వైసీపీ పెద్దలకు రోజా ఫిర్యాదు.. నగరిలో మారిన సీన్

ABN , First Publish Date - 2020-05-27T17:54:09+05:30 IST

వైసీపీ ఎమ్మెల్యే రోజా- డిప్యూటీ సీఎం నారాయణ స్వామీ మధ్య ప్రోటోకాల్ రగడ ఇప్పట్లో కొలిక్కి వచ్చేలా కనపడట్లేదు.!

వైసీపీ పెద్దలకు రోజా ఫిర్యాదు.. నగరిలో మారిన సీన్

తిరుపతి : వైసీపీ ఎమ్మెల్యే రోజా- డిప్యూటీ సీఎం నారాయణ స్వామీ మధ్య ప్రోటోకాల్ రగడ ఇప్పట్లో కొలిక్కి వచ్చేలా కనపడట్లేదు.! ఇప్పటికే ఒకరిపై ఒకరి విమర్శలు గుప్పించుకోవడంతో మీడియాకెక్కిన విషయం తెలిసిందే. అయితే నగరిలో ప్రొటోకాల్ వివాదం తర్వాత పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై పార్టీ పెద్దలకు రోజా ఫిర్యాదు చేసినట్లు తెలియవచ్చింది. దీంతో నగరిలో పరిస్థితులు మారాయి. కల్యాణ మండపం నిర్మాణానికి సహకరించాలంటూ ఎమ్మెల్యే రోజాకు అంబేద్కర్‌ ట్రస్ట్‌ సభ్యుల వినతిపత్రం అందజేయగా నవ్వుతూ స్వీకరించారు. దీంతో పరిస్థితులు కాస్త సద్దుమణిగినట్లేనని తెలుస్తోంది.


మండిపడ్డ అనుచరులు..

కాగా.. ఎస్సీ, ఎస్టీల కోసం కల్యాణమండపం, కమ్యూనిటీ హాలు నిర్మాణం కోసం స్థల పరిశీలనకు మంగళవారం నాడు డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఆదిమూలం, కలెక్టర్‌ నగరి నియోజకవర్గ పరిధిలోని పుత్తూరు పట్టణంలో పర్యటించిన విషయం విదితమే. ఈ కార్యక్రమానికి ప్రొటోకాల్ పాటించలేదని రోజా మండిపడ్డ సంగతి తెలిసిందే. రోజా నగరిలోని తన ఇంట్లోనే ఉన్నా ఆమెను పిలవలేదని ఆమె అనుచరులు మండిపడ్డారు. మంగళవారం సాయంత్రమే దళిత నాయకులు విశ్రాంత జిల్లా జడ్జి దొరస్వామి, సంఘం నాయకులు అపరంజి, కుప్పయ్య, మావూళ్ళయ్యతో మరికొంత మంది రోజాను కలిసి సహకరించాలని కోరారు.


రోజా ఏమన్నారు..!?

ఏం తప్పు చేశామని పిలవలేదు? వాళ్లను వెళ్లవద్దని నేను చెప్పడం లేదు. ఎస్సీల కోసం కల్యాణమండం కట్టడం నాకు కూడా హ్యాపీయే కదా..!. నన్నూ పిలిస్తే  గౌరవంగా ఫీలవుతా కదా! బాధగా ఉంది. పోనీ ఆ మాట జగన్‌ గారిని చెప్పమనండి. ఎమ్మెల్యేను పిలవనవసరం లేదు.. ప్రొటోకాల్‌ లేదు. నా ఇష్టం అంటే సరిపోతుందా? అని డిప్యూటీ సీఎంను రోజా ప్రశ్నించారు.


నారాయణ స్వామి ఏమన్నారు..!?

కాగా రోజా వ్యాఖ్యలకు తిరుపతిలో మీడియాతో మాట్లాడిన నారాయణ స్వామి కౌంటర్‌ ఇచ్చారు.  ‘అక్కడకు వెళ్లడానికి రోజా అనుమతి అవసరం లేదు. కలెక్టర్‌ పుత్తూరు మీదుగా తిరుపతి వెళ్తుంటే తీసుకెళ్లి స్థలాలు చూపించాం. దానితో ఆమెకు ఏం సంబంధం. మా మధ్య ఎలాంటి బేధాభిప్రాయాల్లేవ్. కల్యాణ మండపం విషయాలన్నీ ఎమ్మెల్యే రోజా సోదరుడికి చెప్పాను’ అని రోజాకు డిప్యూటీ సీఎం కౌంటరిచ్చారు. ఈ ఇద్దరి వ్యవహారం అటు వైసీపీలో.. ఇటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.

Updated Date - 2020-05-27T17:54:09+05:30 IST