ఎమ్మెల్యే చెప్పాడు..

ABN , First Publish Date - 2022-06-13T06:35:01+05:30 IST

కసాపురానికి వెళ్లే ఫోర్‌వే రోడ్డుకు ఆనుకుని ఉన్న పొరంబోకు స్థలంపై వైసీపీకి చెందిన ఓ నాయకుడి కన్నుపడింది.

ఎమ్మెల్యే చెప్పాడు..
గోవుల కోసం వేసిన షెడ్డు

గోశాల షెడ్‌ తొలగించు.. లేదంటే ఎక్స్‌కవేటర్‌ తెచ్చి కూల్చేస్తా..

అర్చకుడికి  వైసీపీ నాయకుడి బెదిరింపు

గుంతకల్లుటౌన, జూన 12: కసాపురానికి వెళ్లే ఫోర్‌వే రోడ్డుకు ఆనుకుని ఉన్న పొరంబోకు స్థలంపై వైసీపీకి చెందిన ఓ నాయకుడి కన్నుపడింది. రూ.లక్షలు విలువ చేసే 20 సెంట్ల స్థలం కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఎమ్మెల్యే చెప్పాడు, ఏమైౖనా చేయలగనంటూ శ్రీ దత్తాత్రేయ శనీశ్వర దేవాలయం అర్చకుడికి వైసీపీ నాయకుడు రెండు రోజుల క్రితం ఫోన ద్వారా బెదిరించాడు. పొరంబోకు స్థలంలో వేసిన గోశాల షెడ్‌ను ఎక్సకవేటర్‌ తెచ్చి కూల్చేస్తానని దౌర్జన్యం చేస్తున్నాడు. అర్చకుడిని బెదిరిస్తున్న ఆడియో కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. కసాపురం రోడ్డులో 2006లో దాదాపు ఎకరా స్థలంలో శ్రీదత్తాత్రేయ శనీశ్వర స్వామి దేవాలయంతో పాటు పక్కనున్న పొరంబోకు స్థలంలో గోవులను పెంచుకుంటున్నాడు. గుంతలుగా ఉన్న స్థలాన్ని మట్టితో పూడ్చి చిన్న గుడిసె వేసుకుని గోవులను పెంచుకుంటున్నాడు. 2018లో వైసీపీ నాయకుడు పొరంబోకు స్థలానికి ఆనుకుని ఉన్న 3.5 సెంట్ల స్థలాన్ని పాతగుంతకల్లుకు చెందిన మరో వ్యక్తి నుంచి కొనుగోలు చేశాడు. అతను కొనుగోలు చేసిన స్థలం ఎదురుగా 20 అడుగుల రోడ్డు ఉంది. ఆ రోడ్డుకు ఎదురుగా 20 సెంట్ల పొరంబోకు స్థలం తనకు చెందుతుందని అర్చకుడితో మూడేళ్లుగా గొడవ పడుతున్నాడు. ఏడాది క్రితం వైసీపీ నాయకుడు అర్థరాత్రి పెద్దబంకును తెచ్చి పెడుతుండగా అర్చకుడు గమనించి అడ్డుకున్నాడు. పోలీసులు వచ్చి బంకును పోలీసు స్టేషనకు తరలించారు. రెవెన్యూ అధికారులు స్థలం గురించి నిర్ధారణచేసే వరకు నిర్మాణాలు చేపట్టవద్దని ఇరువురికి పోలీసులు సూచించారు. దీంతో  అర్చకుడు ఆలయం ముందు ఉన్న నాగుల కట్టవద్ద రేకులు వేసి 40 గోవులను అందులో ఉంచి పోషిస్తున్నాడు. మూడు రోజుల క్రితం అర్చకుడు లక్ష్మీనారాయణను వైసీపీ నాయకుడు ఫోన చేసి మూడేళ్లయినా నువ్వు ఖాళీ చేయడం లేదు, ఎమ్మెల్యే చెప్పాడు ఏదైనా చేసి ఎక్స్‌కవేటర్‌తో స్థలంలోని షెడ్‌ను తొలగిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం. తనకు ప్రాణహాని ఉందని, గోవులను రక్షించాలని కసాపురం పోలీసు స్టేషనలో ఫిర్యాదు చేసినట్లు అర్చకుడు తెలిపాడు.


స్థలాన్ని గోశాలకు కేటాయించాలి..

ఆలయ ఆవరణకు ఆనుకుని ఉన్న పొరంబోకు స్థలాన్ని గోశాలకు కేటాయించాలి. 2019లోనే ప్రభుత్వానికి, కలెక్టర్‌కు, గుంతకల్లు తహసీల్దారుకు అర్జీ పెట్టుకున్నా. ఎన్నికల కోడ్‌ ఉందని, ప్రస్తుతం గోశాల కొనసాగించుకోవాలని రెవెన్యూ అధికారులు అప్పట్లో తెలిపారు. వైసీపీ నాయకుడు దౌర్జన్యంగా ఆ స్థలాన్ని కబ్జా చేయాలని నన్ను బెదిరిస్తున్నాడు. నాకు వెంటనే రక్షణ కల్పించాలి.

- లక్ష్మీనారాయణ, అర్చకుడు


అంగనవాడీ భవనానికి  కేటాయించిన స్థలాన్ని.. 

పట్టణంలోని నాగప్ప కాలనీలో అంగనవాడీ  భవన నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని వైసీపీ కౌన్సిలర్‌ అనుచరులు కబ్జాకు యత్నిస్తున్నారు. 1989లో అప్పటి ఎమ్మెల్యే గాదిలింగప్ప నాయీ బ్రాహ్మణుల కోసం సర్వేనెం: 469బీ-3-ఏలో 50 ఇంటి స్థలాలను మంజూరు చేశారు. జీబీసీ కాలువకు ఆనుకుని ఐదు సెంట్ల పొరంబోకు స్థలం ఉంది. అందులో 2.5 సెంట్లను త్రిపుర సుందరీ మినీ కల్యాణ మండపానికి, మిగిలిన 2.5 సెంట్లను అంగనవాడీ కేంద్రం భవన నిర్మాణానికి కేటాయించారు. 2018లో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో అంగనవాడీ భవన నిర్మాణాలు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు. మున్సిపల్‌ వార్డు నంబర్‌ 9లో నాగప్ప కాలనీ, మహబూబ్‌ నగర్‌ కాలనీ, ఎస్సీకాలనీ ప్రాథమిక పాఠశాలతో పాటు పట్టణంలో మరో  60 అంగనవాడీ కేంద్రాల  నిర్మాణానికి కౌన్సిల్‌ తీర్మానం చేసి కలెక్టర్‌కు పంపారు. 2019లో వైసీపీ అధికారంలోకి  రావడంతో భవ న నిర్మాణ పనులు జరగలేదు. ఆ స్థలంలో మున్సిపాలిటీ వారు హెచ్చరిక బోర్డును కూడా ఏర్పాటు చేశారు.  ఆదివారం ఉదయం వైసీపీ కౌన్సిలర్‌ అనుచరులు మున్సిపాలిటీ ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డును తొలగించి స్థలంలోని ముళ్ల కంపలను తొలగించారు. గమనించిన కాలనీవాసులు ఇది అంగనవాడీ స్థలమని వారిని ప్రశ్నించారు. ఇది తమ స్థలమని ఇళ్ల నిర్మాణాలు చేపడతామని అడిగేవారు ఎవరని వైసీపీ కౌన్సిలర్‌ అనుచరులు బెదిరించారు. అధికారులు స్పందించి అంగనవాడీ స్థలాన్ని కబ్జా కోరల నుంచి కాపాడాలని కాలనీవాసులు కోరుతున్నారు.

Updated Date - 2022-06-13T06:35:01+05:30 IST