పట్టభద్ర, ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో హోరాహోరీ పోరు

ABN , First Publish Date - 2022-05-17T17:35:35+05:30 IST

రాష్ట్రంలో పట్టభద్ర, ఉపాధ్యాయ నియోజకవర్గాల నుంచి విధానపరిషత్‌లోని నాలుగు స్థానాలకు జూన్‌ 13న జరగనున్న ఎన్నికల నేపథ్యంలో కదనరంగం క్రమేపీ

పట్టభద్ర, ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో హోరాహోరీ పోరు

- మంత్రి మురుగేష్‌ సోదరుడు హనుమంత నిరాణి రెండోసారి పోటీ

- హ్యాట్రిక్‌ కోసం అరుణ్‌ శెహపుర ఆరాటం 

- దక్షిణ పట్టభద్రుల నియోజకవర్గంలో పాగాకు కమలనాథుల ఎత్తులు


బెంగళూరు: రాష్ట్రంలో పట్టభద్ర, ఉపాధ్యాయ నియోజకవర్గాల నుంచి విధానపరిషత్‌లోని నాలుగు స్థానాలకు జూన్‌ 13న జరగనున్న ఎన్నికల నేపథ్యంలో కదనరంగం క్రమేపీ వేడెక్కుతోంది. ఈ రెండు నియోజకవర్గాలలోనూ అధికార బీజేపీకి గట్టిపోటీ తప్పదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పట్టభద్ర, ఉపాధ్యాయ నియోజకవర్గాల తాజాస్థితిగతులను ఒకసారి పరికిస్తే. 


వాయువ్య పట్టభద్రుల నియోజకవర్గం 

వాయువ్య పట్టభద్రుల నియోజకవర్గంలో బెళగావి, బాగల్కోటె, విజయపుర జిల్లాలు వస్తాయి. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి బీజేపీ సభ్యుడు హనుమంత్‌ నిరాణి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనకు మరోసారి టికెట్‌ ఖాయంగా కనిపిస్తోంది. ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కాంగ్రెస్‌ ప్రముఖ న్యాయవాది సునీల్‌సంకాను రంగంలోకి దించాలని నిర్ణయించింది. బెళగావి జిల్లాలో కాంగ్రెస్ కు అత్యధిక ఓట్లు ఉండడం, బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తుండడంతో గరిష్టంగా లబ్ధి పొందాలని భావిస్తోంది. పైగా సోదరుడైన మంత్రి మురుగేశ్‌ నిరాణి అండదండలు హనుమంత నిరాణికి పుష్కలంగా ఉన్నాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి సునీల్‌ సంకా కూడా పంచమసాలి కులానికి చెందినవారే కావడంతో పోటీ మరింత కుతూహలంగా మారింది. ఓట్ల విషయానికి వస్తే ఈ నియోజకవర్గంలో మొత్తం 72,674 ఓట్లు ఉన్నాయి. బెళగావి జిల్లాలో 31,489 ఓట్లు, విజయపుర జిల్లాలో 14,846 ఓట్లు, బాగల్కోటెలో 26,342 ఓట్లు ఉన్నాయి. 


వాయువ్య ఉపాధ్యాయ నియోజకవర్గం 

వాయువ్య ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున అరుణ్‌ శెహపుర రెండుసార్లు విజయఢంకా మోగించారు. సంఘ్‌ పరివార్‌ అండదండలు మెండుగా ఉన్నాయి. ఇటీవల బెళగావిలో వెయ్యిమందికిపైగా ఉపాధ్యాయులు సమావేశమై స్థానికుడికి టికెట్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేయడంతో కలకలం చెలరేగింది. బీజేపీ హ్యాట్రిక్‌ కోసం ఆరాటపడుతుంటే కాంగ్రెస్‌ అభ్యర్థిగా మాజీ మంత్రి ప్రకాశ్‌ హుక్కేరి రంగంలోకి దిగుతారన్న కథనాలతో ఇక్కడి వాతావరణం వేడెక్కింది. పంచమసాలి సముదాయానికి చెందిన హుక్కేరి పోటీ చేస్తే అరుణశెహపురకు గట్టిపోటీ తప్పదని వినిపిస్తోంది. 


దక్షిణ పట్టభద్రుల నియోజకవర్గం 

పాతమైసూరులోని దక్షిణ పట్టభద్రుల నియోజకవర్గంలో మైసూరు, మండ్య, హాసన్‌, చామరాజనగర్‌ జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాల్లో బీజేపీ పట్టు అంతంతమాత్రంగానే ఉంది. ఎలాగైనా ఇక్కడ పాగా వేసి పుంజుకోవాలని, శాసనసభ ఎన్నికల నాటికి ఇది పార్టీకి టానిక్‌లా ఉపయోగపడుతుందని కమలనాథులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బలు తగిలాయి. రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు బీవై విజయేంద్రకు అత్యంత ఆప్తుడైన కౌటిల్య రఘుకు ఓటమి తప్పలేదు. పార్టీలో అభిప్రాయభేదాలు కారణమని భావిస్తున్నారు. దక్షిణ పట్టభద్రుల నియోజకవర్గంలో ఈ సారి ఎంవీ రవిశంకర్‌కు టికెట్‌ ఇవ్వాలన్న డిమాండ్‌ బలంగా ఉంది. రెండుసార్లు ఓటమి చవిచూసిన రవిశంకర్‌కు సానుభూతి పవనాలు బలంగా ఉన్నాయని బీజేపీ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న జేడీఎస్‌ సభ్యుడు కేటీ శ్రీకంఠేగౌడ ఈసారి పోటీ చేయడం లేదు. ఆయనకు బదులుగా రాష్ట్రప్రభుత్వ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు హెచ్‌కే రామును జేడీఎస్‌ బరిలోకి దింపింది. టికెట్‌ కోసం ఆశించిన స్థానిక జేడీఎస్‌ నేత జయరాం కాంగ్రె్‌సకు మద్దతు ప్రకటించడం గమనార్హం. కాంగ్రెస్‌ ఇప్పటికే తన అభ్యర్థిగా దివంగత మాజీ ఎంపీ జీ మాదేగౌడ కుమారుడు మధుమాదేగౌడను బరిలోకి దింపింది. ప్రతిపక్షనేత సిద్దరామయ్యకు గెలుపు బాధ్యతను పార్టీ అధిష్టానం అప్పగించింది. రైతుసంఘం తరపున ఎస్‌ ప్రసన్న కూడా బరిలోకి దిగడంతో అన్నదాతల ఓట్లు కొంతమేరకు చీలుతాయని భావిస్తున్నారు. మొత్తానికి ఇక్కడ నెలకొన్న చతుర్ముఖ పోటీ ఎవరికి లాభం చేకూరుస్తుందన్న అంశం పై కుతూహలం నెలకొంది. ఈ నియోజకవర్గంలో మొత్తం 1,32,730 మంది ఓటర్లు ఉండగా మైసూరు నగరం నుంచి 23,850 మంది, మైసూరు గ్రామీణ జిల్లా నుంచి 19,250 మంది, హాసన్‌ జిల్లా నుంచి 26, 450 మంది, చామరాజనగర్‌ నుంచి 10,650 మంది, మండ్య జిల్లా నుంచి 52,530 మంది ఉన్నారు. 

Updated Date - 2022-05-17T17:35:35+05:30 IST