డైలమాలో రాజగోపాల్‌రెడ్డి!

ABN , First Publish Date - 2022-07-29T08:48:00+05:30 IST

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీ మార్పు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా... వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. సాధారణ ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా భావిస్తున్న మునుగోడు ఉప ఎన్నికపై బీజేపీ,

డైలమాలో రాజగోపాల్‌రెడ్డి!

రాజీనామాకు బీజేపీ ఒత్తిడి

ఉప ఎన్నిక బరిలో దిగాలని పట్టు

తర్జనభర్జన పడుతున్న ఎమ్మెల్యే

ఆచితూచి అడుగేస్తున్న కాంగ్రెస్‌

చేరికకు కొంత టైం కావాలి!

బీజేపీ ముఖ్యులను కోరిన రాజగోపాల్‌రెడ్డి


నల్లగొండ, జూలై 28 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీ మార్పు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా... వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. సాధారణ ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా భావిస్తున్న మునుగోడు ఉప ఎన్నికపై బీజేపీ, కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ నేతలు ఎవరి కోణంలో వారు చూస్తున్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ దూ కుడును ప్రదర్శిస్తుండగా కాంగ్రెస్‌ వేచిచూసే ధోరణిలో ఉంది. పార్టీ మార్పుపై స్పష్టతతో ఉన్నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా, పోటీపై రాజగోపాల్‌రెడ్డి డైలమాలో పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాను ఎన్నటికీ మునుగోడును వదిలి వెళ్లనని ప్రకటించిన ఆయన..కార్యకర్తలను కాపాడుకునేందుకు ముమ్మర యత్నాలు చేస్తున్నారు.


గెలిపించుకుటామన్న ధీమాలో బీజేపీ

వాస్తవానికి దక్షిణ తెలంగాణ జిల్లాల్లో బీజేపీకి ఏ మాత్రం పట్టులేదు. వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మహబూబ్‌నగర్‌, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోని 34 నియోజకవర్గాల్లో కదలిక తెచ్చేందుకు వ్యూహాత్మకంగానే రాజగోపాల్‌రెడ్డిని బీజేపీ ఎంచుకుందన్న ప్రచారం జరుగుతోంది. ‘‘మునుగోడులో ఉప ఎన్నిక వస్తే పక్కాగా గెలుస్తాం. ఈ మేరకు సర్వేలు స్పష్టం చేశాయి. ఉప ఎన్నిక రాగానే ఢిల్లీ నుంచి గల్లీ వరకు నేతలంతా మునుగోడులోనే మకాం వేసి గెలిపించుకుంటాం. ఈ విషయాలన్నీ రాజగోపాల్‌రెడ్డికి ఢిల్లీ నేతలు వివరించారు. ఆయన రాజీనామా చేసిన తర్వాతే పార్టీ కండువా కప్పుకోవాల్సి ఉంటుంది’’ అని బీజేపీకి చెందిన కీలక నేతలు చెబుతున్నారు. అయితే, రాజీనామా చేసే అంశంపై ఆగస్టు 7 వరకు సమయం కావాలని రాజగోపాల్‌రెడ్డి బీజేపీ నేతలను కోరినట్లు తెలిసింది. 


దూరదృష్టితో కాంగ్రెస్‌ అడుగులు

పార్టీ మార్పుపై మూడేళ్ల నుంచీ పరోక్షంగా చెబుతూనే ఉన్న రాజగోపాల్‌రెడ్డిని ఇంకా బుజ్జగించడమేంటని క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌ శ్రేణులు ఆశ్చర్యపోతున్నాయి. అయితే, దూరదృష్టితోనే పార్టీ వేచి చూస్తోందని ఆ పార్టీ కీలక నేత ఒకరు ‘ఆంధ్రజ్యోతి’తో వ్యాఖ్యానించారు. ‘‘రాజగోపాల్‌రెడ్డిపై సస్పెన్షన్‌ వేటు వేస్తే ఆయన వెంటనే బీజేపీలో చేరిపోతారు. ప్రస్తుత పరిస్థితుల్లో మునుగోడు ఉప ఎన్నికలో ప్రధాన పోరు టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్యే జరుగుతుంది. రాజగోపాల్‌ బీజేపీలో చేరి ఉపఎన్నిక ముగిస్తే ఇక ఆయన దక్షిణాది జిల్లాలే లక్ష్యంగా విస్తృతంగా పర్యటిస్తారు. ఆయన పర్యటనలతో మొదట నష్టపోయేది కాంగ్రెస్సే. కాంగ్రెస్‌ కంచుకోటగా నిలిచిన నల్లగొండ బీటలు వారుతుందన్న సంకేతాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ ప్రకంపనలు కొద్ది నెలల్లోనే ఖమ్మం, మహబూబ్‌నగర్‌కు పాకుతాయి’’ అని ఆయ న పేర్కొన్నారు.


ఈ నేపథ్యంలోనే రాజగోపాల్‌ను పిలిచి మాట్లాడి ఆయన సంతృప్తి చెందే స్థానాన్ని కట్టబెట్టడమే ప్రస్తుత తరుణంలో మంచిదన్న అభిప్రాయంలో రాష్ట్ర కీలక నేతలు ఢిల్లీలో ఓ అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ‘‘ఇప్పటికిప్పుడు తొందరపడి సస్పెన్షన్‌ వేటు వేసి, భరోసా సభలు నిర్వహిస్తే ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్లు ఉంటుంది. మన ప్రయత్నాలన్నీ విఫలమైతే అప్పుడు మునుగోడులో క్యాడర్‌ను కాపాడుకునేందుకు ఏం చేయాలి, ఎవరెవరు ఏ బాధ్యతలు తీసుకోవాలో ఆలోచిస్తే మంచిది’’ అన్న యోచనకు వచ్చినట్లు సమాచారం.  


టీఆర్‌ఎ్‌సలో పోటా పోటీగా..

ఉప ఎన్నిక ఖాయమని టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం స్పష్టమైన సంకేతాలు ఇస్తుండడంతో ఆశావహులు పెద్ద సంఖ్యలో పోటీ పడుతున్నారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ను కలిసేందుకు మార్గాలు వెతుక్కుంటున్నారు. సర్వేల్లో తమ పేర్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ నియోజకవర్గంలోని టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధుల మద్దతు కూడగట్టుకునేందుకు యత్నిస్తున్నారు. రాత్రివేళ విందు సమావేశాలు జోరుగా నడుపుతున్నారు. ఉప ఎన్నిక వస్తే దళితబంధు, ఆసరా పెన్షన్‌, రోడ్లు వంటివి పెద్ద సంఖ్యలో మంజూరు కావడమే కాకుండా ఓటుకు పెద్ద సంఖ్యలో రేటు పలికే అవకాశం ఉంటుందని కుల సంఘాలు నేతలు, ఓటర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు జోరుగా చర్చించుకుంటున్నారు. 


చౌటుప్పల్‌ మండల నేతలతో భేటీ

ఎన్నో ఆశలతో మంచి మెజార్టీతో తనను గెలిపించినా  ప్రజలు, నాయకులకు ఏ మాత్రం లబ్ధి చేకూర్చలేకపోయానని రాజగోపాల్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని తన స్వగృహంలో చౌటుప్పల్‌ మండల నేతలతో  గురువారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ ఎన్నిక వచ్చినా తాను మునుగోడును వదిలిపోనని స్పష్టం చేశారు. త్వరలో నియోజకవర్గంలోని కీలక నేతలందరినీ ఓ చోట సమావేశపరుస్తానని చెప్పారు.


కేసీఆర్‌ నియంతృత్వ, కుటుంబ పాలనను ఎదిరించాలంటే బీజేపీలో చేరక తప్పడం లేదని వివరించారు. రాష్ట్రం లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని రాజగోపాల్‌ ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటి కన్నా ఉన్నతమైన పదవి ఆ ప్రభుత్వంలో వస్తుందని, అందరికీ న్యాయం జరుగుతుందని భరోసా కల్పించే యత్నం చేశారు. అయితే, కొన్ని రోజులుగా కార్యకర్తలతో నిర్వహిస్తున్న సమావేశాల్లో.. బీజేపీలోకి రాలేమని కొందరు, పోటీ చేస్తే విజయం సాధించలేమని మరికొందరు చెబుతుండడం, ఉప ఎన్నికలో ఓడిపోతే తమ రాజకీయ భవిష్యత్తు ఏంటని ఇంకొందరు ప్రశ్నిస్తుండడంతో.. రాజగోపాల్‌రెడ్డి సైతం డైలమాలో పడ్డట్టు తెలుస్తోంది. ‘ఏదేమైనా నా అభిప్రాయాన్ని వారం పాటు గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లి చర్చ పెట్టండి.. నియోజకవర్గ ప్రజలే నిర్ణయం తీసుకుంటారు. ఈలోపు నేను కూడా సర్వేలు చేయించుకుంటా. పరిస్థితిని బట్టి పోటీకి సిద్ధమవుదాం’ అని నేతల సందేహాలకు రాజగోపాల్‌రెడ్డి సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. 

Updated Date - 2022-07-29T08:48:00+05:30 IST