కేసీఆర్‌ను ముట్టుకుంటే బీజేపీ మసి

ABN , First Publish Date - 2022-01-15T06:04:36+05:30 IST

కేసీఆర్‌ను ముట్టుకుంటే బీజేపీ మసి

కేసీఆర్‌ను ముట్టుకుంటే బీజేపీ మసి
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి

బండి సంజయ్‌ కాదు.. తొండి సంజయ్‌

బీజేపీ నేతలపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఫైర్‌

జనగామ, జనవరి 14 (ఆంధ్రజ్యోతి) : సీఎం కేసీఆర్‌ను ముట్టుకుంటే బీజేపీ దేశ వ్యాప్తంగా మసై పోతుందని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి విమర్శించారు. కేసీఆర్‌ను జైలుకు పంపిస్తామంటూ బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై మండిపడ్డారు. దమ్ముంటే సీఎం కేసీఆర్‌ను ముట్టుకొని చూడాలని సవాల్‌ విసిరారు. రైతుబంధు సంబరాల్లో భాగంగా నిర్వహించిన ముగ్గుల పోటీల్లో ప్రథమ, ద్వితీయ స్థానం పొందిన వారికి జనగామ జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం చీరలను ఎమ్మెల్యే బహుమతిగా అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాటా ్లడారు. బీజేపీ నేతలు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. బండి సంజయ్‌ కాదు.. తొండి సంజయ్‌ అంటూ ఎద్దేవా చేశారు. అనవసర వ్యాఖ్యలతో దేశంలో చిచ్చు పెట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. 

తెలంగాణలో కేసీఆర్‌ తీసుకొచ్చిన పథకాలను కేంద్రంతో పాటు చాలా వరకు రాష్ట్రాలు కాపీ కొట్టి అమలు చేస్తున్నాయని ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి పేర్కొన్నారు. కల్యాణలక్ష్మి పథకాన్ని తమిళనాడు రాష్ట్రంలోనూ అమలు చేయాలని అక్కడి సీఎం నిర్ణయించారని గుర్తుచేశారు. దేశానికి దిక్సూచి చూపిస్తున్న కేసీఆర్‌ను జైలుకు పంపే దమ్ము బీజేపీ నేతలకు ఉందా? ఖబడ్దార్‌ అంటూ హెచ్చరించారు. చేతకాని దద్దమ్మలే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారని విమర్శించారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఏ ఒక్క పథకాన్ని అయినా ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్నాయా? అని ప్రశ్నించారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయో చూపాలని సవాల్‌ విసిరారు. అలా నిరూపిస్తే తనతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులంతా జనగామ అంబేద్కర్‌ చౌరస్తా వద్ద మూకుమ్మడి రాజీనామా చేస్తామని సవాల్‌ విసిరారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి దేశ విదేశాల నుంచి పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ భూస్థాపితం కావడం ఖాయమని, ప్రస్తుతం కేసీఆర్‌ అదే పనిలో ఉన్నారని అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 57వేల ముగ్గులు వేశారని చెప్పారు. సమావేశంలో జనగామ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ బాల్దె విజయ, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పోకల జమున, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి, కౌన్సిలర్లు బండ పద్మ, అనిత, నేతలు బాల్దెసిద్దిలింగం, బండ యాదగిరిరెడ్డి పాల్గొన్నారు.


మహిళల సృజనాత్మకత అభినందనీయం

జనగామ టౌన్‌ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే రైతుబం ధు పథకం సంబరాలలో భాగంగా ముగ్గుల పోటీల్లో రైతులకు మద్దతు తెలిపిన మహిళల సృజనాత్మకత అభినందనీయమని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. రైతుబంధు వారోత్సవాల సందర్భంగా పట్టణంలోని 30 వార్డులలో టీఆర్‌ఎస్‌  ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో విజేతలైన మహిళలకు క్యాంపు కార్యాలయంలో శుక్రవారం బహుమతులను అందించారు. చరిత్రాత్మక పథకంపై మహిళలు ముగ్గులతో తమ మద్దతు ప్రకటించడం శుభపరిణామమన్నారు. ఇదే స్ఫూర్తితో మహిళలు ప్రభుత్వ సంక్షేమానికి చేయూతనందించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పోకల జమున, వైస్‌ చైర్మన్‌ మేకల రాంప్రసాద్‌, కౌన్సిలర్లు వాంకుడోతు అనిత, డాక్టర్‌ సుధ సుగుణాకర్‌ రాజు, పేర్ని స్వరూప, బండ పద్మ, జూకంటి లక్ష్మి, మల్లిగారి చంద్రకళ, రాహెల, పాక రమ, ఎండీ సమద్‌, గుర్రం భూలక్ష్మి నాగరాజు, నాయకులు మల్లిగారి రాజు, గుర్రం నాగరాజు, రైతుబంధు జిల్లా కోఆర్డినేటర్‌ ఇర్రి రమణారెడ్డి, మసీ ఉర్‌రెహమాన్‌, దేవునూరి సతీష్‌, మామిడాల లాజర్‌, ఉడుగుల నర్సింహులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-15T06:04:36+05:30 IST