ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం

ABN , First Publish Date - 2021-12-09T06:30:34+05:30 IST

సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం చేశారు. ఈ నెల 10న నిర్వహించనున్న పోలింగ్‌ ఏర్పాట్లను బుధవారం కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, ఎస్పీ రాహుల్‌హెగ్డే పరిశీలించారు

ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం
ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, ఎస్పీ రాహుల్‌హెగ్డే

సిరిసిల్ల, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం చేశారు. ఈ నెల 10న నిర్వహించనున్న పోలింగ్‌ ఏర్పాట్లను బుధవారం కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి,  ఎస్పీ రాహుల్‌హెగ్డే  పరిశీలించారు. జిల్లా పరిషత్‌ కార్యాలయంలో ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం కలెక్టర్‌ మాట్లాడారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ సందర్భంగా పోలింగ్‌ కేంద్రంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరపడానికి అందరూ సహకరించాలని కోరారు. జిల్లాలోని 201 మంది ఓటర్లలో 87 మంది పురుషులు, 113 మంది మహిళలు ఉన్నట్లు చెప్పారు. ఇందులో 66 మంది కౌన్సిలర్లు, 12 మంది జడ్పీటీసీలు, 21 మంది ఎంపీటీసీలు, ఇద్దరు ఎక్స్‌ అఫిషియో సభ్యులు ఉన్నారన్నారు.  ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి స్థాయిలో పర్యవేక్షించాలని జడ్పీ సీఈవోను ఆదేశించారు. ఓటర్లు కొవిడ్‌ నిబంధనలు పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పోలింగ్‌ ప్రక్రియ సజావుగా పూర్తి చేయడానికి జిల్లా యంత్రాంగం తరపున  తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్పీ రాహుల్‌ హెగ్డే మాట్లాడుతూ పోలింగ్‌ కేంద్రం వద్ద  అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ టీం, సాటిస్టికల్‌ సర్వే లెయిన్స్‌ టీం, వీడియో టీం, ఏర్పాటు చేసినట్లు చెప్పారు.  ముఖ్యమైన ప్రదేశాల్లో పికెట్‌, పెట్రోలింగ్‌ ఏర్పాటు చేస్తున్నామన్నారు. పోలింగ్‌ కేంద్రాల్లోకి నిషేధిత వస్తువులు అనుమతించబోమని, ఓటర్లు తమ ఓటు  హక్కును ప్రశాంతంగా వినియోగించుకోవాలని అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే స్థానిక పోలీసులకు, డయల్‌ 100కు ఫోన్‌ చేయాలని కోరారు.   జడ్పీ సీఈవో గౌతంరెడ్డి, ఇన్‌చార్జి డీఆర్వో శ్రీనివాసరావు, డీఎస్పీ చంద్రశేఖర్‌, తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ సమ్మయ్య, సీఐలు అనిల్‌కుమార్‌, ఉపేందర్‌, సర్వర్‌ ఉన్నారు. 

Updated Date - 2021-12-09T06:30:34+05:30 IST