చేష్టలుడిగి చూస్తున్నారు

ABN , First Publish Date - 2021-10-19T05:03:53+05:30 IST

చర్ల మండలంలో ఓ కంపెనీ మిర్చి మొక్కలు నాటి రైతులు నిలువునా నష్ట పోతుంటే మండల వ్యవసాయ శాఖ, ఉద్యానశాఖ అధికారులు ఏం చేస్తున్నారని భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య అగ్రహం వ్యక్తం చేశారు. మూడు రోజులుగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితమైన కథనాలకు ఎమ్మెల్యే స్పదించారు.

చేష్టలుడిగి చూస్తున్నారు
మిర్చి మొక్కలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే, అధికారులు, ప్రజాప్రతినిధులు

రైతులు నష్టపోతుంటే ఏం చేస్తున్నారు?

వ్యవసాయాధికారులపై ఎమ్మెల్యే వీరయ్య మండిపాటు

విత్తనాలను ఎందుకు పరీక్షించలేదని ఆగ్రహం

రైతులతో కలిసి మిరప మొక్కల పరిశీలన

నివేదిక తయారు చేయాలని అధికారులకు ఆదేశం

చర్ల, అక్టోబరు 18: చర్ల మండలంలో ఓ కంపెనీ మిర్చి మొక్కలు నాటి రైతులు నిలువునా నష్ట పోతుంటే మండల వ్యవసాయ శాఖ, ఉద్యానశాఖ అధికారులు ఏం చేస్తున్నారని భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య అగ్రహం వ్యక్తం చేశారు. మూడు రోజులుగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితమైన కథనాలకు ఎమ్మెల్యే స్పదించారు. సోమవారం మండల అధికారులతో కలిసి గొంపల్లి, మొగళ్లపల్లి, వీరాపురంలో, లింగాపురంలో రైతులు పీకేసిన మిరప మొక్కలను పరిశీలించారు. ఈసందర్భంగా రైతులతో మాట్లాడారు. నాణ్యత లేని విత్తనాలు అంట గట్టారని, ఎదుగుదల లేకపోవడంతో మొక్కలను పీకేస్తున్నామని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా విత్తనాలు ఇచ్చిన వారు కన్నెత్తి కూడా చూడటం లేదని రైతులు వాపోయారు. ఎకరాకు సుమారు లక్షన్నర ఖర్చు చేశామని, ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకు పోయామని కన్నీటి పర్యంతమయ్యారు. రైతుల సమస్యలు విన్న ఎమ్మెల్యే, మొక్కలను పరిశీలించి మాట్లాడారు. విత్తనాలు ఇచ్చేటప్పుడు అధికారులు ఎందుకు వాటికి పరీక్షలు చేయలేదని అన్నారు. ఇక్కడి పరిస్థితులను చూస్తే స్థానిక అధికారులు వ్యాపారులకు సహకరిస్తున్నట్టుగా అవగతమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్ల మండలంలో ఓ కంపెనీ మొక్కలను 750 ఎకరాల్లో సాగు చేసి రైతులు నష్ట పోయారని తెలిపారు. ప్రతీ ఎకరాకు సుమారు రూ.లక్షన్నర ఖర్చు చేశారని మొత్తం రూ. 12 కోట్ల నష్టం వచ్చిందన్నారు. రైతులకు వెంటనే నష్ట పరిహారం చెల్లించాలని, స్థానిక అధికారుల, డీలర్లు బాధ్యత తీసుకోవాలన్నారు. ఇదే సమస్యపై కలెక్టర్‌తో మాట్లాడానని, సమస్యపై వినతిపత్రాన్ని కూడా అందిస్తామని తెలిపారు. సమస్య పరిష్కారం కాక పోతే శాసన సభలో కూడా సమస్యను లేవనెత్తి రైతులకు న్యాయం చేస్తామని అన్నారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్‌ పార్టీ డివిజన్‌ నాయకులు నల్లపు దుర్గాప్రసాద్‌, జవ్వాది రవికుమార్‌, భాష్కర్‌ రెడ్డి, జడ్పీటీసీ ఇర్పా శాంత, ఎంపీపీ గీదా కోదండ రామయ్య, యూత్‌ నాయకులు పండు, నాయుడు, కొత్తపల్లి ఆంజనేయులు, తహసీల్దార్‌ నాగేశ్వరావు, ఏవో శివరాం ప్రసాద్‌, ఆర్‌ఐ నళిన్‌ కుమార్‌, రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-19T05:03:53+05:30 IST