ఉదయగిరిని సస్యశ్యామలం చేస్తా

ABN , First Publish Date - 2021-10-28T04:11:53+05:30 IST

మెట్టప్రాంతమైన ఉదయగిరికి వెలుగొండ రిజర్వాయరు, సోమశిల హైలెవల్‌ కెనాల్‌ ద్వారా జలాలు తెప్పించి నియోజకవర్గంలో సాగు, తాగునీటి ఇబ్బందులు రాకుండా సస్యశ్యామలం చేస్తానని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు.

ఉదయగిరిని సస్యశ్యామలం చేస్తా
మాట్లాడుతున్న ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి

ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి

జలదంకి, అక్టోబరు 27: మెట్టప్రాంతమైన ఉదయగిరికి వెలుగొండ రిజర్వాయరు, సోమశిల హైలెవల్‌ కెనాల్‌ ద్వారా జలాలు తెప్పించి నియోజకవర్గంలో సాగు, తాగునీటి ఇబ్బందులు రాకుండా సస్యశ్యామలం చేస్తానని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని చోడవరంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్‌క్లినిక్‌లను ఎమ్మెల్యే బుధవారం ప్రారంభించారు. అనంతరం సర్పంచు వల్లంరెడ్డి సుబ్బమ్మ అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ సీఎం జగన్‌పై టీడీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయడం, కోర్టులకు వెళ్లి పేదలకు ఏ పథకాలు అందకుండా అడ్డుకోవడం, ప్రభుత్వానికి 151మంది ఎమ్మెల్యేల బలముండగా రాష్ట్రపతిపాలన పెట్టాలనడం చూస్తుంటే వచ్చే 2024 ఎన్నికలలో చంద్రబాబుకు మూడుసీట్లు కూడా రావన్నారు. మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడు పాలవల్లి మాలకొండారెడ్డి మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యే మేకపాటికే వైసీపీ ఎమ్మెల్యే టిక్కెట్‌ వస్తుందని, ఎవరైనా టికెట్‌ కోసం కలలు కంటే అవి కలగానే మిగిలిపోతాయని, ఇందుకు సంబంధించి అదిష్ఠానం నుంచి మాకు సంకేతాలు అందాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మేదరమెట్ల శివలీల, ఎంపీపీ గోచిపాతల వెంకటరమణయ్య, తహసీల్దార్‌ సీతామహాలక్ష్మి, ఎంపీడీవో భాస్కర్‌, సొసైటీ అధ్యక్షుడు కేతిరెడ్డి రవిరెడ్డి, మాజీ సొసైటీ అధ్యక్షుడు గుర్రం జగ్గయ్య, వైసీపీ మండల కన్వీనర్‌ దగుమాటి మాల్యాద్రిరెడ్డి, నాయకులు చేవూరి జనార్దన్‌రెడ్డి, తిప్పారెడ్డి ఇందిరమ్మ, వల్లంరెడ్డి నరసారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-28T04:11:53+05:30 IST