అమలాపురంటౌన్,
జనవరి 18: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 11వ పీఆర్సీ ప్రభుత్వ రివర్స్
పాలనకు అద్దం పడుతోందని ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ యిళ్ల
వెంకటేశ్వరరావు (ఐవీ) ఆరోపించారు. గతంలో ప్రభుత్వాలు విడుదల చేసిన పది
పీఆర్సీలు పురోగమన దిశలో ఉండగా 11వ పీఆర్సీ తిరోగమన దిశలో ఉందని
ధ్వజమెత్తారు. ప్రభుత్వం నిరంకుశ వైఖరిని విడనాడి ఉద్యోగుల న్యాయమైన
డిమాండ్లు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. అసంబద్ధ పీఆర్సీ
ఉత్తర్వులను, సీపీఎస్ విధానాన్ని రద్దు చేయకపోవడాన్ని నిరసిస్తూ అమలాపురం
గడియార స్తంభం సెంటర్‌లో ఫ్యాప్టో డివిజన్ కోకన్వీనర్లు సరిదే
సత్యపల్లంరాజు, పెంకే వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా
నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం 35వేల ప్రాథమిక పాఠశాలలను మూసివేసే
విధానానికి స్వస్తి పలకాలని, హెచ్‌ఆర్‌ఏ శ్లాబ్‌లను తగ్గిస్తూ ఇచ్చిన
ఉత్తర్వులను రద్దు చేయాలని నినాదాలు చేశారు. నిరసన ధర్నాలో ఫ్యాప్టో
నాయకులు ఎంఎస్‌ఎన్ మూర్తి, మామిడిశెట్టి వెంకటేశ్వరరావు, నిమ్మకాయల
గణేశ్వరరావు, విత్తనాల శ్రీనివాస్, ఎస్ రాజరాజేశ్వరి, నల్లా రామకృష్ణ,
చంద్రరావు, పెన్నాడ శ్రీనివాస్ పాల్గొన్నారు.