ఈడీ ఎదుట హాజరైన ఎమ్మెల్యే మంచిరెడ్డి

ABN , First Publish Date - 2022-09-28T07:52:44+05:30 IST

నిన్న మొన్నటి వరకు ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో అధికార పార్టీ నాయకుల అనుచరుల్ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారించడం సంచలనంగా మారింది.

ఈడీ ఎదుట హాజరైన ఎమ్మెల్యే మంచిరెడ్డి

  • ఫెమా ఉల్లంఘన కేసులో ఎనిమిది గంటలపాటు విచారణ
  • నేడు కూడా విచారణకు రావాలని ఈడీ నోటీసులు

హైదరాబాద్‌ / ఇబ్రహీంపట్నం, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): నిన్న మొన్నటి వరకు ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో అధికార పార్టీ నాయకుల అనుచరుల్ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారించడం సంచలనంగా మారింది. ఇప్పుడు ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యేను ఈడీ అధికారులు విచారించడం తెలంగాణ రాజకీయ వర్గాల్లో మరింత సంచలనంగా మారింది. సుమారు 8గంటలపాటు ఈడీ అధికారులు ఎమ్మెల్యేను విచారించడం గమనార్హం. రాష్ట్రంలో ఇంత సుదీర్ఘ సమయం ఈడీ ఒకర్ని విచారించడం ఇదే మొదటిసారి. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) నిబంధనలను ఉల్లంఘించారన్న ఆరోపణలతో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిపై ఈడీ కేసు నమోదుచేసింది. కేసు విచారణలో భాగంగా తమ ఎదుట హాజరుకావాలన్న ఈడీ ఆదేశాల మేరకు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మంగళవారం ఈడీ అధికారుల ఎదుట హాజరయ్యారు. ఉదయం 11-30 గంటలకు ఈడీ కార్యాలయంలోకి వెళ్లిన ఎమ్మెల్యేను అధికారులు సుమారు 8గంటలకుపైగా విచారించి, రాత్రి 9గంటల ప్రాంతంలో తిరిగి పంపించారు.


 మంగళవారం కూడా విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు జారీచేసింది. ఈడీ అధికారులు మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని విచారిస్తున్న సమయంలో ఆయనపై పలు ఆరోపణలు ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఇండోనేషియాలో గోల్డ్‌ మైనింగ్‌లో పెట్టుబడులు, క్యాసినో తదితర కేసులకు సంబంధించి ప్రచారం జరిగింది. అయితే 2014లో మంచిరెడ్డిపై నమోదైన కేసుకు సంబంధించి ఈడీ అధికారులు నోటీసులు జారీచేసి విచారించారు. మంచిరెడ్డి కిషన్‌రెడ్డి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 2014 ఆగస్టులో ఆస్ట్రే్ట్రలియా, న్యూజీలాండ్‌ పర్యటనకు వెళ్లారు. అప్పట్లో యాక్సిస్‌ బ్యాంకు నుంచి ఫారెక్స్‌ కార్డు తీసుకుని వెళ్లారు. పర్యటన మధ్యలో డబ్బులు అవసరం కావడంతో తెలిసిన వారి నుంచి వెస్ట్రన్‌ యూనియన్‌ మనీ ఎక్ఛేంజ్‌ ద్వారా 2వేల డాలర్లు తీసుకున్నారు. అప్పటి మారక విలువ ప్రకారం ఆ మొత్తం విలువ లక్షా 20వేల రూపాయలు. దీన్ని ఈడీ అనుమానాస్పద లావాదేవీగా భావించి 2018లో నోటీసులు జారీచేసింది. అప్పట్లో ఈడీ నోటీసులకు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి రాతపూర్వక సమాధానం ఇచ్చారు.


 ఆ తర్వాత ఇప్పుడు మరోసారి పాత కేసుకు సంబంధించి ఈడీ ఎమ్మెల్యేకు నోటీసులు జారీచేసింది. మొదట ఈ నెల 23న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. అయితే ఆ రోజు ఇతర కేసులతో బిజీగా ఉండటంతో 27న (మంగళవారం) విచారణకు రావాల్సిందిగా సమాచారం అందించింది. ఈ మేరకు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మంగళవారం విచారణకు హాజరయ్యారు. ఈడీ విచారణ అనంతరం మీడియాకు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈడీ ఆఫీసు సిబ్బంది సహకారంతో వెనుక గేటు నుంచి బయటకు వచ్చి తన కారులో వెళ్లిపోయారు. కాగా.. ఈడీ నిష్పక్షపాతంగా విచారణ జరిపి మంచిరెడ్డి కిషపన్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఇబ్రహీంపట్నం ప్రజల పరువును ఈడీ కార్యాల యం ముందు తాకట్టు పెట్టారని మల్‌రెడ్డి విమర్శించారు. భూ కబ్జాలు చేసి కోట్లు గడించి హవాలా ద్వారా విదేశాలకు డబ్బులు పంపించారని ఆరోపించారు.

Updated Date - 2022-09-28T07:52:44+05:30 IST