ప్రాణాలు తీసిన అతివేగం

ABN , First Publish Date - 2022-01-17T16:28:45+05:30 IST

విధులకు హాజరయ్యేందుకు వెళ్తున్న ఓ ప్రభుత్వ ఆస్పత్రి స్టాఫ్‌ నర్సు రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ముషీరాబాద్‌ గాంధీనగర్‌కు చెందిన

ప్రాణాలు తీసిన అతివేగం

రాపిడో బైక్‌పైనుంచి పడి ఎంఎన్‌జే స్టాఫ్‌ నర్సు 

జగద్గిరిగుట్టలో యువకుడు..


అతివేగం ఇద్దరి ప్రాణాలను తీసింది. మరో ముగ్గురిని ఆస్పత్రి పాలు జేసింది. సంక్రాంతి పండగ నేపథ్యంలో నగరంలో రోడ్లు ఖాళీగా దర్శనమిస్తుండడంతో బైకర్లు అతివేగంగా నడుపుతూ అదుపుతప్పి డివైడర్లను ఢీ కొనడంతో ఈ ఘటనలు జరిగాయి. 


హైదరాబాద్ /ఖైరతాబాద్‌: విధులకు హాజరయ్యేందుకు వెళ్తున్న ఓ ప్రభుత్వ ఆస్పత్రి స్టాఫ్‌ నర్సు రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ముషీరాబాద్‌ గాంధీనగర్‌కు చెందిన వీరకుమారి(40) రెడ్‌హిల్స్‌ ఎంఎన్‌జే కేన్సర్‌ ఆస్పత్రిలో స్టాఫ్‌ నర్సు. శనివారం ఉదయం ఆమె డ్యూటీకి వెళ్లేందుకు కుటుంబసభ్యులు రాపిడో బైక్‌ బుక్‌ చేశారు. ట్రాఫిక్‌ లేకపోవడం, రోడ్డు ఖాళీగా ఉండడంతో డ్రైవర్‌ బైక్‌ను వేగంగా నడుపుతూ వెళ్లాడు. టెలిఫోన్‌ భవన్‌ ఎదురుగా ఓ ద్విచక్ర వాహనం, కారును ఓవర్‌టేక్‌ చేయబోయి అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టాడు. ఈక్రమంలో బైక్‌ వెనక సీటులో కూర్చున్న వీరకుమారి హెల్మెట్‌ విడిపోయి తల డివైడర్‌కు బలంగా ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరినీ 108లో స్థానిక ఆస్పత్రికి తరలించగా వీరకుమారి చనిపోయినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. బైక్‌ డ్రైవర్‌ ఎడమకాలు, దంతాలు విరిగిపోయాయని ఎస్‌ఐ నిరంజన్‌ తెలిపారు. మృతురాలి సోదరుడు రాఘవ ఫిర్యాదు మేరకు పోలీసులుకేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు.


మరో ఘటనలో యువకుడు..

జగద్గిరిగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వేగంగా వెళుతున్న ఓ బైక్‌ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటనలో ఓ యువకుడు మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గాజులరామారానికి చెందిన రాచకొండ సత్యనారాయణ కుమారుడు ప్రవీణ్‌ (21) సంక్రాంతి రాత్రి తన స్నేహితులు సాయికిరణ్‌, శ్రీకాంత్‌లతో కలిసి బైక్‌పై గాజులరామారం నుంచి నెహ్రూనగర్‌ వైపు వేగంగా వస్తున్నారు. వీరిబైక్‌ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ప్రవీణ్‌ మృతి చెందాడు. ఇద్దరు యువకులు గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-01-17T16:28:45+05:30 IST