పార్టీల దూకుడు

ABN , First Publish Date - 2020-09-23T08:47:41+05:30 IST

పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆశావహుల ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి.

పార్టీల దూకుడు

ఎమ్మెల్సీ ఎన్నికల కోసం వ్యూహాలు

ఆశావహుల ప్రయత్నాలు ముమ్మరం


హైదరాబాద్‌, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆశావహుల ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ, హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌ నగర్‌ ఉమ్మడి జిల్లాల కోటాలో జరగనున్న రెండు స్థానాల నుంచి వివిధ పార్టీల నుంచి పలువురు టికెట్‌ ఆశిస్తున్నారు. ఓటర్‌ నమోదు నోటిఫికేషన్‌ విడుదల కావడంతో టికెట్‌, పార్టీల మద్దతు కోసం తమ ప్రయత్నాల్లో వేగం పెంచారు.  అటు పార్టీలు కూడా ఈ ఎన్నికల విషయంలో దూకుడు పెంచాయి. నల్లగొండ స్థానంలో టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ పోటీకి సిద్థమయ్యారు. ఇద్దరూ తమ పార్టీ నేతలు, సంఘాల ప్రతినిధులతో ఇప్పటికే సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు.  


అభ్యర్థుల విషయంలో టీఆర్‌ఎస్‌ ఎలాంటి స్పష్టత ఇవ్వకపోయినా.. పార్టీ కేడర్‌ను సన్నద్ధం చేసేందుకు సన్నాహక సమావేశాలు నిర్వహిస్తోంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలో నియోజకవర్గ స్థాయిలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలకు  స్వయంగా మంత్రులు హాజరవుతున్నారు. నల్లగొండ స్థానం నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులుగా బరిలో నిలిచేందుకు ఆ పార్టీ నేతలు తక్కల్లపల్లి రవీందర్‌ రావు, మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు సోదరుడు ప్రదీప్‌ రావు, సీనియర్‌ జర్నలిస్టు పీవీ శ్రీనివాస్‌ రావు, నల్లగొండ ఎమ్మెల్యే సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డి తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇదే స్థానం నుంచి సిటింగ్‌ ఎమ్మెల్సీగా ఉన్న రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి ఈ సారి పోటీ చేసే విషయంలో కూడా స్పష్టత రావడంలేదు. ఇక, హైదరాబాద్‌ స్థానంలో గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఉద్యోగ సంఘాల నేత దేవీ ప్రసాద్‌రావు పోటీ చేసి ఓడిపోయారు.


ఈ సారి గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ఈ స్థానం నుంచి బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పోటీ చేేస్త బాగుంటుందని ఆయన అనుచరులు చెబుతున్నారు. మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజ శేఖర్‌ రెడ్డి, బైకాని శ్రీనివాస్‌ గౌడ్‌, నాగేందర్‌ గౌడ్‌, కాసాని వీరేశ్‌ కూడా టీఆర్‌ఎస్‌ నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నారు అని ప్రచారం జరుగుతోంది. కాగా, రెండు ఎమ్మెల్సీ స్థానాల నుంచి బరిలోకి దిగేందుకు ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలని టీపీసీసీ చేసిన సూచనలకు మిశ్రమ స్పందన వచ్చింది.


నల్లగొండ స్థానం నుంచి మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌, పార్టీ నేత బెల్లయ్య నాయక్‌, గూడూరు నారాయణ రెడ్డి, ఓయూ విద్యార్థి నేత మానవతా రాయ్‌ దరఖాస్తు చేసుకున్నారు. హైదరాబాద్‌ స్థానం నుంచి మాజీ ఎమ్మెల్యేలు చిన్నారెడ్డి, సంపత్‌ కుమార్‌, వంశీచంద్‌ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్‌, ఆ పార్టీ నేత ఇందిరా శోభన్‌ దరఖాస్తు చేసుకున్నారు. ఆ పార్టీ నేత దాసోజు శ్రవణ్‌ మాత్రం రెండు స్థానాలకూ దరఖాస్తు సమర్పించారు. 


బరిలో ఇండిపెండెంట్లు, జర్నలిస్టులు!

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు జర్నలిస్టులు కూడా సిద్థం అవుతున్నారు. మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్‌ హైదరాబాద్‌ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని భావిస్తున్నారు. నల్లగొండ స్థానం నుంచి యువ తెలంగాణ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రాణి రుద్రమ రెడ్డి పోటీకి సిద్థమయ్యారు. సీపీఐ అభ్యర్థిగా పోటీ  చేసేందుకు జర్నలిస్టు నేత జయసారథిరెడ్డి ప్ర యత్నిస్తున్నారు. దేవేందర్‌గౌడ్‌ వద్ద పీఆర్వోగా పనిచేసిన హరి శంకర్‌గౌడ్‌, కాకతీయ వర్సిటీ నుంచి పలువురు ఇండిపెండెంట్లుగా పోటీకి ఆసక్తి చూపుతున్నారు.


మళ్లీ రామచందర్‌ రావుకే?

హైదరాబాద్‌ స్థానం నుంచి సిటింగ్‌ ఎమ్మెల్సీగా ఉన్న రామచందర్‌రావుకే ఈసారి కూడా బీజేపీ అవకాశం ఇస్తుందని ప్రచారం జరుగుతోంది. ఓటర్‌ రీచ్‌ అవుట్‌ కార్యక్రమాన్ని ఆయన చాలా రోజుల క్రితమే ప్రారంభించారు. మరోవైపు ఇదే స్థానం నుంచి పోటీ చేసేందుకు తనకు అవకాశం ఇవ్వాలని హెచ్‌ఏఎల్‌ డైరెక్టర్‌, బీజేపీ నేత మల్లారెడ్డి కోరుతున్నారు. నల్లగొండ స్థానం నుంచి మనోహర్‌రెడ్డి, పేరాల శేఖర్‌రావు, గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి, టికెట్‌ ఆశిస్తున్నారు.

Updated Date - 2020-09-23T08:47:41+05:30 IST