హైదరాబాద్‌ కన్నా ఓరుగల్లుది గొప్ప చరిత్ర

ABN , First Publish Date - 2022-01-24T05:15:00+05:30 IST

హైదరాబాద్‌ కన్నా ఓరుగల్లుది గొప్ప చరిత్ర

హైదరాబాద్‌ కన్నా ఓరుగల్లుది గొప్ప చరిత్ర
జైన భక్తులను ఉద్దేశించి మాట్లాడుతున్న వినయ్‌ భాస్కర్‌

 చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌

 అగ్గలయ్యగుట్ట జైన క్షేత్రం ట్రస్ట్‌కు అప్పగింత

 ఇక గుట్టపై నిత్యపూజలు..  పర్యాటకుల సందర్శన

హనుమకొండ, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): ఓరుగల్లు చరిత్ర హైదారాబాద్‌ కన్నా గొప్పదని ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ అన్నారు. హైదరాబాద్‌ది 500 ఏళ్ల చరిత్ర అయితే.. వరంగల్‌ది వేయ్యేళ్లకుపైనే అన్నారు. ఆదివారం హనుమకొండలో పద్మాక్షి దేవాలయం సమీపంలోని చారిత్రాత్మకమైన జైన క్షేత్రాన్ని (అగ్గలయ్య గుట్ట) శాంతిలాల్‌ దిగంబర్‌ జైన్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌కు చీఫ్‌విప్‌ వినయ్‌భాస్కర్‌ సమక్షంలో కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ అధికారింగా అప్పగించింది. ఈ సందర్భంగా 16వ జైన తీర్థంకరుడైన శాంతినాథుడి దిగంబర విగ్రహం ఎదుట ట్రస్ట్‌ శాంతి విధాన్‌  (విశ్వశాంతి) పూజను నిర్వహించింది. 

ముఖ్య అతిథిగా హాజరైన వినయ్‌భాస్కర్‌ జైనభక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ.. జైనులు, కాకతీయులు పాలించిన ఓరుగల్లు నేలపై ఎటుచూసినా చారిత్రక ఆనవాళ్లు కనిపిస్తాయన్నారు. ఈ జైన క్షేత్రం అభివృద్ధితో భవిష్యత్తులో గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా భాసిల్లుతుందన్నారు. జైనమతస్తులు పవిత్రంగా ఆరాధించే 16వ జైనతీర్థంకరుడు కొలువతీరిన ఈ క్షేత్రం భవిష్యత్తులో ప్రపంచస్థాయి జైనుల పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందగలదన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. వెయ్యేళ్ల కిందట వైద్యాచార్యుడైన అగ్గలయ్య ఈ గుట్టపై పేదలకు వైద్యం చేసినందువల్ల ఈ గుట్టకు అగ్గలయ్య గుట్టగా పేరు వచ్చిందన్నారు. ఈ పర్యాటక ప్రాంతాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి త్వరలో పలు సాంస్కృతిక, అధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు జైన సమ్మేళనాలను నిర్వహించనున్నట్టు తెలిపారు. అగ్గలయ్య గుట్ట వేదికగా సుప్రసిద్ధ చరిత్రకారులతో సదస్సును కూడా జరుపునున్నట్టు చెప్పారు. ఈ జైన క్షేత్రానికి వెళ్లే మార్గానికి అగ్గలయ్య గుట్ట పేరుపేట్టేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. జైనక్షేత్రం ప్రాశస్త్యం పర్యాటకులకు తెలిసేలా ముఖ్య కూడళ్లలో హోర్డింగ్‌లను ఏర్పాటు చేయనున్నట్టు  తెలిపారు. 

శాంతినాథ్‌ దిగంబర్‌ జైన్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ కార్యదర్శి సుమేర్‌ లాల్‌ జైన్‌ మాట్లాడుతూ.. అగ్గలయ్య గుట్ట ప్రాంతంలో 5ఎకరాల స్థలాన్ని తమ ట్రస్ట్‌కు అప్పగించినట్లయితే 100 గదులతో సత్రాన్ని నిర్మిస్తామన్నారు. దేశ, విదేశాల నుంచి వచ్చే పర్యాటకులు, ముఖ్యంగా జైన భక్తుల సౌకర్యార్థం భోజనశాల, ఆస్పత్రి, పిల్లల పార్కు, క్రీడామైదానం, గోశాల వంటివి ఏర్పాటు చేస్తామని తెలిపారు. అగ్గలయ్య గుట్టపై శాంతినాథుడి దిగంబర విగ్రహం వద్ద ఇక నుంచి ప్రతీరోజు ఉదయం 9 గంటలకు అభిషేకం, అర్చనలను నిర్వహించనున్నట్టు తెలిపారు. ఫిబ్రవరి 1నుంచి రూ.10 ప్రవేశ రుసుముతో సందర్శకులకు ప్రవేశం ఉంటుందని, సాయంత్రం 6 గంటల వరకు క్షేత్రం తెరిచి ఉంటుందని తెలిపారు. 

ఈ కార్యక్రమంలో శాంతిలాల్‌ దిగంబర్‌ జైన్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ అధ్యక్షుడు రాజేష్‌ పహాడ్‌ (గార్ల), కోశాధికారి కాల మహేందర్‌ కుమార్‌ జైన్‌ (డోర్నకల్‌), ట్రస్ట్‌ ఉపాధ్యక్షుడు సురేందర్‌ బాక్లీవాల్‌ (హైదరాబాద్‌), సలహాదారుడు కిశోర్‌ పహాడ్‌ (హైదరాబాద్‌), ట్రస్ట్‌ సభ్యుడు వినోద్‌ జైన్‌  (తాండూరు)తో పాటు టీఆర్‌ఎస్‌ నాయకుడు పులి రజనీకాంత్‌, కుడా ఏవో అజిత్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం లక్నోలో ఉన్న జైనుల గురువు 108వ ఆచార్య ప్రముఖ్‌ సా గర్‌ మహారాజ్‌ వీడియోకాల్‌ ద్వారా ఆశీస్సులు అందచేశారు. అగ్గలయ్య గుట్ట అభివృద్ధికి కృషి చేసిన వినయ్‌భాస్కర్‌, కుడా ఏవో అజిత్‌ రెడ్డిలను ట్రస్ట్‌ సభ్యులు శాలువాలతో సత్కరించారు.




 

Updated Date - 2022-01-24T05:15:00+05:30 IST