ప్రభుత్వ కార్యాలయాల్లో ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా

ABN , First Publish Date - 2020-12-02T06:25:02+05:30 IST

డెయిరీఫారమ్‌ సెంటర్‌(కాకినాడ), డిసెంబరు1: రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి జారీ చేసిన షెడ్యూల్‌ ప్రకారం తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ముసాయిదా ఓటర్ల జాబితాను ఉభయగోదావరి జిల్లాల కలెక్టరేట్‌లు, రెవెన్యూ డివిజనల్‌ కార్యాలయాలు, తహసీల్దార్‌,

ప్రభుత్వ కార్యాలయాల్లో ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా

ఈనెల 31లోగా క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ

వచ్చే ఏడాది జనవరి 21న తుది ప్రచురణ

ప్రస్తుతం ఉపాధ్యాయ నియోజకవర్గ ఓటర్లు 14,088

ఈనెలాఖరు వరకు ఎంపీడీవో,

తహసీల్దార్‌ కార్యాలయాల్లో ఓట్లు నమోదు చేసుకోవచ్చు

డెయిరీఫారమ్‌ సెంటర్‌(కాకినాడ), డిసెంబరు1: రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి జారీ చేసిన షెడ్యూల్‌ ప్రకారం తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ముసాయిదా ఓటర్ల జాబితాను ఉభయగోదావరి జిల్లాల కలెక్టరేట్‌లు, రెవెన్యూ డివిజనల్‌ కార్యాలయాలు, తహసీల్దార్‌, ఎంపీడీవో, మున్సిపల్‌ కార్యాలయాల్లో మంగళవారం ప్రచురించారు. దీనిపై మంగళవారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డి మురళీధర్‌రెడ్డి విడుదల చేసిన ప్రకటనలో ఈ ముసాయిదా జాబితాపై డిసెంబరు 31లోగా క్లెయిమ్‌లు, అభ్యంతరాలను స్వీకరించి, 2021 జనవరి 12 నాటికి వాటిపై పరిష్కారాలను పూర్తి చేసి అనుబంధాన్ని ముద్రించి, జనవరి 21న తుది ప్రచురణను నిర్వహిస్తామని తెలిపారు. ఈ ముసాయిదా జాబితా ప్రకారం తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ పరిధిలోని మొత్తం 116 నియోజకవర్గాల్లో 8,514 మంది పురుషులు, 5,571 మంది మహిళలు, ముగ్గురు ఇతరులు కలిపి 14,088 మంది ఓటర్లు ఉన్నారన్నారు. తూర్పులోని 67 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో మొత్తం 7,806 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 4,793 మంది పురుషులు, 3,012 మంది మహిళలు, ఒకరు ఇతరులు ఉన్నారన్నారు. అదే విధంగా పశ్చిమలోని 49 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో మొత్తం 6,282 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 3,721 మంది పురుషులు, 2,559 మంది మహిళలు, ఇద్దరు ఇతరులు ఉన్నారన్నారు. ముసాయిదా జాబితాలో నమోదుకాని అర్హులైన వారందరూ ఈనెల 1వ తేదీ నుంచి 31వ తేదీలోగా సంబంధిత ఎంపీడీవో, తహసీల్దార్‌ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అలాగే దరఖాస్తును వెబ్‌సైట్‌లో సందర్శించి టీచర్స్‌ ఫారమ్‌-19 ద్వారా ఆన్‌లైన్‌ ద్వారా సమర్పించవచ్చన్నారు. మరింత సమాచారం కోసం జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయంలోని టోల్‌ఫ్రీ నంబరు 1950లో సంప్రదించవచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి తెలిపారు. 

Updated Date - 2020-12-02T06:25:02+05:30 IST