లోకేష్.. మేం కుక్కలమే.. కానీ.. : వైసీపీ ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2021-06-19T01:22:29+05:30 IST

కర్నూలు : జిల్లాలోని గడివేముల మండలం పెసరవాయిలో

లోకేష్.. మేం కుక్కలమే.. కానీ.. : వైసీపీ ఎమ్మెల్యే

కర్నూలు : జిల్లాలోని గడివేముల మండలం పెసరవాయిలో ఇద్దరు టీడీపీ నేతలు (అన్నదమ్ములు) ప్రతాప్ రెడ్డి, నాగేశ్వర రెడ్డిలను ప్రత్యర్థులు అతి దారుణంగా హత్య చేసిన విషయం విదితమే. ఈ హత్యలు ఎవరు చేశారు..? ఎందుకు చేశారు..? అనే విషయాలు ఇంకా పూర్తిగా తెలియరాలేదు. అయితే ఈ హత్యలకు కారణం వైసీపీ నేతలేనని టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్ కూడా మీడియా ముందుకొచ్చి జగన్ సర్కార్‌పై విమర్శల వర్షం కురిపించారు. అంతేకాదు జిల్లాకు చెందిన నేతలు, స్థానిక నేతలపై కూడా ఒకింత ఆరోపణలు చేయడంతో ఇప్పటికే కర్నూలుకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, నేతలు స్పందించారు.


అప్పుడు మాట్లాడలేదేం లోకేష్‌..!?

తాజాగా నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి స్పందించారు. పెసరవాయి జంట హత్యలపై చిట్టి నాయుడు లోకేష్ అవాకులు, చవాకులు మాట్లడటం దారుణం. వైసీపీ నాయకులను కుక్కలతో పోలుస్తున్నారు.. అవును.. మేము కుక్కలమే.. ప్రజలకు విశ్వాసంగా పనిచేస్తాం. నంద్యాల వైసీపీ దళిత నాయకుడు సుబ్బరాయుడుని టీడీపీ నాయకులు హత్య చేసినప్పుడు లోకేష్ ఎందుకు మాట్లాడలేదు..?. కొత్తపల్లె సర్పంచ్ తులసిరెడ్డిపై హత్యాయత్నం చేసినప్పుడు భూమా కుటుంబ పాత్ర ఉందని చెప్పినా ఆఖిలప్రియకు ఎందుకు మంత్రి పదవి ఇచ్చి ప్రోత్సహించారో చెప్పాలి..?అని మీడియా వేదికగా లోకేష్‌పై శిల్పారవి ప్రశ్నల వర్షం కురిపించారు.


కాగా.. శ్మశానానికి వెళ్తుండగా అన్నదమ్ములను ప్రత్యర్థులకు కిరాతకంగా నరికిచంపారు. తొలుత బొలేరో వాహనాలతో ఢీకొట్టి.. అనంతరం వేటకొడవళ్లతో నరికి చంపేశారు. మూడు రోజుల క్రితం చనిపోయిన సమీప బంధువుకు సమాధి వద్దకు మూడు రోజుల మెతుకులు వేసేందుకు శ్మశానానికి వెళ్తుండగా కాపు కాచి ప్రత్యర్థులు ఈ ఘటనకు పాల్పడ్డారు. ప్రత్యర్థుల దాడిలో మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. వారందరూ ప్రస్తుతం నంద్యాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Updated Date - 2021-06-19T01:22:29+05:30 IST