‘గడప’ దాటని ఎమ్మెల్యేలు

ABN , First Publish Date - 2022-05-14T08:49:58+05:30 IST

‘గడప’ దాటని ఎమ్మెల్యేలు

‘గడప’ దాటని ఎమ్మెల్యేలు

  • ముఖ్యమంత్రి చెప్పినా కదలని నేతలు
  • ‘వ్యతిరేకత’ పెరుగుతుందని భయం
  • కరపత్రాల్లోనే కనిపిస్తున్న మేలు
  • క్షేత్రస్థాయిలో రగులుతున్న ప్రజలు
  • అభివృద్ధి ఎక్కడంటూ ప్రశ్నలు
  • బాదుడే బాదుడుపై నిలదీతలు
  • ఆజ్యం పోసిన తాజా కరెంటు చార్జీలు


వైసీపీలో జగన్‌ చెప్పిందే శాసనం! ఆయన మాట చెబితే అందరూ పాటించాల్సిందే. కానీ... అధికారంలోకి వచ్చిన మూడేళ్లకు తొలిసారిగా జనంలోకి వెళ్లేందుకు చేపట్టిన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు పెద్దగా పట్టించుకోవడంలేదు. ‘ఏదో ఒక కారణం’తో గడప దాటడంలేదు. ఎమ్మెల్యేల్లో అత్యధికులు మూడేళ్లుగా జనానికి దూరంగా ఉన్నారు. మరో రెండేళ్లలో ఎన్నికలు ఉండటం, ‘వ్యతిరేక’ సంకేతాలు కనిపిస్తుండటంతో.... అధిష్ఠానం ‘జనంలోకి వెళ్లండి’ అని  ఆదేశించింది. అయినా సరే... చాలామంది ఎమ్మెల్యేలు జనంలోకి వెళ్లేందుకు సాహసించడంలేదు. నీళ్లు, కరెంటు, రహదారులు, అధిక ధరలు, దౌర్జన్యాలు, కబ్జాలు... ఇలా ఎన్నెన్నో సమస్యలు! ఇన్నేళ్ల తర్వాత జనంలోకి వెళితే... నిలదీతలు, నిరసనలు తప్పవని ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు.


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

మొదట పెట్టిన పేరు... ‘గడప గడపకూ వైసీపీ’! అలా పార్టీ పేరుతో పోతే అధికార యంత్రాంగాన్ని వినియోగించుకునే అవకాశం లేదు కాబట్టి, ‘గడప గడపకు మన ప్రభుత్వం’ అని చివరి నిమిషంలో పేరు మార్చేశారు. ‘జనంలోకి వెళ్లండి. చేసిన మేలు చెప్పండి’ అని స్వయంగా పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఎమ్మెల్యేలను ఆదేశించారు. అయినా... అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో సగంమంది ‘గడప గడప’కు దూరంగానే ఉన్నారు. మంత్రులు కూడా చాలామంది ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొనడం లేదు. ‘గడప గడప’కు కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. అంతకుముందు నెలరోజులు దీనిపై కసరత్తు జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని ముఖ్యమంత్రే స్వయంగా చెబుతున్నారు. ప్రభుత్వం చేసిన సంక్షేమాన్ని ప్రచారం చేసుకోవాలన్నది ఆయన ఉద్దేశం కాగా... ప్రజలు సమస్యలపై తమను నిలదీస్తారేమోననే భయం ఎమ్మెల్యేలది! ఇప్పటికే ఈ కార్యక్రమం ప్రారంభించిన కొందరు ఎమ్మెల్యేల్ని ప్రజలు పలు సమస్యలపై నిలదీస్తున్నారు. విద్యుత్‌ బిల్లుల బాదుడు, చెత్తపన్ను నుంచి ఇంటిపన్ను వరకు పెంచేసిన వైనంపై కడిగేస్తున్నారు. ఎమ్మెల్యేలు సమాధానం చెప్పలేక... ఆ క్షణానికి ఏదో ఒకటి సర్దిచెప్పి, ‘నెక్ట్స్‌’ అంటూ మరో వీధిలోకి వెళ్తున్నారు. 


పట్టించుకోని ఎమ్మెల్యేలు

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో చాలామంది ఎమ్మెల్యేలు ‘గడప గడప’కు ప్రారంభించనే లేదు. వర్షాలనీ, కరపత్రాలు రాలేదని కొందరు... మరే కారణం లేకుండానే మరి కొందరు దీనికి దూరంగా ఉన్నారు. నెల్లూరు జిల్లా కావలి, నెల్లూరు సిటీ, కోవూరు, ఆత్మకూరుల్లో ఈ కార్యక్రమం అసలు ప్రారంభమే కాలేదు. గడపగడపకు వెళ్లలేనని, దానికి బదులు గ్రామసభలతో సరిపెడతానని కందుకూరు ఎమ్మెల్యే మహీధర్‌ రెడ్డి పార్టీ పెద్దలకే నేరుగా చెప్పేశారని సమాచారం. ‘గడప గడప’కు వెళ్లేందుకు తనకు ఆరోగ్యం సహకరించదని చెప్పినట్లు సమాచారం. శ్రీకాకుళం జిల్లాలో మంత్రుల నియోజకవర్గాల్లో కూడా ఇంకా ఈ కార్యక్రమం ప్రారంభం కాలేదు. రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ఇంకా దీనిని ప్రారంభించలేదు. అనంతపురం జిల్లాలో... మంత్రి ఉషశ్రీ చరణ్‌ నియోజకవర్గం కళ్యాణదుర్గంలో ఈ కార్యక్రమం ఇంకా ప్రారంభం కాలేదు. కర్నూలు, తిరుపతి, శ్రీ సత్యసాయి, కృష్ణా, ఎన్టీఆర్‌ తదితర జిల్లాల్లోనూ పలు చోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాన్ని ఇంకా ప్రారంభించలేదు. మరోవైపు ప్రారంభమైన నియోజకవర్గాల్లో... తూతూమంత్రంగా ఒకపూట జనంలోకి వెళ్లి సరిపెడుతున్నారు.


ఏం చెప్పాలి?

‘గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించారా? తక్షణం ప్రారంభించాల్సిందే’ అంటూ ఎమ్మెల్యేలపై పైనుంచి తీవ్ర ఒత్తిడి వస్తోంది. కానీ.. ప్రజలపై వేసిన భారాలు, కనిపించని అభివృద్ధిపై ఏం సమాధానం చెప్పాలని ఎమ్మెల్యేలు తర్జనభర్జన పడుతున్నారు. ఇష్టారాజ్యంగా పన్నుల భారం వేసేయడంతో ప్రజలు రగిలిపోతున్నారని, పైగా తాజాగా పెంచిన కరెంటు చార్జీలతో అగ్నికి ఆజ్యం పోసినట్లయిందని వాపోతున్నారు. ‘చేయాల్సిందంతా మీరు చేసి, వ్యతిరేకతను మాత్రం మేం తగ్గించాలంటే ఎలా’ అని ఎమ్మెల్యేలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు.


పేరు గొప్ప..

‘సంక్షేమం’ పేరిట ఊదరగొడుతున్నప్పటికీ... పాత పథకాలకే పేర్లు మార్చి, అమలు తీరు మార్చేశారని ప్రజలకూ అర్థమైంది.  ఈ ప్రభుత్వం ‘గడప గడప’కు కార్యక్రమంలో పింఛను, అమ్మ ఒడి, ఇళ్ల స్థలాల పంపిణీ గురించి గొప్పగా చెప్పుకొంటున్నారు. వీటిపై ఇప్పటికే ప్రజల్లో పూర్తి స్పష్టత ఉంది. గత తెలుగుదేశం ప్రభుత్వం రూ.200 ఉన్న పింఛన్‌ను వెయ్యికి, ఆ తర్వాత రూ.2వేలకు పెంచితే... ఈ ప్రభుత్వం వచ్చాక మూడేళ్లలో కలిపి పెంచింది కేవలం రూ.500. అది కూడా తొలి రెండేళ్లు రూ.250 మాత్రమే పెంచారు. ఇక రెండోది అమ్మఒడి! ఈ పథకం అమలు చేసేందుకు గతంలో విద్యారంగంలో ఉన్న అనేక ఇతర పథకాలను రద్దు చేసేశారు. పైగా... ‘నాన్న బుడ్డీ’కోసం పెడుతున్న ఖర్చుతోనే ‘అమ్మ ఒడి’ అమలు చేస్తున్నామని ప్రభుత్వమే చెప్పేసింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, మెస్‌ చార్జీల చెల్లింపులకు పేర్లు మార్చి విద్యా దీవెన, వసతి దీవెనగా మార్చింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో ఒక విడత ఎగ్గొట్టేశారు. ‘ప్రభుత్వం ఇవ్వకున్నా మీరు కట్టాల్సిందే’ అని విద్యార్థుల తల్లిదండ్రులకు కాలేజీలు తేల్చి చెబుతున్నాయి. ఇక ఇళ్ల స్థలాల గురించి చెబుదామంటే.. జనానికి రెండు విషయాలు మళ్లీ గుర్తు చేసినట్లవుతుంది. ఒకటి... స్థలాల కొనుగోలులో కుంభకోణం! ఆ నియోజకవ ర్గంలో ఏ ధరకు భూముల్ని కొన్నారు, అసలు ధర ఎంత, కొట్టేసింది ఎంత, భూమి చదును పేరిట వెనకేసుకున్నది ఎంత? అనే అంశంపై గతంలోనే జనంలో చర్చల మీద చర్చలు జరిగాయి. ఇప్పుడు... ఎమ్మెల్యేలు ఎదురైతే మళ్లీ జరుగుతాయి. మరోవైపు... ఊరికి దూరంగా, గుట్టల్లో, లోయల్లో, ముంపు ప్రాంతాల్లో ఇచ్చిన ఇళ్ల స్థలాలు ఏం చేయాలో తెలియదు. అదే సమయంలో గత ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో బ్రహ్మాండంగా కట్టిన టిడ్కో ఇళ్లను ఇప్పటికీ ఇవ్వకపోవడంతో లబ్ధిదారులు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. వీటన్నింటి నేపథ్యంలో ‘గడప గడపకు కార్యక్రమంతో వ్యతిరేకత తగ్గుతుందో... మరింత పెరుగుతుందో’ తెలియక ఎమ్మెల్యేలు తికమకపడుతున్నారు.


‘బాదుడు’కు పోటీగా...

పన్నుల భారం, ధరల భారం, ఎత్తేసిన పథకాలు, సంక్షేమంలో లొసుగులు! వీటన్నింటి ప్రభావంతో ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతిందనే విషయం వైసీపీ పెద్దలకూ తెలిసింది. అదే సమయంలో... తెలుగుదేశం పార్టీ ‘బాదుడే బాదుడు’ కార్యక్రమం చేపట్టింది. ప్రజలపై పడిన భారాలు, సంక్షేమ పథకాల్లోని లోగుట్టు, అభివృద్ధి లేకపోవడం వంటి అంశాలను వివరించడం మొదలుపెట్టింది. ప్రజలకు సులువుగా అర్థమయ్యేలా కరపత్రాలు కూడా పంచిపెడుతోంది. ఈ నేపథ్యంలో... తమ పరిస్థితి గ్రహించిన వైసీపీ పెద్దలు ‘గడప గడప’కు కార్యక్రమానికి తెరతీశారు. అనుకున్నదొకటి, అవుతున్నదొకటి అన్నట్లుగా... జనంలోకి వెళ్తున్న వైసీపీ ఎమ్మెల్యేలకు భారీగా నిరసనల సెగ తగులుతోంది. ప్రజల్లో ఇప్పటికే బలంగా ఉన్న వ్యతిరేకతను తట్టుకుని ఈ కార్యక్రమాన్ని గట్టెక్కించడమెలా అనే ఆందోళనతో చాలామంది ఎమ్మెల్యేలు గడప దాటడంలేదు. 

Read more