ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు.. ముగిసిన ప్రచారం

ABN , First Publish Date - 2021-03-13T05:44:32+05:30 IST

కృష్ణా - గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ శాసనమండలి ఎన్నికలకు అభ్యర్థుల ప్రచారాలు ముగిశాయి.

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు..  ముగిసిన ప్రచారం

నేడు రూట్‌లవారీగా ఎన్నికల సామాగ్రి పంపిణీ

రేపు ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌

144 సెక్షన్‌ అమలు చేస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు

గుంటూరు, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): కృష్ణా - గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ శాసనమండలి ఎన్నికలకు అభ్యర్థుల ప్రచారాలు ముగిశాయి. శుక్రవారం సాయంత్రం వరకు అభ్యర్థులు ర్యాలీలు నిర్వహించి ప్రచారాలకు ముగింపు పలికారు. చివరి రోజున అభ్యర్థులు ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ విద్యాసంస్థలకు వెళ్లి అధ్యాపకులు, ఉపాధ్యాయులను కలిసి మద్దతు ఇవ్వాల్సిందిగా అభ్యర్థించారు. ప్రచారం ముగియడంతో పలువురు అభ్యర్థులు ప్రలోభాలకు తెరలేపారు. తమ అనుచరులను ఉపాధ్యాయులు, అధ్యాపకులకు వద్దకు పంపించి ఓటుకు రూ.3వేల నుంచి రూ.5 వేల వరకు పంపిణీ చేయడం ప్రారంభించారు. పోలింగ్‌ సామాగ్రిని శనివారం ఉదయం నగరంలోని డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ నుంచి రూట్‌ల వారీగా పోలింగ్‌ సిబ్బందికి సామాగ్రిని ఇచ్చి బూత్‌లకు పంపిస్తారు. 

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లని ఆకర్షించేందుకు అభ్యర్థులు పెద్దఎత్తున నగదు పంపిణీ చేస్తున్నారు. కొంతమంది పీఈటీలకు నోట్ల కట్టలు ఇచ్చి వారి ద్వారా ఓటర్లకు డబ్బు చేరవేస్తున్నారు. నగదు పంపిణీ చేయడం ఇష్టం లేని అభ్యర్థులు ఎవరైతే డబ్బు పంపిణీ చేస్తున్నారో వారిపై నిఘా పెట్టి ఎన్నికల అధికారులకు సమాచారం అందిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 13,700 వరకు ఓట్లు ఉన్నాయి. దీంతో అభ్యర్థులు కనీసం 60 శాతం ఓటర్లకు డబ్బు పంపిణీపై దృష్టి సారించినట్లు సమాచారం. సాధారణ ఎన్నికల్లో ఎవరో ఒకరికే ఓటు వేసే అవకాశం ఉంటుంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంతమంది అభ్యర్థులు ఉంటే అంతమందికి ప్రాధాన్యత ఓటు వేయొచ్చు. దీంతో ఎవరైతే ఎక్కువ నగదు ఇస్తారో వారికి తొలి ప్రాధాన్యం, తక్కువ ఇచ్చిన వారికి ఆ తర్వాత ప్రాధాన్య ఓట్లు వేసే ఆలోచన కూడా చేస్తున్నారు. 

కాగా పోలింగ్‌ సజావుగా జరిగేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో 144 సెక్షన్‌ని అమలు చేస్తూ కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ఐదుగురు కంటే ఎక్కువమంది గూమి కూడకుండా చూడాలన్నారు. మరోవైపు సెక్టోరల్‌ అధికారులు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు, స్టాటిక్‌ సర్వైలెన్స్‌ అధికారులకు స్పెషల్‌ ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రీయల్‌ అధికారాలను కల్పిస్తూ రాష్ట్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో 22 మంది సెక్టోరల్‌ అధికారులు, 36 మంది ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ ఆఫీసర్స్‌, మరో 36 మంది స్టాటిక్‌ సర్వైలెన్స్‌ అధికారులకు ఈ హోదాని కల్పించారు. అలానే కృష్ణా జిల్లాలోనూ మూడు కేటిగిరీల అధికారులకు స్పెషల్‌ ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌ అధికారాలు కల్పించారు. 


Read more