కల్వకుంట్ల Kavitha ఎంట్రీతో మళ్లీ పొలిటికల్ హీట్.. ఎంపీ అర్వింద్ సవాల్.. ఏం జరుగుతుందో..!

ABN , First Publish Date - 2022-05-12T16:56:53+05:30 IST

జామాబాద్‌ పాలిటిక్స్‌ హీటెక్కాయి. టీఆర్‌ఎస్‌ దూకుడు పెంచింది. బలం పుంజుకుంటోందని భావిస్తున్న బీజేపీపై ఎమ్మెల్సీ కవిత ఆధారాలతో

కల్వకుంట్ల Kavitha ఎంట్రీతో మళ్లీ పొలిటికల్ హీట్.. ఎంపీ అర్వింద్ సవాల్.. ఏం జరుగుతుందో..!

నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌పై ఎమ్మెల్సీ కవిత ఫైరవ్వడం వెనుక రీజనేంటి? బీజేపీ దూకుడుకు కళ్లెం వేయడానికే ఆమె విమర్శలు మొదలుపెట్టారా? పసుపుబోర్డు విషయంలో అర్వింద్‌ను జనం ముందు దోషిగా నిలబెట్టడంలో ఆమె సక్సెస్‌ అయ్యారా? అర్వింద్‌ ఇచ్చిన కౌంటర్‌ ఎటాక్‌తో బీజేపీ సరైన సమాధానం చెప్పినట్టేనా? అసలు నిజామాబాద్‌ పాలిటిక్స్‌లో ఏం జరుగుతోంది?..అనే మరిన్ని విషయాలు ఏబీఎన్ ఇన్‎సైడ్‎లో తెలుసుకుందాం..


అర్వింద్ వర్సెస్ కవిత

నిజామాబాద్‌ పాలిటిక్స్‌ హీటెక్కాయి. టీఆర్‌ఎస్‌ దూకుడు పెంచింది. బలం పుంజుకుంటోందని భావిస్తున్న బీజేపీపై ఎమ్మెల్సీ కవిత ఆధారాలతో విరుచుకుపడ్డారు. ఎంపీ ఆర్వింద్‌ ఇచ్చిన హామీలు ఏమయ్యాయంటూ ఆమె చేసిన విమర్శలు టీఆర్‌ఎస్‌ కేడర్‌లో జోష్‌ పెంచాయి. ఇటు బీజేపీ కూడా తగ్గేదేలే అంటూ కౌంటర్‌ ఎటాక్‌ ఇచ్చింది. దమ్ముంటే మరోసారి తనపై పోటీ చేయాలంటూ ఎంపీ అర్వింద్‌ కవితకు సవాల్‌ విసిరారు. దీంతో నిజామాబాద్‌ పాలిటిక్స్‌ మరోసారి హాట్‌టాపిక్‌గా మారాయి. 


ఎంపీగా గెలిచి మూడేళ్ళు దాటింది..పసుపు బోర్డు ఏమైంది..?

నిజామాబాద్‌ ఎంపీగా ధర్మపురి అర్వింద్‌ ఎన్నికై మూడేళ్ళు దాటింది. అప్పట్లో టీఆర్‌ఎస్‌, బీజేపీ ఫైట్‌ జాతీయస్థాయిలో ఆసక్తిని కలిగించింది. సీఎం కేసీఆర్‌ కుమార్తె కవితపై అర్వింద్‌ పోటీ చేయడం ఒకటైతే, ఊపిరిసలపనివ్వని వాడీవేడి విమర్శలతో ధర్మపురి టీఆర్‌ఎస్‌పై విరుచుకుపడటం  సంచలనమైంది. దీనికితోడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన ఐదేరోజుల్లో నిజామాబాద్‌ జిల్లాకు పసుపుబోర్డు తెస్తానంటూ అర్వింద్‌ బాండ్‌ పేపర్లపై రాసివ్వడం మరో సెన్సేషన్‌ అయింది.  ఈ సంచలనాల మధ్యే అర్వింద్‌ ఎంపీగా గెలిచారు. కానీ ఆయన చెప్పినట్టు ఐదురోజుల్లో పసుపుబోర్డు నిజామాబాద్‌కు రాలేదు. అప్పటి నుంచి టీఆర్‌ఎస్‌ నేతలు ఈ విషయంలో వీలు చిక్కినప్పుడల్లా రెచ్చిపోతూనే ఉన్నారు.


జనం ముందు అర్వింద్‌ను దోషిగా నిలిపేందుకు ప్రయత్నాలు

జనం ముందు అర్వింద్‌ను దోషిగా నిలిపేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అర్వింద్‌కు కూడా తాను ఇచ్చిన హామీ విషయంలో ఎక్కడో ఓ చోట ఇబ్బందిని ఎదుర్కొంటూనే ఉన్నారు. కానీ పసుపు బోర్డు కంటే ఎక్కువ ఉపయోగమున్న స్పైస్‌ డెవలప్‌మెంట్ ఏజెన్సీని తీసుకొచ్చానని ఆయన చెపుతున్నా, బాండ్‌ పేపర్లపై రాసిచ్చిన హామీ మాత్రం కళ్ళెదుట ప్రశ్నగా కదలాడుతూనే ఉండటం ఆయనకు సమస్యలు సృష్టిస్తోంది. టీఆర్‌ఎస్‌ నేతలు తమ విమర్శలలో ఎప్పడూ ఈ అంశం ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. అయితే అర్వింద్ మాత్రం ఈ విమర్శలకు నెరవడంలేదు. తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. బీజేపీని పటిష్టం చేయడంలో దూసుకుపోతూనే ఉన్నారు. పనిలోపనిగా ఈసారి ఆర్మూర్‌ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇందుకోసం అక్కడ ఓ ఆఫీస్‌ను కూడా ఏర్పాటు చేసుకున్నారు.  


టీఆర్‌ఎస్‌ నేతల అంచనాలు తలకిందులు

నిజామాబాద్‌లో ఎంపీగా గెలవడానికి ధర్మపురి అర్వింద్‌ ప్రధానంగా సీఎం కుమార్తె కవితను లక్ష్యంగా చేసుకున్నారు. ఆమెపై అనేక విమర్శలు చేశారు. వ్యక్తిగతంగానూ టార్గెట్‌ చేశారు. అప్పట్లో టీఆర్‌ఎస్‌ కు ఉన్న అతివిశ్వాసంతో వీటన్నింటినీ లైట్‌ తీసుకుంది. పైగా ఎన్నికల తరువాత అర్వింద్‌ పత్తా లేకుండా పోతారని భావించారు. కానీ టీఆర్‌ఎస్‌ నేతల అంచనాలు తలకిందులయ్యాయి.  కవితపై అర్వింద్‌ గెలిచారు.గులాబీశ్రేణులు షాక్‌ తిన్నాయి. కవిత అయితే కొన్నిరోజులపాటు ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైపోయారు. నిజామాబాద్‌ వ్యవహారాలను ఆమె పట్టించుకోవడం మానేశారు. అర్వింద్ ఎన్ని విమర్శలు చేసినా స్పందించలేదు. అయితే రానూరానూ జిల్లా రాజకీయాలు చేజారుతున్నాయని కారు పార్టీ గుర్తించింది. బీజేపీ బలం పుంజుకుంటోంది,  ఇక కత్తెర వేయకపోతే కష్టమని భావించింది. 


ఇందుకు కవితే అసలు సిసలైన మంత్రమని తలపోసింది. ఈక్రమంలో ఆమెను ఎమ్మెల్సీ చేశారు. నిజామాబాద్‌ జిల్లా బాధ్యతలూ అప్పగించారు.  రంగంలోకి దిగిన కవిత పార్టీలోని సమస్యలపై దృష్టి సారించారు. పార్టీ నేతలతోపాటు, ఎమ్మెల్యేలు, ఎంపీలను సమన్వయపరుచుకుంటూ టీఆర్‌ఎస్‌లో కొత్త జోష్‌ తీసుకొచ్చారు. బీజేపీకి ఆకర్షితులవుతున్న నేతలనూ నియంత్రించగలిగారు. ఇంటిని చక్కదిద్దే పని పూర్తయ్యాక పక్కా ప్రణాళికతో అర్వింద్‌పై ప్రత్యక్ష యుద్ధానికి దిగారు.  సరిగ్గా మూడేళ్ళ తరువాత ఆమె మొదటిసారి ఎంపీ అర్వింద్‌పై స్పందించారు.   ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెబుతూ, అర్వింద్ కు పని చేసే అవకాశం ఇచ్చామని, కానీ మూడేళ్ళలో ప్రజలను మభ్య పెట్టడం తప్ప సాధించిందేమీ లేదని విమర్శించారు. ప్రధానంగా పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానని ఇచ్చిన హామీ ఏమైందని, దీనికోసం ఈ మూడేళ్ళలో చేసిందేమీ లేదని ఆధారాలతో సహా చూపించారు. పలు సందర్భాల్లో అర్వింద్ చెప్పిన మాటలు, ఇచ్చిన హామీల వీడియోలు చూపుతూ నేరుగా సవాళ్ళు విసిరారు. 


కవిత ఎంట్రీతో నిజామాబాద్‌లో పొలిటికల్‌ హీట్‌

మూడేళ్ళు విడిచిపెట్టినం.. ఇప్పుడు ఊకునేది లేదు.. పసుపు బోర్డు తేకపోతే అడుగడుగునా నిలదీస్తామని ఆమె సవాల్ చేశారు. ఇదే తన మొదటి స్పందనగా చెప్పి మరీ సవాల్ చేసిన కవిత రాబోయే రోజుల్లో మరింత దూకుడుగా వ్యవహరించే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అర్వింద్ ను ఢీకొనడానికి, పార్టీ శ్రేణులను ఉత్సాహపరచడానికి ఆమె వేగం పెంచినట్లుగా స్పష్టమవుతోంది. ఈ క్రమంలోనే నియోజకవర్గాల వారీగా కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తున్నారు. ఎమ్మెల్యేల నేతృత్వంలో బీజేపీపై తిరుగుబాటుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అన్నిటికీ మించి బీజేపీ వైపు ఆకర్షితులవుతున్న కొందరు ఎమ్మెల్యేలు, ద్వితీయ శ్రేణి నేతలకు చెక్ పెడుతున్నారు. ఇంటిని చక్కదిద్దుకునే పనులు ఇంత వేగంగా సాగుతుండగా, ఎంపీ అర్వింద్ మాత్రం తన సెటైర్లు మానడం లేదు. 

కవితకు దమ్ముంటే తనపై మళ్ళీ పోటీ చేయాలని సవాల్ 

కవిత చేసిన విమర్శలకు అంతే వేగంగా కౌంటర్ ఇచ్చారు. కవితకు దమ్ముంటే తనపై మళ్ళీ పోటీ చేయాలని సవాల్ విసిరారు. మూడేళ్ళుగా అర్వింద్‌ తనకు ఎదురులేనట్టుగా దూసుకువెళ్లారు. కానీ మరోసారి కవిత ఎంట్రీతో ఇప్పుడు నిజామాబాద్‌లో పొలిటికల్‌ హీట్‌ పీక్స్‌కు చేరుతోంది. అయితే బాండ్‌పేపర్‌పై రాసిచ్చిన హామీని అర్వింద్‌ నెరవేర్చలేకపోయారనే విషయాన్ని జనంలోకి తీసుకువెళ్లడంలో కవిత సక్సెస్‌ అయ్యారని టీఆర్‌ఎస్‌ శ్రేణులు సంబరపడుతున్నాయి. అయితే ఇదేమీ తమకు నష్టం కలిగించదని బీజేపీ భావిస్తోంది. ఏదేమైనా ఈ విమర్శలు, ప్రతివిమర్శలతో అటు టీఆర్‌ఎస్‌, ఇటు బీజేపీ శ్రేణులు తమ అస్త్రశస్త్రాలన్నింటినీ సిద్ధం చేసుకుంటున్నారు. 

Read more