వలంటీర్లకు భయపడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు.. కారణం ఇదేనా?

ABN , First Publish Date - 2020-06-06T16:19:09+05:30 IST

వలంటీర్లకు భయపడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు.. కారణం ఇదేనా?

వలంటీర్లకు భయపడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు.. కారణం ఇదేనా?

ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటుచేసిన వలంటీర్ల వ్యవస్థ.. ఆ రాష్ట్రంలో సమాంతర ప్రభుత్వంగా పనిచేస్తోందా? పట్టణాలు, పల్లెలలో చీమ చిటుక్కుమన్నా.. దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో వలంటీర్లు వేగుల్లా పనిచేస్తున్నారా? ఏదైనా అంశంపై క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఉన్నది ఉన్నట్టుగా ప్రభుత్వ వర్గాలకు చెబుతున్నవారు..  వారి పనితీరుపై క్షేత్రస్థాయిలో జనం మనోగతం ఎలా ఉంది? ఈ కథనంలో తెలుసుకోండి


  ఏపీలో సమాంతర ప్రభుత్వంగా మారిన వలంటీర్ల వ్యవస్థ క్షేత్రస్థాయిలో పరిస్థితిపై వలంటీర్ల ద్వారా ప్రభుత్వం ఆరా వైసీపీ ఎమ్మెల్యేల అనుచరుల ఆగడాలపై వలంటీర్లు నిఘా.. వలంటీర్లు గ్రామాలకు వెళితే చాలు ఎమ్మెల్యేలు బెంబేలు


    ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరికీ భయపడటంలేదు. కానీ తమతమ నియోజకవర్గాల్లోని వలంటీర్లు క్షేత్రస్థాయిలో ఏదైనా సమాచారం సేకరణకు వెళితే మాత్రం వారు హడలెత్తిపోతున్నారు. వలంటీర్లు, సచివాలయ సిబ్బందితో వారు తప్పనిసరిగా సమావేశమవుతున్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యకలాపాలను సమీక్షిస్తూనే.. పనిలో పనిగా తమపై గానీ, తమ అనుచరుల గురించి గానీ ఏమైనా విచారణ జరిపారా? అని మెల్లగా కూపీ లాగుతున్నారు. రాజకీయమైనా, అక్రమ రవాణా అయినా.. వాటి గురించి సమాచారాన్ని క్షణాల్లో చేరవేస్తున్న వలంటీర్లను చూసి వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. అన్ని శాఖలు తమకు కావాల్సిన సమాచారాన్ని, సర్వేలను, ఇతర డేటాను వలంటీర్ల ద్వారా తెప్పించుకుంటున్నారు. చివరకు ఆయా పోలీస్ స్టేషన్లలో ఉండే కానిస్టేబుళ్లు, పోలీస్ అధికారులు కూడా వలంటీర్ల ద్వారా గ్రామాలలో ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నారు. గ్రామాలలో తమ అనుచరుల ఆగడాలు, దందాలు ఎక్కడ తెలిసిపోతాయోననే టెన్షన్.. కొంతమంది ప్రజాప్రతినిధులలో స్పష్టంగా కనిపిస్తున్నట్టు పరిశీలకులు చెబుతున్నారు.


  2019 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  అధికారం దక్కించుకుంది. ఆ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం తర్వాత చేసిన తొలి ప్రసంగంలోనే.. రాష్ట్రంలో వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. గ్రామాలలో ప్రతి 50 కుటుంబాలకు ఒక వలంటీర్ ను నియమిస్తామని పేర్కొన్నారు. ఆ మేరకు వలంటీర్ల నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చి మరీ.. తమ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు సూచించిన వారినే ఎంపిక చేశారు. వారిలో వైసీపీ కార్యకర్తలతోపాటు సానుభూతిపరులు కూడా ఉన్నారు. గ్రామ, వార్డు వలంటీర్లుగా ఎంపికైన వారు.. క్షేత్రస్థాయిలో జరిగే పేదలకు రేషన్, పెన్షన్ పంపిణీ, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఆయా కార్యక్రమాల అమలుకు కావాల్సిన సమాచారాన్ని కూడా వలంటీర్లు సేకరిస్తున్నారు. ప్రతి గ్రామం, వార్డులో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా... అక్కడ ఏమి జరిగినా వెంటనే ప్రభుత్వానికి సమాచారం కూడా అందిస్తున్నారు. ఆయా ఏరియాల్లో జరుగుతున్న విషయాలు,  అసాంఘిక కార్యకలాపాలు వంటివి తెలుసుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ అధికారులు కూడా వలంటీర్ల వ్యవస్థ సేవలను చక్కగా వినియోగించుకుంటున్నారు.


   నిజానికి వలంటీర్లకు వచ్చే జీతం తక్కువైనప్పటికీ.. వారు చేసే పని మాత్రం కీలకంగా మారింది. గ్రామాలలో జరిగే సంఘ వ్యతిరేక కార్యకలాపాలు, మద్యం, ఇసుక అక్రమ రవాణా సమాచారాన్ని కూడా నిఘా వర్గాలు వలంటీర్ల ద్వారా రహస్యంగా సేకరిస్తున్నాయట. తాజాగా ఇసుక అక్రమ రవాణా, పలు సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపికలో ఆయా గ్రామాల్లోని చోటా నేతల వ్యవహార శైలి, ఇతర ప్రజాప్రతినిధుల పనితీరుని సంబంధిత శాఖల జిల్లా అధికారులు వలంటీర్ల ద్వారానే తెలుసుకుంటున్నారట. కొన్ని గ్రామాలలో ప్రత్యర్ధి పక్షానికి చెందినవారిని లబ్ధిదారులుగా ఎంపిక చేయడం, ప్రభుత్వ కార్యాలయాలలో లంచాలు వంటి వ్యవహారాలపైనా వలంటీర్లను ఆరా తీస్తున్నారట. వారికి నేరుగా ఫోన్లు చేసి మరీ సమాచారాన్ని రాబడుతున్నారట. కాల్ సెంటర్ కు వస్తున్న ఫిర్యాదులను ఎప్పటికప్పుడు నిఘా వర్గాలు పరిశీలించి.. వెంటనే ఆయా గ్రామాలలోని వలంటీర్లకు ఫోన్ చేసి సమాచారం రాబడుతున్నారు. దీంతో వలంటీర్ల వ్యవస్థ కీలకంగా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు.


    వలంటీర్ల నియామకాల్లో అందరికంటే ఎక్కువగా పైరవీలు జరిపింది ఎమ్మెల్యేలే. తమ వారి జాబితాను జిల్లా అధికారులకు పంపించి మరీ.. వారిని వలంటీర్లుగా నియమించుకున్నారు. అలాంటిది ఇప్పుడు కొన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా.. తమపై వలంటీర్లు ప్రభుత్వ పెద్దలకు ఎలాంటి సమాచారం ఇస్తారోనని కలత చెందుతున్నారు. ప్రభుత్వానికి సమాంతర సర్కారుగా వలంటీర్ల వ్యవస్థ పని చేస్తోందని వారు కూడా అంటున్నారు. ఇలా రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో ప్రజాప్రతినిధులపై వలంటీర్ల ద్వారా నిఘా పెట్టి ఉంచారని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. ఒక గ్రామంలో వెయ్యి కుటుంబాలు ఉంటే.. 20 మంది వలంటీర్లు ఉంటారు. వీళ్లల్లో నలుగురైదుగురితో టచ్ లో ఉన్నా.. అక్కడ ఏం జరుగుతుందో వెంటనే తెలిసిపోతుంది. అంతేకాక గ్రామాలలో వలంటీర్లలో స్వామిభక్తి చూపువారే కన్నా.. వైసీపీకి వీరాభిమానులుగా ఎవరున్నారోనని పార్టీ, ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు సమాచారం సేకరిస్తున్నారట. వారిని తమకు అత్యంత నమ్మకమైన వేగుల్లా వినియోగించుకుంటున్నారట. తమకు కావాల్సిన సమాచారాన్ని వారి ద్వారా ఎప్పటికప్పుడు తెప్పించుకుంటున్నారట. ఇలా కొందరు వలంటీర్లు ఓవైపు ఎమ్మెల్యేలతో టచ్ లో ఉంటూనే.. మరోవైపు పార్టీలోని కీలక వ్యక్తులు, పోలీసులు, ఇతర నిఘా వర్గాలతో కూడా సన్నిహితంగా ఉంటున్నారని సమాచారం.


    మొత్తంమీద, తమ సిఫార్సులతో వలంటీర్లుగా నియామకమైన వారే.. తమకు మొగుళ్లుగా మారారని కొందరు ఎమ్మెల్యేలు బహిరంగంగానే అంటున్నారు. గ్రామ పాలన వ్యవస్థలో వలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బంది కీలకంగా మారారనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి కూడా వలంటీర్ల సేవలను పదేపదే కొనియాడటం, వారిని ప్రశంసించడం చేస్తున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో వలంటీర్ల ప్రాముఖ్యత మరింత పెరిగిందని పరిశీలకులు చెబుతున్నారు.

Updated Date - 2020-06-06T16:19:09+05:30 IST