ప్రచార పర్వం.. వేడెక్కుతున్న మండలి పోరు

ABN , First Publish Date - 2021-02-25T04:41:57+05:30 IST

ప్రచార పర్వం.. వేడెక్కుతున్న మండలి పోరు

ప్రచార పర్వం.. వేడెక్కుతున్న మండలి పోరు

సభలు, సమావేశాలతో పార్టీల బిజీబిజీ

అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నేతల వ్యూహాలు


ఖమ్మం, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ప్రధాన పార్టీలన్నీ తమ అభ్యర్థుల విజయం కోసం పావులు కదుపుతున్నాయి. ఇప్పటికే పలు దఫాల్లో ప్రచారాలను పూర్తి చేసుకున్న అభ్యర్థులు మరోసారి ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మంజిల్లాలో 1,30,000లకుపైగా ఓట్లు ఉండడంతో వారి మద్దతును కూడగట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డి, టీజేఎస్‌ తరపున కోదండరాం, వామపక్షాలనుంచి జయసారధిరెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థిగా రాములునాయక్‌, యువతెలంగాణ పార్టీనుంచి రాణిరుద్రమ, తెలంగాణ ఇంటిపార్టీనుంచి చెరుకుసుధాకర్‌, ఆప్‌ అభ్యర్థిగా నల్లమోతు తిరుమలరావుతో పాటు తీన్మార్‌ మల్లన్న సహా పలువురు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే వారంతా జిల్లాల వారీగా పర్యటనలు సాగిస్తుండగా.. ఇకపై సభలు, సమావేశాలు ర్యాలీతో ప్రచారాన్ని మరింత వేడెక్కించనున్నారు.




ఇప్పటికే టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి విస్తృతంగా పర్యటిస్తుండగా.. ఆయనకు మద్దతుగా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, మాజీ మంత్రితుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ నామ నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితోపాటు ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, స్థానికసంస్థల ప్రతినిధులు ప్రచారంలో పాల్గొంటున్నారు. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డి తరపున దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావుతో పాటు పలువురు ముఖ్య నేతలు సభల్లో పాల్గొంటున్నారు. టీజేఎస్‌ అభ్యర్థి కోదండరాం ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో పర్యటించారు. ఆయన ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగులు, పట్టభద్రులు, నిరుద్యోగులను కలిసి మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేశారు. వామపక్షాల అభ్యర్థిగా బరిలో ఉన్న జయసారధిరెడ్డి ఇప్పటికే ప్రచారం పూర్తిచేసుకోగా.. నామినేషన్‌ అనంతరం ఆయన తరపున సీపీఎం, సీపీఐ నేతలు ప్రచారం చేస్తున్నారు.


ఇక రాణిరుద్రమ, తీన్మార్‌ మల్లన్న, చెరుకు సుధాకర్‌, తిరుమలరావు కూడా ఓ దఫా ప్రచారం పూర్తిచేసుకోగా.. నామినేషన్‌ తర్వాత మళ్లీ జిల్లాలో ప్రచారాన్ని విస్తృతం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. నిరుద్యోగులను గ్రాడ్యుయేట్‌ ఓటర్లను కలిసి వారి మద్దతు కూడగట్టేదుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఆయా అభ్యర్థుల తరపున రాజకీయ పార్టీలు, కుల, యువజన, విద్యార్థి సంఘాలు రంగంలోకి దిగడంతో ఎమ్మెల్సీ ఎన్నిక క్రమంగా వేడెక్కుతోంది. 

Updated Date - 2021-02-25T04:41:57+05:30 IST