ఆగర్తిపాలెంలో ఇంటింటికి కార్యక్రమంలో ఎమ్మెల్యే నిమ్మల
పాలకొల్లు అర్బన్, జూన్ 30: పంట నష్టాలతో రైతుల ఇబ్బందులు వర్ణనాతీతమని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. మూడేళ్లలో 9 తుఫాన్లు, అకాల వర్షాలతో పంట నష్టపోతే ప్రభుత్వం ఏవిధంగానూ ఆదుకోలేదన్నారు. మండలంలోని ఆగర్తిపాలెం గ్రామంలో గురువారం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిమ్మల చేపట్టారు. గ్రామంలో ఓటర్ల జాబితా పరిశీలనతో పాటు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. పంట నష్టపోయిన రైతులకు బీమా ఇస్తున్నామని చెప్పడం, ప్రకటనలు ఇవ్వడం, బటన్లు నొక్కడం చేస్తున్న సీఎం జగన్ రైతుల ఆవేదన అర్థం చేసుకోవాలని నిమ్మల కోరారు. పంట, మురుగు కాలువలు ప్రక్షాళన చేయకపోవడంతో రైతులకు ఎంతో నష్టం కలుగుతోందన్నారు. ఎమ్మెల్సీ అంగర రామమోహన్, నాయకులు కోడి విజయభాస్కర్, కావలి నరసింహారావు, కావలి సోమేశ్వరరావు, జాన్‌రాజు, అబేల్‌రాజు, రాయి శేఖర్, శ్రీరెడ్డి చిన్నబాబు పాల్గొన్నారు.