శ్రీకాళహస్తీశ్వరునికి ‘శివోహమ్’ను సమర్పించిన ఎమ్మెల్యే రోజా

ABN , First Publish Date - 2020-02-23T04:07:18+05:30 IST

పంచ మహాపాతకాల్ని భస్మం చేసి, పరమపుణ్యాలను ప్రసాదించే రుద్ర నమక చమక శక్తుల రహస్య విశేషాలతో పాటు సుమారు నలభై మూడు అపురూప

శ్రీకాళహస్తీశ్వరునికి ‘శివోహమ్’ను సమర్పించిన ఎమ్మెల్యే రోజా

పంచ మహాపాతకాల్ని భస్మం చేసి, పరమపుణ్యాలను ప్రసాదించే రుద్ర నమక చమక శక్తుల రహస్య విశేషాలతో పాటు సుమారు నలభై మూడు అపురూప శివ కవచ, స్తోత్ర, వ్యాఖ్యాన వైభవాలతో కూడిన ప్రముఖ రచయిత ‘శివోహమ్’ గ్రంధాన్ని మహాశివరాత్రి లింగోద్భవకాలంలో తమకు శ్రీకాళహస్తి  వాయులింగేశ్వరుని సన్నిధిలో నగరి ఎమ్మెల్యే ఆర్.కె. రోజా బహూకరించడాన్ని శ్రీకాళహస్తి పండిత అధికార బృందాలు ప్రశంసిస్తున్నాయి. మహాశివరాత్రి పండుగ సందర్భంగా శ్రీకాళహస్తి క్షేత్రంలో మహారుద్రాభిషేకం నిర్వహించి, వేలకొలది అధికార, అనధికార, భక్తబృందాలతో కలిసి తాను కూడా రధోత్సవంలో పాల్గొని మహారధాన్నిలాగి పరవశించిపోయాను అన్నారు రోజా.


శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు, ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ అద్భుత రచనా సొగసుల వ్యాఖ్యాన వైఖరీదక్షతలతో రోజా  గతంలో ప్రచురించిన ‘శ్రీపూర్ణిమ’ అఖండ గ్రంధానికి తిరుమల ప్రధాన అర్చక బృందంతోపాటు, మఠాధిపతులు, పీఠాధిపతుల అనుగ్రహం దక్కడాన్ని  మరువకముందే అద్భుత మంత్రపేటికగా ‘శివోహమ్’ విశేష గ్రంధాన్ని రోజా వెలువరించడాన్ని పార్టీ వర్గాలు, పండిత వర్గాలు అభినందిస్తున్నాయి. శ్రీకాళహస్తీశ్వరుని సన్నిధానంలో ఈ దివ్య మంగళ గ్రంధాన్ని తానే ఆవిష్కరించి, భక్త బృందాలకు అందజేయడం పురాకృత జన్మ సుకృతంగా  భావిస్తున్నట్లు రోజా చెప్పారు.


ఈ సందర్భంగా తొలిప్రతిని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి రోజా అందజేశారు. శివరాత్రి శుభవేళని పురస్కరించుకుని శ్రీకాళహస్తి  దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చంద్రశేఖర్ రెడ్డి పర్యవేక్షణలో ఈ శివోహమ్ గ్రంధాలను అర్చక, వేదపండిత, భక్త బృందాలకు ఉచితంగా వితరణ చెయ్యడం గమనార్హం. రాజకీయాలలోనే కాకుండా, భక్తి కార్యక్రమాల్లో కూడా ఇంత శ్రద్ధగా ఎమ్మెల్యే రోజా పాల్గొనడం తమకు ఆనందంతో పాటు, ఆశ్చర్యాన్ని  కలుగచేస్తోందని ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనరెడ్డి అన్నారు. ఇదే సమయంలో శివోహమ్ గ్రంధాలు రాష్ట్రవ్యాప్తంగా విజయవాడ, విశాఖపట్నం, నగరి, రాజమహేంద్రవరం, కాకినాడ తదితర ప్రాంతాలలో సైతం పవిత్రంగా వేలకొలది భక్తులకు చేర్చిన పురాణపండ శ్రీనివాస్, రోజాలను పొగడ్తలతో ముంచెత్తారు.

Updated Date - 2020-02-23T04:07:18+05:30 IST