ఎమ్మెల్సీ ఎన్నికలకు సిద్ధంగా ఉండండి

ABN , First Publish Date - 2021-03-05T15:20:51+05:30 IST

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి ఎన్నికల సిబ్బంది సిద్ధంగా ఉండాలని..

ఎమ్మెల్సీ ఎన్నికలకు సిద్ధంగా ఉండండి

అధికారులకు కలెక్టర్‌ ఇంతియాజ్‌ ఆదేశాలు


వన్‌టౌన్: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి ఎన్నికల సిబ్బంది సిద్ధంగా ఉండాలని కలెక్టర్‌ ఇంతియాజ్‌ ఆదేశించారు. కృష్ణా, గుంటూరు ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికల సందర్భంగా స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గురువారం నిర్వహించిన శిక్షణా తరగతులను కలెక్టర్‌ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారులు పూర్తి విశ్వాసంతో పనిచేయాలని, ఎన్నికల నియమ నిబంధనలను తప్పక పాటించాలని సూచించారు. జిల్లాలో ఎమ్మెల్సీ పోలింగ్‌ నిర్వహణకు 51 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఈ నెల 14వ తేదీ ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుందని, జిల్లాలో 6,424 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారని తెలిపారు. పోలింగ్‌ నిర్వహణకు 251 మంది సిబ్బందిని నియమించామని కలెక్టర్‌ చెప్పారు. రెండు జిల్లాల్లో జరిగే ఈ ఎన్నికకు గుంటూరు జిల్లా కలెక్టర్‌ రిటర్నింగ్‌ అధికారిగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. మాస్టర్‌ ట్రైనర్లు శ్రీమన్నారాయణ, అశోక్‌బాబు ఎన్నికల విధివిధానాలను వివరించారు. ఈ సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ (రెవెన్యూ) డాక్టర్‌ కె.మాధవీలత, జాయింట్‌ కలెక్టర్‌ (సంక్షేమం) కె.మోహన్‌కుమార్‌, సబ్‌ కలెక్టర్‌ హెచ్‌ఎం ధ్యానచంద్ర తదితరులు పాల్గొన్నారు.


ఓటర్ల చైతన్య కరపత్రాలు విడుదల

విద్యాధరపురం : ‘ప్రజాస్వామ్యం మన చేతుల్లోనే ఉంది-అమూల్యమైన మీ ఓటుహక్కును వినియోగించుకోండి’ అంటూ ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాలను జిల్లా ఎన్నికల యంత్రాంగం చేపట్టింది. దీనిలో భాగంగా తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి నిర్వహించే మెగార్యాలీ, సిగ్నెచర్‌ క్యాంపైన్‌కు సంబంధించిన కరపత్రాలను గురువారం విడుదల చేశారు. నగరంలోని కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ‘ఓటుహక్కును వినియోగించుకోవడం మన హక్కు - మన బాధ్యత’ అని ముద్రించిన కరపత్రాన్ని జిల్లా మున్సిపల్‌ ఎన్నికల పరిశీలకుడు సుబ్రహ్మణ్యం, కలెక్టర్‌ ఇంతియాజ్‌ విడుదల చేశారు. మున్సిపల్‌ కమిషనర్‌ ప్రసన్న వెంకటేశ్‌, ట్రైనీ కలెక్టర్‌ భావన శిష్ట, సీఎంహెచ్‌వో డాక్టర్‌ గీతాభాయి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-03-05T15:20:51+05:30 IST