హైదరాబాద్ : వారంలో ఎంఎంటీఎస్‌ రైళ్లు

ABN , First Publish Date - 2021-06-21T14:04:24+05:30 IST

ఎంఎంటీఎస్‌ సేవలు వచ్చే వారంలో పునఃప్రారంభించనున్నట్లు...

హైదరాబాద్ : వారంలో ఎంఎంటీఎస్‌ రైళ్లు

  • కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రకటన
  • రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ఎత్తివేతతో రైల్వేశాఖ నిర్ణయం

హైదరాబాద్‌ సిటీ : ఎంఎంటీఎస్‌ సేవలు వచ్చే వారంలో పునఃప్రారంభించనున్నట్లు కిషన్‌రెడ్డి తెలిపారు. తన విజ్ణప్తి మేరకు ఈ సేవలను పునఃప్రారంభించడానికి అంగీకరించిన కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్‌గోయల్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు నగర రవాణాలో అత్యంత కీలకమైన మల్టీ మోడల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టమ్‌ (ఎంఎంటీఎస్‌) రైళ్లను మరో వారంలో పట్టాలెక్కించనున్నట్లు అధికార వర్గాలు కూడా తెలిపాయి. కరోనా కారణంగా దాదాపు ఏడాదిన్నర కాలంగా షెడ్లకే పరిమితమైన లోకల్‌ ట్రైన్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. అతి తక్కువ ధరతో రోజూ గమ్యస్థానాలకు చేర్చే ఈ రైళ్ల రాక కోసం ఎంతో మంది ఎదురుచూస్తున్నారు. కార్యాలయాలకు, పనులపై వివిధ ప్రాంతాలకు ఇన్నాళ్లూ ఆటోలు, ప్రైవేట్‌ వాహనాల్లో అధిక చార్జీలు వెచ్చించి తిరిగిన తాము ఇక తక్కువ చార్జీలతో ప్రయాణించే అవకాశం మళ్లీ వచ్చిందని ఉద్యోగులు, ఇతర వర్గాల పౌరులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 2020 మార్చి 16 నుంచి ఎంఎంటీఎస్‌, సాధారణ రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సడలింపుల అనంతరం కొవిడ్‌ ఆంక్షలకు లోబడి సాధారణ రైళ్లు నడుస్తున్నప్పటికీ.. ఎంఎంటీఎస్‌ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపించకపోవడంతో అవి ఇంతకాలం మౌలాలిలోని లోకోషెడ్‌కే పరిమితమయ్యాయి.


సాగుతున్న సన్నాహాలు

ప్రభుత్వం మే 12 నుంచి రాష్ట్రంలో మొదటి విడత లాక్‌డౌన్‌ను అమలులోకి తీసుకొచ్చింది. క్రమంగా పాజిటివ్‌ కేసులు గణనీయంగా తగ్గుతుండడంతో లాక్‌డౌన్‌ ఆంక్షలను సడలిస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఆదివారం నుంచి లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేయడంతోపాటు అన్ని రకాల కార్యకలాపాలకు అనుమతిస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లు ప్రజలకు అందుబాటులో ఉన్న తరుణంలో ఎంఎంటీఎస్‌ రైళ్లను కూడా తిరిగి పట్టాలపైకి తీసుకురావాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి రైల్వేశాఖకు చేసిన విజ్ఞప్తి మేరకు మరో వారంలో నడిపించేందుకు అంగీకరించింది.


ఎంఎంటీఎస్‌ సర్వీసులు..

మొత్తం రైళ్లు : 128, రోజువారీ ప్రయాణికులు: 1.68 లక్షలు

చార్జీలు: రూ.5 నుంచి రూ.15 వరకు

మార్గాలు: సికింద్రాబాద్‌, నాంపల్లి ఫలక్‌నుమా, కాచిగూడ, లింగంపల్లి.

Updated Date - 2021-06-21T14:04:24+05:30 IST