌ రైతు బజార్లు తీసుకెళుతున్నారు. ఆదివారం మరికొన్ని కొత్త సెంటర్లకు ఈ మొబైల్‌ రైతు బజార్లు రానున్నాయి.


సామాజిక దూరం పాటించాలి..

ఉయ్యూరు, మార్చి 28: కరోనా వైరస్‌ నివారణ చర్యల్లో భాగంగా రైతుబజారులో వినియోగదారుల రద్దీ తగ్గించేందుకు మొబైల్‌ రైతు బజార్లను ఏర్పాటు చేసినట్లు ఏఎంసీ చైర్మన్‌ కొలుసు విజయలక్ష్మి తెలిపారు. కాటూరు, గండిగుంట, పమిడిముక్కల మండలం మంటాడ, వీరంకిలాకు వద్ద శనివారం నుంచి మొబైల్‌ రైతు బజార్లు ఏర్పా టు చేశారు. కాటూరులో మొబైల్‌ రైతుబజార్‌ను ఆమె పరిశీలించి సామాజిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. కొలుసు పోతురాజు, రైతుబజార్‌ ఎస్టేట్‌ ఆఫీసర్‌ శ్రీనివాసరావు పర్యవేక్షించారు


వీరంకిలాకులో ...

పమిడిముక్కల, పామర్రు : వీరంకిలాకు సెంటర్‌లో మొబైల్‌ రైతు బజారు ఏర్పాటు చేశారు. ఎస్సై సత్యనారాయణ, సిబ్బందితో వినియోగదారులు సామాజిక దూరం ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఆదివారం నుంచి పామర్రు మండలంలో మొబైల్‌ వాహనాల ద్వారా కూరగాయల అమ్మకాలు జరిగే ఏర్పాట్లను చేస్తున్నట్టు  రైతుబజారు అధికారి ఎం.వి.మూర్తి తెలిపారు.

Updated Date - 2020-03-29T09:34:47+05:30 IST