కో-ఆప్షన్‌ కోసం ఎమ్మెల్యే ముస్తఫా కుమార్తె దరఖాస్తు

ABN , First Publish Date - 2021-08-20T05:36:38+05:30 IST

నగరపాలకసంస్థ కో-ఆప్షన్‌ సభ్యుల ఎంపిక వైసీపీలో రసవత్తరంగా మారింది. ముఖ్యంగా మైనార్టీ కోటాలో భర్తీ చేయనున్న రెండు పదవులపై ఉత్కంఠ రేకెత్తిస్తోన్నది.

కో-ఆప్షన్‌ కోసం ఎమ్మెల్యే ముస్తఫా కుమార్తె దరఖాస్తు

ముస్లిం కోటాలో మస్తాన్‌షరీఫ్‌కి ఇస్తానని గతంలోనే హామీ

ఇప్పుడు కుమార్తె దరఖాస్తుతో విస్తుబోతోన్న వైసీపీ వర్గాలు

గుంటూరు, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): నగరపాలకసంస్థ కో-ఆప్షన్‌ సభ్యుల ఎంపిక వైసీపీలో రసవత్తరంగా మారింది. ముఖ్యంగా మైనార్టీ కోటాలో భర్తీ చేయనున్న రెండు పదవులపై ఉత్కంఠ రేకెత్తిస్తోన్నది. వీటిలో ఒకటి గుంటూరు తూర్పునకు, మరొకటి పశ్చిమ నియోజకవర్గానికి కేటాయించాలని పార్టీ పెద్దలు నిర్ణయించారు. ఆ మేరకు పశ్చిమ నుంచి పటాన్‌ సైదా ఖాన్‌కి దాదాపుగా ఖరారైపోయిందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా తూర్పు నియోజకవర్గం నుంచి ఇచ్చే పదవిపై సస్పెన్స్‌ నెలకొన్నది. నిన్న, మొన్నటి వరకు కూరగాయల మార్కెట్‌ హోల్‌సేల్‌ వ్యాపారి షేక్‌ మస్తాన్‌ షరీఫ్‌కి ఖాయమని అంతా భావిస్తోన్న తరుణంలో తాజాగా ఎమ్మెల్యే ముస్తఫా కుమార్తె షేక్‌ నూరి ఫాతిమా కో-ఆప్షన్‌ పదవి కోసం దరఖాస్తు చేయడం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఈ పదవిని ఎమ్మెల్యే తన కుమార్తెకు ఇవ్వాలని దరఖాస్తు వేయించారా లేక మస్తాన్‌ షరీఫ్‌ దరఖాస్తు ఏ కారణం చేతనైనా తిరస్కరిస్తే ప్రత్యామ్నాయంగా ఉంటుందని దాఖలు చేయించారా అనేది సస్పెన్స్‌గా మారింది. కాగా జనరల్‌ కోటాలో ముగ్గురు సభ్యుల ఎంపిక కూడా రక్తి కట్టిస్తోన్నది. మొత్తం తొమ్మిది మంది అభ్యర్థులు ఈ మూడు పదవుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారిలో మాజీ కార్పొరేటర్లు ఆల సాంబశివరావు, వంజరపు రత్నకుమారి, బత్తుల దేవానంద్‌, మోతుకూరి వెంటక బాలత్రిపుర సుందరి, షేక్‌ రహీమున్నీసా, షేక్‌ చాంద్‌బాషా, పూనూరి నాగేశ్వరరావు ఉన్నారు. వీరితో పాటు మునిసిపల్‌ పరిపాలనలో అనుభవం లేకపోయినా కూరాకుల కోటేశ్వరరావు, జెల్ది స్వామినాథన్‌ నామినేషన్‌లు వేయగా వీరు అనర్హులుగా రీమార్కుల్లో పేర్కొన్నారు. షేక్‌ చాంద్‌బాషా గడువు దాటిన తర్వాత దరఖాస్తు ఇచ్చారని పేర్కొంటూ తిరస్కరించారు. బత్తుల దేవానంద్‌కి ఇటీవలే గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ పదవి రావడంతో ఆయన్ని అనర్హుడిగా చేశారు. దీంతో జనరల్‌ కోటాలో ఉన్న మూడు పదవుల్లో ఎవరిని నియమిస్తారనేది ఉత్కంఠని రేకెత్తిస్తోన్నది. తూర్పు నుంచి పూనూరి నాగేశ్వరరావు ఖరారైనట్లుగా ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో మిగిలి ఉన్న రెండు పదవుల కోసం రత్నకుమారి, రహీమున్నీసా, ఆల సాంబశివరావు, బాల త్రిపురసుందరి పోటీ పడుతున్నారు. జనరల్‌ కోటాలో కనీసం ఒక మహిళని ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రత్నకుమారి, రహీమున్నీసా, బాలత్రిపుర సుందరిలో ఒకరికి అవకాశం వస్తుంది. 

బకాయిలు చెల్లిస్తున్న దరఖాస్తుదారులు

కో-ఆప్షన్‌ సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకొన్న వారు నగరపాలకసంస్థకి ఎలాంటి పన్ను/అద్దె బకాయి ఉండటానికి వీల్లేదు. ఒకవేళ అలా ఉంటే అనర్హులుగా ప్రకటించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల నుంచి ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారంతా బకాయిలు చెల్లించేస్తున్నారు.

 

Updated Date - 2021-08-20T05:36:38+05:30 IST