ఎమ్మెల్యేలే సుప్రీం.. చెప్పింది చేయండి!

ABN , First Publish Date - 2020-10-28T10:47:42+05:30 IST

జిల్లాలో నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దేందుకు..

ఎమ్మెల్యేలే సుప్రీం.. చెప్పింది చేయండి!

వారు తెచ్చే ప్రతి సమస్య పరిష్కరించండి 

ఇబ్బందికరమైతే ఇన్‌చార్జి మంత్రి దృష్టికి తీసుకెళ్లండి

కలెక్టర్‌, ఎస్పీలతో సజ్జల, బాలినేని 

మీ అనైక్యత వల్ల బలహీనపడుతున్నాం

ద్వితీయ శ్రేణిని కలుపుకొని వెళ్లండి 

మంత్రులు, ఎమ్మెల్యేలకూ దిశానిర్దేశం

జిల్లా ప్రగతిపై ఐదు గంటలపాటు సమీక్ష

ప్రతి ఎమ్మెల్యేతో ఏకాంత చర్చలు


‘‘నియోజక వర్గాల్లో ఎమ్మె ల్యేలే సుప్రీం. వారికే అధిక ప్రాధాన్యం ఇవ్వం డి. మీ దృష్టికి వారు ఏ సమస్య తెచ్చిన వెంటనే పరిష్కరించండి. ఇబ్బందికరమైనవి అయితే జిల్లా ఇన్‌చార్జి మంత్రి బాలినేని దృష్టికి తీసుకెళ్లండి.’’

- కలెక్టర్‌, ఎస్పీలతో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి


‘‘మీ అంతర్గత విభేదాల వల్ల పార్టీ బలహీనపడుతోంది. చేసి న అభివృద్ధి తాలూకు ప్ర భావం ప్రజల్లో కనిపించ డం లేదు. ధాన్యం మద్ద తు ధర, ఇతర సమస్యల గురించి మీరు ప్రభుత్వం దృష్టికి తెచ్చి ఉండాల్సిం ది. అనవసరంగా టీడీపీ కి అవకాశం కల్పించారు.   రైతుల కోసం ఎంత చేసినా మైలేజ్‌ పొందలేకపోయాం.’’ 

- ఎమ్మెల్యేలు, వైసీపీ జిల్లా నేతలతో సజ్జల, బాలినేని

నెల్లూరు(ఆంధ్రజ్యోతి): జిల్లాలో నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దేందుకు వైసీపీ అధిష్ఠానం సూచనమేరు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి బాలినేని శ్రీనివాసరావు మంగళవారం మధ్యాహ్నం నెల్లూరుకు చేరుకున్నారు. స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో జరిగిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో జిల్లాలో పార్టీ పరిస్థితి, జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల తీరుతెన్నులపై సజ్జల, బాలినేనిలు సమీక్షించారు. ఈ సమావేశానికి మంత్రి మేకపాటి గౌతం, ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి మినహా మిగిలిన ఎమ్మెల్యేలు, మంత్రి అనిల్‌ కుమార్‌, ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో వైసీపీ జిల్లా వ్యవహారాల ఇన్‌చార్జి సజ్జల, జిల్లా ఇన్‌చార్జి మంత్రి బాలినేనిలు ఇటు ఉన్నతాధికారులకు, అటు నేతలకు పలు సూచనలు చేశారు. సుమారు ఐదు గంటలసేపు జరిగిన ఈ సమావేశంలో ప్రతి ఎమ్మెల్యేతో వారు ఏకాంతంగా మాట్లాడారు.


నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనులు, ఇతర సమస్యలు, రాజకీయంగా ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న కలెక్టర్‌ చక్రధర్‌బాబు, ఎస్పీ భాస్కర్‌భూషణ్‌లకు కొన్ని సూచనలు చేశారు. ‘‘నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యేలే సుప్రీం, వారు ఏ సమస్య తెచ్చినా పరిష్కరించండి. వారికే అధిక ప్రాధాన్యం ఇవ్వండి. ఇబ్బందికర అంశాలు ఉంటే ఇన్‌చార్జి మంత్రి బాలనేని దృష్టికి తీసుకెళ్లండి.’’ అని సజ్జల అన్నట్లు తెలిసింది. 


సఖ్యతగా ఉండండి

అదే సమయంలో జిల్లా నాయకులంతా సఖ్యతగా ఉండాలని జిల్లా నేతలకు బాలినేని, సజ్జల సూచించారు.  ‘‘మీ అంతర్గత విభేదాల వల్ల పార్టీ బలహీనపడుతోంది. చేసిన అభివృద్ధి తాలూకు ప్రభావం ప్రజల్లో కనిపించడం లేదు. ధాన్యం కొనుగోలు విషయంలో మీరు సరిగా స్పందించలేదు. మద్దతు ధర, ఇతర సమస్యల గురించి మీరు ప్రభుత్వం దృష్టికి తెచ్చి ఉండాల్సింది. అనవసరంగా టీడీపీకి అవకాశం కల్పించారు. మనం రైతుల కోసం ఎంత చేసినా మైలేజ్‌ పొందలేకపోయాం.’’ అని వ్యాఖ్యానించినట్లు సమాచారం. ధాన్యం కొనుగోలులో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని, తప్పుచేసిన వారు ఎవరైనా వదలిపెట్టవద్దని వారిద్దరు కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్లను ఆదేశించారు. అలాగే కొంతమంది ఎమ్మెల్యేలు ద్వితీయ శ్రేణి నాయకులను కలుపుకొని వెళ్లడంలో విఫలం అవుతున్నారని, జిల్లాకు చెందిన ముఖ్య నేతలు ఒకరిపై ఒకరు ఈర్ష్యాద్వేషాలు నింపుకున్నారని, ఇది పార్టీకి మంచిది కాదని వీరు జిల్లా నేతలకు హితవు పలికినట్లు తెలిసింది. 


సలహామండలికి గ్రీన్‌సిగ్నల్‌

ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ విషయంలో గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ పదవిని కోవూరు నియోజకవర్గానికి చెందిన నిరంజన్‌ బాబుకు ఇవ్వాలని ఎమ్మెల్యే ప్రసన్న కుమార్‌రెడ్డి కోరగా అందుకు సజ్జల, బాలినేనిలు అంగీకరించినట్లు తెలిసింది.  


కిలివేటి వర్సెస్‌ కామిరెడ్డి

వైసీపీ నేతల విస్తృత స్థాయి సమావేశంలో సూళ్లూరుపేట నేతల మధ్య వాగ్వాదం జరిగింది. సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, అదే నియోజకవర్గానికి చెందిన కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి సమావేశ మందిరం వెలుపల కాసేపు వాదులాడుకున్నారు. దీనికి ముందు ఎమ్మెల్యేపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి సత్యనారాయణరెడ్డి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఎమ్మెల్యే తనను కలుపుకొని వెళ్లడంలేదని, మండలంలో తనకు వ్యతిరేకవర్గాన్ని సృష్టిస్తున్నారని ఆరోపించినట్లు సమాచారం. దీనికి ఎమ్మెల్యే స్పందిస్తూ సత్యనారాయణరెడ్డి దౌర్జన్యాల కారణంగా పార్టీకి చెడ్డపేరు వస్తోందని, పరిశ్రమల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయని, ఆ కారణంగానే ఆయన్ను దూరం పెట్టాల్సి వచ్చిందని బదులు ఇచ్చినట్లు తెలిసింది. 

Updated Date - 2020-10-28T10:47:42+05:30 IST