మతాలను రెచ్చగొట్టి రాజకీయం

ABN , First Publish Date - 2022-01-21T05:54:07+05:30 IST

మతాలను రెచ్చగొట్టి రాజకీయం

మతాలను రెచ్చగొట్టి రాజకీయం

 బీజేపీని దళిత, గిరిజనులు విశ్వసించరు : ఎమ్మెల్సీ కడియం 

హనుమకొండ టౌన్‌, జనవరి 20 : కులాలను, మతాలను రెచ్చగొట్టి బీజేపీ పార్టీ రాజకీయ పబ్బం గడుపుకుంటోందని  టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ధ్వజమెత్తారు. ఆ పార్టీని దళితులు, గిరిజనులు విశ్వసించే పరిస్థితి లేదని అభిప్రాయపడ్డారు. హనుమకొండలోని హరిత హోటల్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కడియం బీజేపీపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని 19 ఎస్సీ, 12 ఎస్టీ నియోజకవర్గాలను కైవసం చేసుకుంటామంటున్న బీజేపీ.. వారికి ఏంచేసిందని ప్రశ్నించారు. ఏ ముఖం పెట్టుకుని దళితులను ఓట్లు అడగుతారని బీజేపీని ప్రశ్నించారు. గిరిజనుల హక్కులను కాలరాస్తున్న బీజేపీకి ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. 

దేశంలో ప్రధాని మోదీ ప్రభావం తగ్గుతోందని, దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆ పార్టీ అపజయం పాలవుతోందన్నారు. 2023-24లో దేశంలో బీజేపీ ఓడిపోవడం ఖాయమని కడియం పేర్కొన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేసి ఉపాధి అవకాశాలు దూరం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజల మీద ఈ ప్రాంత బీజేపీ నేతలకు ప్రేమ ఉంటే విభజన హామీలు అమలు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్‌ చేశారు.  సమ్మక్క, సారలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తింపు తీసుకురావాలని, కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురావాలన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి ఈ విషయాలపై ఎందుకు దృష్టి సారించడం లేదని ఆయన ప్రశ్నించారు. 

పోడు రైతుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రకటనలు చేయడం ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమన్నారు. పోడు భూములకు హక్కులు కల్పించే అధికారం కేంద్రం పరిధిలో ఉంటుందనే విషయం బండి సంజయ్‌కి తెలియక పోవడం సిగ్గుచేటని కడియం శ్రీహరి దుయ్యబట్టారు. బండికి దమ్ముంటే ప్రధాని మోదీ ఇంటి ఎదుట ధర్నా చేయాలరి సవాల్‌ విసిరారు. చట్టాలపై అవగాహన లేకుండా మాట్లాడుతూ ప్రజలను గందరగోళంలో నెట్టకూడదన్నారు.  ఈ సమావేశంలో వరంగల్‌ ఎంపీ పసునూరి దయాకర్‌, మాజీ ఎంపీ సీతారాంనాయక్‌ పాల్గొన్నారు.   

Updated Date - 2022-01-21T05:54:07+05:30 IST